వేలంలో బాక్సింగ్ లెజెండ్ అలీ పెయింటింగ్స్

by  |
వేలంలో బాక్సింగ్ లెజెండ్ అలీ పెయింటింగ్స్
X

దిశ, ఫీచర్స్ : ప్రపంచ ప్రఖ్యాత అమెరికన్ బాక్సర్ ముహమ్మద్ అలీ తన 22వ యేట 1964 ఫిబ్రవరిలో సోనీ లిస్టన్‌తో తొలిసారి రింగ్‌లో దిగాడు. కాగా తొలి ఫైట్‌లోనే విజయం సాధించి ప్రపంచ బాక్సింగ్ యోధుడిగా టైటిల్ గెలిచాడు. ఆనాటి నుంచి ఎదురులేకుండా బాక్సింగ్‌ను ఏలాడు. ‘త్రీ-టైమ్’ వరల్డ్ హెవీ వెయిట్ చాంపియన్‌గా నిలిచిన అలీ, రింగ్‌కు మాత్రమే పరిమితం కాలేడు తన కళను కూడా ప్రదర్శించాడు. ప్రత్యర్థిపై పిడుగుద్దులతో విరుచుకుపడే ఈ యోధుడు, రౌండ్‌ మధ్యలో కార్టూన్స్ గీయడానికి ఇష్టపడేవాడు. అతడు గీసిన ఈ అరుదైన స్కె్చ్‌లు, పెయింటింగ్స్ అక్టోబర్ 5న న్యూయార్క్‌లో బోన్హామ్స్ అక్షన్ హౌజ్ వేలం వేయనున్నట్లు తాజాగా ప్రకటించింది.

ముహమ్మద్ అలీ గీసిన వాటిలో చాలా పెయింటింగ్‌లు కార్టూన్ శైలిలో ఉండగా అందులో కొన్నింటిపై అతడి సంతకం ఉంది. మతం, సామాజిక న్యాయం పట్ల అలీకి ఉన్న ఆసక్తిని ఆ చిత్రాలు ప్రతిబింబిస్తున్నాయి. బాక్సింగ్‌కు సంబంధించిన చిత్రాలు కూడా గీశాడు. వీటితో పాటు 1978లో చారిత్రాత్మక మినీ సిరీస్ ‘ఫ్రీడమ్ రోడ్’ చిత్రీకరణ సమయంలో అలీ ‘స్టింగ్ లైక్ ఎ బీ’ అని పిలిచే ఓ పెయింటింగ్‌ వేయగా, ఆ అరుదైన చిత్రరాజాన్ని కూడా తాము వేలం వేస్తున్నామని బోన్హామ్స్ వేలం నిర్వాహకులు తెలిపారు. అక్టోబర్ 5న జరిగే వేలంలో దీనికి $ 40,000 – $ 60,000 లభిస్తుందని విక్రేతలు భావిస్తున్నారు.

డ్రాయింగ్‌పై అలీకి ఉన్న మక్కువ చాలా మందికి తెలియదని, కానీ పోరాటం మధ్యలో లేదా బాక్సింగ్ ప్రాక్టీస్ తర్వాత విశ్రాంతి తీసుకునే మార్గంగా పెయింటింగ్స్ వేసేవాడు. అతడి అభిమానులతో సహా చాలా మంది ప్రజలు అతడు కళాకారుడని తెలుసుకుని సంతోషిస్తున్నారు. అతడి కళ, కళాఖండాల నిధి గురించి ప్రపంచానికి పరిచయం చేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అతడు వేసిన పెయింటింగ్స్‌లో ‘ద స్ట్రేవింగ్ చిల్డ్రన్ ఆఫ్ మిస్సిస్సిపీ’, ‘అమెరికా: ది బిగ్ జైల్’, ‘వార్ ఇన్ అమెరికా’ ఉన్నాయి.
– హెలెన్ హాల్, బోన్హామ్స్‌ సంస్కృతి డైరెక్టర్

మాజీ ప్రపంచ హెవీవెయిట్ చాంపియన్, తన కెరీర్ అత్యున్నత దశలో 1964లో ఇస్లాం స్వీకరించినట్లు ప్రకటించగా, ఆ తర్వాత ఎన్నో ఏళ్ల పాటు వివక్ష ఎదుర్కొన్నాడు. తన కెరీర్‌లో ఎన్నో విజయాలు చూసినా, ఈ విషయంలో మాత్రం చాలా కష్టాలు అనుభవించాడు. ఈ యోధుడు పార్కిన్సన్స్ వ్యాధితో సుదీర్ఘ పోరాటం తర్వాత 2016లో 74 సంవత్సరాల వయస్సులో మరణించాడు.

Next Story

Most Viewed