రహదారులు భద్రమేనా..!

76

రాకాసి రోడ్లు రక్తం చిమ్ముతున్నాయి. రాజధానికి దగ్గరగా ఉమ్మడి మెదక్ జిల్లా ఉండడం.. ఈ జిల్లా నుంచే పక్క జిల్లాలకు, ఇతర రాష్ట్రాలకు వెళ్లడానికి రహదారులు ఏర్పాటు కావడంతో నిత్యం 44వ జాతీయ రహదారి, కరీంనగర్- హైదరాబాద్ రాజీవ్ రహదారి ప్రయాణీకులతో బిజీగా ఉంటుంది. ఈ రహదారుల్లో అడుగడుగునా లోపాలు ఉండడంతో ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి. వీటి నివారణకు పోలీసు శాఖ, రెవెన్యూ, రవాణా శాఖ అధికారులు బారికేడ్లు, స్పీడ్ లేజర్ గన్, సీసీ కెమెరాలు, స్టాపర్స్ ఇలా ఎన్ని రకాల పటిష్ట చర్యలు చేపట్టినా ఫలితం మాత్రం శూన్యం. జాతీయ రహదారి రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా పోలీసు శాఖ, రవాణా శాఖ సమన్వయంతో నెల రోజుల పాటు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలంటూ సూచనలు చేస్తుంటారు. అవి పూర్తి కాగానే మళ్లీ యధాస్థితికి చేరుకుంటుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

దిశ ప్రతినిధి, మెదక్: ప్రతి యేటా జనవరి మాసంలో జాతీయ రహదారి రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తుంటారు. ఈ ఏడు ఈ నెల 18నుంచి వచ్చే నెల 17వరకు వారోత్సవాలు నిర్వహించేందుకు పోలీసు, రవాణా శాఖ అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఇప్పటికే వాల్ పోస్టర్లు, ఫ్లెక్సీలు ఆవిష్కరించారు. ఈ నెల 25వరకు వాహనదారులతో ఉమ్మడి జిల్లాలోని సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, ఫిబ్రవరి 3న ప్రమాదాలు అధికంగా జరుగు ప్రాంతాల వద్ద అవగాహన, 5న టోల్‌ప్లాజాల వద్ద అవగాహన, 9, 10 తేదీల్లో మోటారు వాహన చట్టాలపై అవగాహన, 13, 14తేదీల్లో ఇన్స్యూరెన్స్ కంపెనీలకు అవగాహన, 15-16 తేదీల్లో యువతకు రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని పోలీసు, రవాణా శాఖ అధికారులు చెప్తున్నారు.

రహదారులు భద్రమేనా…

నిత్యం ఏదో ఓ చోట ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో లాక్ డౌన్ లో తగ్గుముఖం పట్టిన రోడ్డు ప్రమాదాలు మళ్లీ అధికమయ్యాయి. ప్రధాన రహదారులు విశాలంగా ఉండడంతో బండి స్పీడు వంద కి.మీ నుంచి 140 కి.మీ వేగంగా వాహనాలు రయ్ మంటూ దూసుకెళ్తున్నాయి. ఈ ప్రమాదాల్లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతుండగా మరికొందరు క్షతగాత్రులవుతున్నారు. పెద్ద దిక్కును కోల్పోవడంతో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి.

యువతే ఎక్కువ…

ఎంతో భవిష్యత్ ఉన్న యువత రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం ఆందోళన కలిగించే విషయం. మితిమీరిన వేగంతో వాహనాలు నడిపి ప్రమాదాల బారినపడుతున్నారు. సాధారణంగా 18 సంవత్సరాలు నిండితేనే వాహనం నడిపేందుకు అనుమతి లభిస్తుంది. డ్రైవింగ్ లైసెన్స్ లేని వారు, సరిగ్గా నడపడం రాని మైనర్లు వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారకులవుతున్నారు.

అధికారుల చర్యలూ శూన్యమే…

రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా పోలీసులు హడావిడి చేయడం తప్ప మిగిలిన సమయంలో పోలీసు, రవాణా శాఖ చర్యలు శూన్యం. ప్రమాదాల నివారణకు రోడ్డుపై స్టాఫర్స్, బోర్డర్స్, సీసీ కెమెరాలు, స్పీడ్ లేసర్ గన్, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించినా ప్రమాదాలు ఆగడం లేదు. ట్రాఫిక్ నిబంధనలపై చాలామందికి అవగాహన ఉండడం లేదు. ఇటువంటి వారిని గుర్తించి ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపట్టాల్సి ఉన్నా నామమాత్రంగానే కొనసాగిస్తున్నట్లుగా విమర్శలు వస్తున్నాయి. రోడ్లు నిర్మాణంలో డిజైనింగ్ లోపాలు, ట్రాఫిక్ నిబంధనలు పాటించక పోవడం, అవగాహన కల్పించక పోవడం, మద్యం తాగి డ్రైవ్ చేయడం, సెల్‌ఫోన్లలో మాట్లాడుతూ డ్రైవ్ చేయడం, ఓవర్ లోడింగ్ ఇతర కారణాలని పోలీసులు పట్టించుకోకపోవడం వంటివి కూడా ప్రమాదాలకు కారణం అవుతున్నాయి.

ట్రాఫిక్ నిబంధనలు…

ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలి
కార్లు, ఇతర పెద్ద వాహనాలు నడిపే వారు సీటు బెల్టు ధరించాలి
మద్యం సేవించి, సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపకూడుదు.
రాంగ్ రూట్ ప్రయాణం ప్రమాదకరం
ప్రతి వాహనదారుడు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.

ప్రమాదాల నివారణకు కృషి…

‘రోడ్డు ప్రమాదాల నివారణకు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. వచ్చే నెల 17వరకు 32వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు. వాహనదారులు తప్పకుండా నిబంధనలు పాటించినప్పుడే ప్రమాదాలు తగ్గుతాయి. మానవ తప్పిదం, అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్లనే యాక్సిడెంట్లు ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రతి వాహనానికి నెంబర్ ప్లేట్లు అమర్చుకోవాలి. యాక్సిడెంటు ప్రదేశాల్లో ఇప్పటికే బోర్డర్స్, రోడ్ స్టాపర్, బిక్లర్స్, పెయింటింగ్, ప్లాస్టిక్ కోన్స్, సీసీ కెమెరాలు, ఏర్పాటు చేశాం. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లు, స్పీడ్ లేజర్ గన్ లతో కేసులు నమోదు చేస్తున్నాం’ అని సిద్దిపేట పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ తెలిపారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..