కుట్టి.. కుట్టి చంపుతున్నయ్..!

by  |
Dhomalu-1
X

దిశ‌, ఎల్బీన‌గ‌ర్: కాల‌నీలు, బ‌స్తీల‌లో పేరుకుపోతున్న చెత్తాచెదారం.. పొంగిపొర్లుతున్న డ్రైనేజీల‌తో దోమ‌లు విజృంభిస్తున్నాయి. దీంతో ప్రజలకు కంటిమీద కునుకు క‌రువైంది. స‌రూర్‌న‌గ‌ర్‌, కోదండ‌రామ్‌న‌గ‌ర్‌, వీవీన‌గ‌ర్‌, పీఅండ్‌టీ కాల‌నీ, ఎస్‌బీఐ కాల‌నీ, గ‌డ్డిఅన్నారం, చైత‌న్యపురి కాల‌నీ, శాలివాహ‌న న‌గ‌ర్‌, కొత్తపేట‌, మారుతీన‌గ‌ర్‌, అల్కాపురి కాల‌నీ, సాయిన‌గ‌ర్ కాల‌నీ, స్నేహ‌పురి కాల‌నీ, నాగోల్, ఆనంద్‌న‌గ‌ర్‌, ఎన్టీఆర్ న‌గ‌ర్‌, మ‌న్సూరాబాద్‌, హ‌స్తినాపురం, బీఎన్‌రెడ్డి న‌గ‌ర్‌, ఆర్టీసీ కాల‌నీ, హ‌య‌త్‌న‌గ‌ర్ త‌దిత‌ర ప్రాంతాల‌లో దోమ‌ల బెడ‌ద తీవ్రంగా ఉంది. దోమ‌ల‌ను అరిక‌ట్టడానికి జీహెచ్ఎంసీ పూర్తి స్థాయిలో చ‌ర్యలు చేప‌ట్టకపోవ‌డంతో డెంగీ, మ‌లేరియా వంటి విషజ్వరాల బారిన ప‌డుతున్నామ‌ని ప్రజలు ఆందోళ‌న వ్యక్తం చేస్తున్నారు. కాల‌నీలు, బ‌స్తీల‌లో పేరుకుపోతున్న చెత్త, పొంగిపొర్లుతున్న డ్రైనేజీలకు తోడు అధికారులు దోమ‌ల నివార‌ణ‌కు ఫాగింగ్ చ‌ర్యలు చేపట్టకపోవడంతో దోమ‌ల బెడ‌ద అధిక‌మ‌వుతోంద‌ని ఆవేద‌న చెందుతున్నారు.

నివారణ చర్యలు శూన్యం

దోమ‌ల నివార‌ణ‌కు జీహెచ్ఎంసీకి చెందిన ప్రత్యేక బృందాలు ఉన్నా.. అవి పూర్తి స్థాయిలో ప‌ని చేయ‌డం లేద‌నే ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. దోమ‌ల నిర్మూల‌న కోసం జీహెచ్ఎంసీ ల‌క్షలాది రూపాయ‌లు ఖ‌ర్చు చేస్తున్నా ప్రయోజ‌నం క‌నిపించ‌డంలేదు. మూసీ ప‌రివాహ‌క ప్రాంతంలో ఉన్న కాల‌నీల‌లో ప‌రిస్థితి మ‌రింత దారుణంగా ఉంది. రాత్రి అయ్యిందంటే చాలు దోమ‌ల మోత‌తో జ‌నం జాగారం చేయాల్సి వ‌స్తుంది. మూసీకి ఆనుకొని ఉన్న బ‌స్తీలు, కాల‌నీల్లో ప్రతి రోజూ దోమ‌ల నివార‌ణ‌కు ఫాగింగ్ చేయాల‌ని అధికారులు ఆదేశించినా సిబ్బంది మాత్రం వారం ఒకరోజు మాత్రమే వ‌స్తున్నార‌ని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా అయితే దోమ‌ల నివార‌ణ ఎలా సాధ్యమవుతుందని కాల‌నీవాసులు ప్రశ్నిస్తున్నారు.

చర్యలు తీసుకుంటాం: మంజుల‌వాణి, ఏఎంఅండ్‌హెచ్ఓ

ఎక్కడ పారిశుద్ధ్య స‌మ‌స్య ఎదురైనా వెంట‌నే మా దృష్టికి తీసుకురండి. వెంట‌నే స‌మ‌స్య ప‌రిష్కారానికి చ‌ర్యలు చేప‌డుతాం. ఆయా ప్రాంతాల్లో దోమ‌ల నివార‌ణ‌కు అవ‌స‌ర‌మైన చ‌ర్యలు తీసుకుంటున్నాం. ఎక్కడైనా పారిశుద్ధ్య సిబ్బంది, దోమ‌ల నివార‌ణ ప్రత్యేక బృందాలు, ఫాగింగ్ సిబ్బంది సక్రమంగా రాక‌పోతే వెంట‌నే మాకు ఫిర్యాదు చేస్తే స‌మ‌స్య ప‌రిష్కరిస్తాం. విధి నిర్వహ‌ణ‌లో నిర్లక్ష్యంగా వ్యవహరించే సిబ్బందిపై చ‌ర్యలు తీసుకుంటాం.

Next Story

Most Viewed