కరోనా ఎఫెక్ట్ : ఈసీబీ రూ. 570 కోట్ల ప్యాకేజీ

by  |
కరోనా ఎఫెక్ట్ : ఈసీబీ రూ. 570 కోట్ల ప్యాకేజీ
X

కరోనా మహమ్మారి క్రీడారంగాన్ని నష్టాల బాట పట్టిస్తోంది. ముఖ్యంగా పలు దేశాల క్రికెట్ బోర్డులు ఈ ఏడాది రెవెన్యూ లోటును ఎదుర్కోక తప్పేలా లేదు. ఇక బోర్డులకు అనుబంధంగా ఉండే అసోసియేషన్లకు నిధుల లేమి వెంటాడుతోంది. షెడ్యూల్ ప్రకారం ఇంగ్లాండ్‌లో ప్రస్తుతం క్రికెట్ సీజన్ ప్రారంభం కావాల్సి ఉండగా.. కరోనా ప్రభావం కారణంగా ఆలస్యంగానైనా ప్రారంభమయ్యే అవకాశాలు కూడా లేవు. దీంతో ఇంగ్లాండ్‌లోని కౌంటీలు, క్రికెట్ క్లబ్స్.. నిధుల కొరతతో ఇబ్బందులు పడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్ (ఈసీబీ) మంగళవారం భారీ ప్యాకేజీ ప్రకటించింది.

‘తరానికి ఒక్కసారే’ (వన్స్ ఇన్ ఏ జనరేషన్) పేరుతో కరోనా వైరస్ నుంచి క్రికెట్‌ను కాపాడే ఈ ప్యాకేజీని అందిస్తున్నట్లు ఈసీబీ స్పష్టం చేసింది. 61 మిలియన్ పౌండ్లు, భారత కరెన్సీలో దాదాపు 570 కోట్ల ప్యాకేజీనిని ఫస్ట్ క్లాస్ కౌంటీలు, కౌంటీ బోర్డులతో పాటు ఎంసీసీకి అందించనుంది. 40 మిలియన్ పౌండ్లను బుధవారమే ఆయా కౌంటీల అకౌంట్లలోనికి ట్రాన్స్‌ఫర్ చేసింది. ఇక మరో 20 మిలియన్ పౌండ్లను వడ్డీరహిత రుణాలు, గ్రాంట్ల పేరుతో అందించనున్నట్లు ఈసీబీ సీఈవో టామ్ హారిసన్ స్పష్టం చేశారు. కౌంటీ బోర్డు ఉద్యోగుల వేతనాలతో పాటు గ్రౌండ్ మెయింటనెన్స్, క్రికెటర్ల వేతనాలకు ఈ నిధులు ఉపయోగించే వీలుంది. మరోవైపు కౌంటీలు, క్రికెట్ క్లబ్స్ తీసుకునే రుణాలపై 12 నెలల పాటు ఈఎంఐ హాలిడే కూడా ప్రకటించింది.

Tags: ECB, Financial Package, cricket boards, county cricket, once in a Generation

Next Story

Most Viewed