మాయమైన మద్యాల చెరువు

by Mahesh |
మాయమైన మద్యాల చెరువు
X

దిశ, మేడ్చల్ బ్యూరో: ఒకప్పుడు కలువ పూలతో కనువిందుగా కనిపించిన చెరువు ఇప్పుడు మాయమైంది. ఏ మాత్రం చెరువు ఉన్నదని ఆనవాళ్లు లేకుండా పూర్తిగా అన్యాక్రాంతం చేశారు. మాకు పట్టా ఉంది.. మాకు కూడా పట్టా ఉంది అంటూ చెరువులో మట్టి వేసి పూడ్చి కాంపౌండ్ వాల్ నిర్మాణాలు సైతం చేసేసుకున్నారు. చర్యలు తీసుకోవాల్సిన ఇరిగేషన్ , రెవెన్యూ శాఖ అధికారులు సినిమా చూస్తూ వెన్నకుండిపోతున్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, కుత్బుల్లాపూర్ మండలం గాజులరామారం గ్రామ పరిధిలో ఉన్న మద్యాల చెరువు దీనగాధ ఇది.

మాయమైన మద్యాల..

గాజులరామారం సర్వే నెంబర్ 335 లో 11.28 ఎకరాల విస్తీర్ణంలో మద్యాల చెరువు విస్తరించి ఉండేది. చిన్న చెరువు అయినా దానిలో దాదాపు రెండు ఎకరాల విస్తీర్ణంలో అన్నివేళలా నీళ్లు నిండి ఉండేది. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న క్వారీ గుంతలు వర్షాల్లాలతో నిండి ఓవర్ ఫ్లో అయినప్పుడు ఆ నీళ్లు ఈ చెరువులో చేరి నిండుగా ఉండేది. అంతే కాదు ఈ చెరువులో కల్వ పూలు పూసి చూపరులకు ఆకర్షించే విధంగా అద్భుతంగా ఉండేది. అయితే ప్రస్తుతం ఇక్కడ వెళ్లి చూస్తే చెరువు ఎక్కడ..? అంటూ నోరెళ్ళ పెట్టాల్సిందే. ఎందుకంటే అక్కడ ప్రస్తుతం చెరువు ఆనవాళ్లు ఏం మాత్రం కనిపించవు. ఇప్పట్లో ఉన్న వారికి ఈ చెరువు ఉన్నదనే విషయం కనీసం తెలియదు. క్వారీ పనులు జరిగే సమయంలో అప్పట్లో రాళ్లు కొట్టుకునే జీవించేవారు ఇప్పటికి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు. వారు మాత్రమే ఇక్కడ చెరువు ఉండేదని గుర్తించగలిగే వారు. ప్రస్తుతానికి ఈ చెరువు కట్ట దిగువ ప్రాంతంలో ఉన్న అమ్మవారి గుడి సాక్షిగా మద్యాల చెరువు పూర్తిగా మాయమైపోయిందని చెప్పవచ్చు.

రికార్డులకే పరిమితమా..?

11 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఉన్న మద్యాల చెరువును జిహెచ్ఎంసి చేపట్టిన చెరువు సంరక్షణలో భాగంగా ఇటీవల అత్యున్నత స్థాయి అధికారులు పరిశీలించారు. చెరువు పరిస్థితి చూసి అధికారులు కూడా నివ్వెరపోయారు. చెరువులో వేసిన మట్టి రాళ్ళూరప్పలు తొలగించడం సాధ్యమేనా అనే విషయంపై చర్చించుకున్నట్టు తెలుస్తుంది. ఇక ఇరిగేషన్ , రెవెన్యూ అధికారులు ఆది నుంచి ఈ చెరువు పై నిర్లక్ష్యం వహిస్తూనే ఉన్నారు. చెరువు పూడ్చివేతకు గురవుతున్నది అన్న విషయం వారి దృష్టికి వచ్చినప్పటికీ చూసి చూడనట్లు వివరించడంతో పరిస్థితి ఇంతవరకు వచ్చింది అని ఆరోపిస్తున్నారు. ప్రస్తుతానికి మద్యాల చెరువు కేవలం రికార్డులకి పరిమితమైందని చెప్పవచ్చు.

Next Story

Most Viewed