ఈ రిజర్వేషన్లు.. దేశానికే దిక్చూచి!

by Ravi |   (  Updated:2025-07-13 01:15:24  IST  )

1920 సంవత్సరంలో సయ్యద్ సిరాజ్ ఉల్ హసన్ నేతృత్వంలో నిజాం ప్రభుత్వం ఆదేశాల మేరకు గుర్తింపు పొందిన 98 హైదరాబాద్ రాష్ట్ర కులాల

ఈ రిజర్వేషన్లు.. దేశానికే దిక్చూచి!
X

1920 సంవత్సరంలో సయ్యద్ సిరాజ్ ఉల్ హసన్ నేతృత్వంలో నిజాం ప్రభుత్వం ఆదేశాల మేరకు గుర్తింపు పొందిన 98 హైదరాబాద్ రాష్ట్ర కులాల వారి జనాభా లెక్కింపును, వారి గోత్రాలను ,రాజకీయ ఆర్థిక సామాజిక కట్లుబాట్లతో సహా సవివరమైన నివేదికలు తయారు చేసింది. 104 సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 75 అంశాలతో కూడిన రాజకీయ, ఆర్థిక, సామాజిక, విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాలకు సంబంధించిన వివిధ అంశాలతో కులాల వారీగా శాస్త్రీయంగా ప్రతీ ఇంటి నుండి సేకరించిన గణాంకాలను విస్తృత అధ్యయనం చేసిన తర్వాత అసెంబ్లీలో బీసీలకు 42% విద్యా ఉద్యోగాలు స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు ఇవ్వాలనే తీర్మానం చేసింది.

బీసీ రిజర్వేషన్‌ను మండల కమిషన్ పుణ్యమా అని కేంద్ర ఉద్యోగాల్లో 59 సంవత్సరాల తర్వాత, కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థల్లో కేవలం 27% ఇచ్చింది కేంద్రం. వివిధ న్యాయ స్థానాల తీర్పుల్లో చెప్పినట్టు ఖచ్చితమైన బీసీ గణాంకాలు ఉంటే స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించవచ్చనే వాదంతో ఎన్నికలకు ముందు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ద్వారా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది.

బీసీ సంఘాల ఒత్తిడితో..

ఆ ప్రకారం రాష్ట్రంలో కుల గణన ద్వారా పూర్తి గణాంకాలు సేకరించి విస్తృతమైన అధ్యయనం చేసిన తర్వాత, అసెంబ్లీలో బీసీ బిల్లులు పెట్టి దానిని తొమ్మిదవ షెడ్యూల్‌లో చేర్చాలని కేంద్ర ప్రభుత్వానికి 2025 ఏప్రిల్‌లో పంపింది రాష్ట్ర ప్రభుత్వం. కానీ నేటి వరకు కేంద్రం నుంచి ఎటువంటి సమాచారం లేకపోవడంతో ఇక్కడ పంచాయతీ ఎన్నికలు దాదాపు ఏడు నెలలుగా వాయిదా పడుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీసీ సంఘాల తీవ్రమైన ఒత్తిడితో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు 42 శాతానికి పెంచి ఎన్నికలకు వెళ్లాలని మంత్రి మండలి నిర్ణయించింది. దీంతో తెలంగాణ వెనుకబడిన వర్గాల వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

బీసీ రిజర్వేషన్లకు పీవీ నాంది

1992 సంవత్సరంలో పీవీ నరసింహారావు కాంగ్రెస్ ప్రభుత్వం 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా 243 అధికరణం ప్రవేశపెట్టడం ద్వారా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లని మొట్టమొదటిసారిగా ప్రోత్సహించింది. తదుపరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీ రామారావు ప్రభుత్వం 1994లో 34% బీసీ రిజర్వేషన్‌లను స్థానిక సంస్థలలో అమలు పరిచి ఆ తర్వాత అనేక సార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలు జరగడానికి దోహదపడింది.

కేసీఆర్ తప్పుడు నిర్ణయంతో..

హైకోర్టులో 34 శాతం రిజర్వేషన్ల మీద వ్యతిరేక తీర్పు వచ్చిన సందర్భంలో సుప్రీంకోర్టులో స్టే తెచ్చుకొని కాంగ్రెస్ ప్రభుత్వాలు పంచాయతీ ఎన్నికలను సకాలంలో 34% బీసీ రిజర్వేషన్‌తో నిర్వహించుకున్నాయి. కానీ 2014లో కేసీఆర్ ప్రభుత్వం చేసిన తప్పుడు నిర్ణయాలతో, న్యాయస్థానాల్లో సరైన వాదనలు సమర్పించకపోవడంతో తెలంగాణ స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు 18 శాతం, 23 శాతం మధ్య నిర్ణయించబడ్డాయి. దాంతో వెనుకబడిన వర్గాలు స్థానిక సంస్థలలో వేలాది స్థానాలు కోల్పోయాయి. ఇక స్థానిక సంస్థల రిజర్వేషన్ వివాదాల్లో 1994లో ఆర్టికల్ 243 పై సవాల్ చేసిన కృష్ణమూర్తి వర్సెస్ కేంద్ర ప్రభుత్వం కేసులో 16 సంవత్సరాల తర్వాత 2010లో తీర్పు వచ్చింది. ఈ తీర్పులో బీసీ సామాజికవర్గానికి స్థానిక సంస్థలో రిజర్వేషన్ ఇవ్వాలంటే కచ్చితంగా గణాంకాలు స్పష్టంగా ఉండాలని చెప్పడం జరిగింది.

తెలంగాణ సర్వే చట్టబద్దమే!

1994లో తమిళనాడు ప్రభుత్వం, బీసీ వర్గాల ఆందోళనలతో కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి తమిళనాడు రిజర్వేషన్ చట్టాన్ని రాజ్యాంగం 9వ షెడ్యూల్లో పెట్టడం ద్వారా రిజ ర్వేషన్లు రాజ్యాంగ సమీక్ష‌కు అవకాశం లేకుండా చేసుకుంది. ఆ విధంగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రిజర్వేషన్ చట్టాన్ని 9వ షెడ్యూల్‌లో చేర్చే విషయంలో తన ఆందోళనలకు ప్రజాస్వామ్య వాదులు వెనుకబడిన వర్గాల మద్దతు కూడగట్టి పార్లమెంట్‌లో తమ పార్టీ ద్వారా బిల్లు ప్రవేశపెట్టించి ఆమోదం తెలిపేలా చేయాలి. ఒకవేళ అలా జరగకపోతే 1992లో ఇందిరా సహాని వర్సెస్ భారత ప్రభుత్వం కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెబుతూ అనివార్య పరిస్థితుల్లో బిసీ రిజర్వేషన్లు 50 శాతానికి పైబడి పెంచుకోవచ్చని, కానీ గణాంకాలు కచ్చితంగా ఉండాలని చెప్పడం జరిగింది. ఆ కేసు తీర్పును అనుసరించే ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వం మొత్తం రిజర్వేషన్ల‌ను 78 శాతానికి పెంచిన విషయం అందరికీ తెలిసిందే. అక్కడి లాగే తెలంగాణ ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన కుల గణన సర్వే శాస్త్రీయం, సమగ్ర గణాంక సహితం కాబట్టి న్యాయస్థానాల్లో 42% పెంపుపై ఎటువంటి ఆటంకం కలగదని కచ్చితంగా చెప్పవచ్చు.

కుల గణనపై అప్రమత్తత అవసరం!

ఇండియా కూటమి, బీసీ చైతన్యంతో ఆందోళన చేస్తూ మోడీ ప్రభుత్వాన్ని అనుక్షణం నిలదీస్తున్న ఆందోళనకారుల ఒత్తిడికి తలవంచిన కేంద్ర ప్రభుత్వం 94 ఏళ్ల తర్వాత 2025 ఏప్రిల్‌లో భారతదేశంలో సాధారణ జనాభా లెక్కలతో పాటు అనేక ప్రాధాన్యత అంశాలతో కూడిన సమగ్ర కుల గణనను 2026 మార్చి నుండి చేపడతామని ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. కానీ మోడీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంతో ఉన్న గత అనుభవాలు, బీజేపీ పార్టీ అనేక సార్లు చేసిన కప్పదాట్ల జ్ఞాపకాల నేపథ్యంలో వెనుకబడిన వర్గాల అప్రమత్తత మాత్రమే ఆ వర్గ ఆశలు నెరవేరడానికి దోహదపడుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు.

ఆళ్ల రామకృష్ణ

విశ్రాంత చీఫ్ ఇంజనీర్

99669 44244

Next Story