సీఎం పళనిస్వామికి స్టాలిన్ చెక్.. డిఫెన్స్‌లో అన్నాడీఎంకే..!

by  |
సీఎం పళనిస్వామికి స్టాలిన్ చెక్.. డిఫెన్స్‌లో అన్నాడీఎంకే..!
X

దిశ, వెబ్‌డెస్క్ : ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ తమిళనాడులో ప్రధాన పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. అధికార పార్టీ అన్నాడీఎంకే, బీజేపీ కూటమి కలిసి తిరిగి అధికారంలోకి వచ్చేందుకు తీవ్రంగా కృషి చేస్తుండగా.. ప్రతిపక్ష డీఎంకే పార్టీ ఎలాగైనా ఈసారి అధికారంలోకి వచ్చేందుకు కొత్త ప్రణాళికలు రచిస్తోంది. తమిళనాట డీఎంకే జెండా ఎగురుతుందని ఇప్పటికే పలు సర్వేలు వెల్లడిస్తుండగా.. జాతీయ స్థాయిలో ఎన్నికల వ్యుహకర్తగా పేరుగాంచిన ప్రశాంత్ కిషోర్ ప్రణాళికలు అన్నాడీఎంకే‌ను గద్దె దించేందుకు దోహద పడుతుందని పొలిటికల్ అనలిస్ట్‌లు విశ్లేషిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే AIDMK పార్టీని ఇరుకున పెట్టేందుకు తమిళనాట ‘పురుచ్చి తలైవి’గా పేరు గాంచిన దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణాన్ని ఎన్నికల అస్త్రంగా DMK పార్టీ వాడుకుంటోంది. మాజీ సీఎం జయలలిత మరణంపై ఎన్నో అనుమానాలున్నాయని ఇటీవలే స్టాలిన్ ఎన్నికల ప్రచారంలో ప్రకటించారు. ఈ ఎన్నికల్లో తమకు అవకాశమిస్తే ఆమె మృతికి గల కారణాలపై విచారణ జరిపిస్తామని ప్రజలకు వివరించారు. జయలలితకు, మాకు సిద్ధాంతాల పరంగా అనేక విభేదాలున్నా.. ఆమెను తమిళనాడు సీఎంగా గౌరవిస్తామని స్టాలిన్ స్పష్టంచేశారు. ప్రధాని మోదీని సైతం ధైర్యంగా ఎదుర్కొన్న ధీర వనిత జయలలిత అని కొనియాడారు. నీట్, సీఏఏకు వ్యతిరేకంగా జయలలిత పనిచేశారని ఈ సందర్భంగా స్టాలిన్ గుర్తుచేశారు.

అయితే, జయలలిత మరణాన్ని డీఎంకే పార్టీ ఎన్నికల అస్త్రంగా వాడుకోవడాన్ని అన్నాడీఎంకే నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అధికార పార్టీ ముఖ్యమంత్రి చనిపోతే ఎవరూ పట్టించుకోలేదని, పదవుల కోసం అన్నాడీఎంకే నేతలు పాకులాడారని.. ముఖ్యంగా సీఎం పళనిస్వామి పాక్కుంటూ వచ్చి సీఎం అయ్యారని స్టాలిన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు ప్రజలు జయలలితను ‘అమ్మ’గా పిలుచుకుంటారు. అలాంటిది ఆమె మృతికి గల కారణాలను నాడు అధికార పార్టీ గోప్యంగా ఉంచింది. ప్రస్తుతం ఈ అంశాన్ని డీఎంకే పార్టీ మళ్లీ తెరమీదకు తీసుకురావడంతో అన్నాడీఎంకే డిఫెన్స్‌లో పడిందని సర్వత్రా చర్చ నడుస్తోంది. దీంతో సీఎం పళనిస్వామికి ప్రతిపక్ష నేత స్టాలిన్ చెక్ పెట్టారని సమాచారం. ఈ ఒక్క అంశాన్ని ఆధారంగా చేసుకుని వచ్చే ఎన్నికల్లో డీఎంకే పార్టీ మెజార్టీ స్థానాలను కొల్లగొట్టేందుకు ఆస్కారం ఏర్పడుతుందని ప్రతిపక్ష నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Next Story

Most Viewed