ఈటల జమున వ్యాఖ్యలు దురహంకారానికి పరాకాష్ట

by  |
Eatala Jamuna
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఈటల జమునారెడ్డి చేసిన వ్యాఖ్యలు దురహంకారానికి పరాకాష్ట అని బీసీ కమిషన్ మాజీ సభ్యుడు వకులాభరణం కృష్ణ మోహన్ రావు ఖండించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. నాపై చేసిన ఈ వ్యాఖ్యలు ఈటల దంపతులు ఇన్నాళ్ళుగా వల్లిస్తున్న ఆదర్శభావాలు, ఆదర్శ జీవితం, కులరహిత సమాజం, ప్రజలంతా సమానమే అనేవి ఉత్త కహానీలే అని తేలిపోయిందన్నారు.

దశాబ్దాలుగా బీసీ ఉద్యమ నేతగా మంచి గుర్తింపును తెచ్చుకున్న నాలాంటి వాడిపై జమున వ్యాఖ్యలు ఆమెలోని దురహంకారాన్ని, ధన అహంకారాన్నిస్పష్టం చేస్తున్నాయన్నారు. నిజంగా ఉదార స్వభావం మీలో ఉంటే, మీతో ఎంతమంది బాగుపడ్డారో, ఎన్నికుటుంబాలను నిలబెట్టగలిగారో చెప్పడం సాధ్యమా? అని ప్రశ్నించారు. ఉన్నత భావాలు కలిగినవారైతే మీ వెంట నియోజకవర్గంలోని ఒక్క ప్రజాప్రతినిధి లేకపోవడానికి కారణమేంటన్నారు.

విద్యార్థి దశ నుంచి ఉద్యమ జీవితం గడుపుతూ రాజకీయాల్లోకి వచ్చానని, నిరంతరం ప్రజల గొంతుకగానే నా జీవితం కొనసాగుతున్నదన్నారు. వ్యాపారాల నుంచి రాజకీయాల్లోకి వచ్చి.. రాజకీయాలను వ్యాపారం చేసింది ఈటల అన్నారు. నాడు బీసీ నేత ఆర్‌. కృష్ణయ్య నేతృత్వంలో పోరాటాల ద్వారా ఆ వర్గాలకు అనేక పథకాలు పెట్టించగలిగాం.. అలా నాజీవితం పారదర్శకం, త్యాగమయమైందని కృష్ణ మోహన్ పేర్కొన్నారు. మీరేదో సచ్చీలురు అయినట్లు మాట్లాడితే వాస్తవాలు-అవాస్తవాలు కావని ఈ నిజం తెలుసుకోండని జమునాకు సూచించారు.

2004లో కెప్టెన్‌ వి.లక్ష్మికాంతరావు నాడు బీసీ మంత్రిగా సిఫారసు చేసి బీసీ కమిషన్‌ సభ్యుడిగా నియామకం చేయించారని వకులాభరణం పేర్కొన్నారు. ఏనాడూ వ్యక్తిగతంగా ఆస్తులు పెంచుకోలేదు సరికదా… ఆస్తులు కోల్పోయాను… అప్పుల పాలయ్యాను.. ఇది ముమ్మాటికి వాస్తవం అన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈటల బడుగుల భూములు గుంజుకున్నాడని ఆరోపించారు. 2016 లో నా సేవలను గుర్తించి సీఎం కేసీఆర్ తెలంగాణ తొలి బీసీ కమిషన్‌లో సభ్యుడిగా
నియామకం చేశారని అన్నారు. ఈటల రాజేందర్‌కు నిజంగానే పదవులు ఇప్పించగలిగే శక్తే ఉంటే ఇప్పటి వరకు హుజూరాబాద్‌ నియోజకవర్గం నుంచి రాష్ట్రస్థాయిలో ఎంతమందికి పదవులు ఇప్పించారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.

అక్రమ ఆస్తులపై దర్యాప్తు జరుపుతుంటే గగ్గోలు పెట్టడం ఎందుకని ప్రశ్నించారు. నేను అక్రమాస్తులు సంపాదిస్తే దర్యాప్తు చేయాలని కోరారు. ప్రతిసారి కేసీఆర్ బొమ్మ పెట్టుకొని గెలిచారని, 15ఏళ్లుగా ఎమ్మెల్యేగా, ఏదేండ్లు మంత్రిగా ఉన్న తరువాత కూడా మీ బొమ్మ చూసి ఓట్లేసే దిక్కులేదని, అందుకే కాంగ్రెస్‌, బీజేపీ నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ నుంచి ఎవరికి టికెట్‌ ఇచ్చినా కేసీఆర్ బొమ్మతో గెలుస్తాం.. దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికల బరిలోకి దిగాలని సవాల్‌ చేశారు. బలహీన వర్గాల సమున్నతికి మీరు చేసిందేమిటో మీ మనస్సాక్షికి తెలుసు అని, రేపటి ఎన్నికల్లో బలహీన వర్గాలే మీ అహంకారాన్ని వదలదీసి బుద్ధి చెబుతారన్నారు.


Next Story

Most Viewed