హాస్టళ్లలో భద్రత ఎక్కడ..? కోదాడలో వరుస విద్యార్థినుల ఆత్మహత్యలు

by Ramesh Naini |

సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో విద్యార్థినులపై జరుగుతున్న అనుమానాస్పద ఘటనలు కలకలం రేపుతున్నాయి.

హాస్టళ్లలో భద్రత ఎక్కడ..? కోదాడలో వరుస విద్యార్థినుల ఆత్మహత్యలు
X

దిశ, కోదాడ: సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో విద్యార్థినులపై జరుగుతున్న అనుమానాస్పద ఘటనలు కలకలం రేపుతున్నాయి. వరుసగా చోటుచేసుకుంటున్న ఆత్మహత్యలు, అదృశ్యాలు స్థానికులను, తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. విద్యార్థినులు సురక్షితంగా ఉండాల్సిన కాలేజీలు, హాస్టళ్లే ఇప్పుడు భయానకంగా మారుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొన్న గేట్ ఇంజనీరింగ్ కాలేజీలో ఒక విద్యార్థిని భవనంపై అంతస్తు నుంచి దూకి మృతి చెందడం సంచలనం రేపింది. అదే తరహాలో కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కాలేజీలో మరో విద్యార్థిని భవనం పై నుంచి దూకి ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ రెండు ఘటనలు విద్యార్థుల్లో తీవ్ర భయాందోళనలకు దారితీశాయి. అదే సమయంలో మీట్స్ కళాశాలలో ఒక విద్యార్థిని మిస్సింగ్ అయిన ఘటన కూడా అనుమానాలకు తావిస్తోంది. ఆమె గల్లంతు కేసు ఇంకా స్పష్టతకు రాకపోవడంతో విద్యార్థి వర్గాల్లో ఆందోళన మరింత పెరిగింది. ఇటీవల కోదాడ పట్టణంలోని ఓ కాలేజీ హాస్టల్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఓ విద్యార్థిని మృతి చెందింది. ఈ ఘటనతో హాస్టళ్లలో భద్రతపై మరింత అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కిట్స్ కాలేజీలో సుమారు 800 మంది విద్యార్థినిలు ఉండగా ఎవరికైనా ఏ ప్రమాదం జరిగినా తీసుకెళ్లినందుకు ఎటువంటి వాహనం కూడా లేదు. మొన్న జరిగిన ఓ విద్యార్థిని బిల్డింగ్ మీద నుంచి కింద పడినప్పుడు ఏ వెహికల్ లేకపోవడంతో ఆటోలో తీసుకొచ్చిన ఘటనలు ఉన్నాయి. ఇంత జరుగుతున్న కాలేజీ యాజమాన్యాలపై అధికారులు చర్యలు తీసుకోకపోవడం హాస్యాస్పదంగా ఉంది. ఈ వరుస సంఘటనలు చూస్తుంటే హాస్టళ్లలో సరైన పర్యవేక్షణ ఉందా? భద్రతా చర్యలు అమలు చేస్తున్నారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాత్రి సమయాల్లో పర్యవేక్షణ లోపం, సీసీ కెమెరాల లేకపోవడం లేదా పనిచేయకపోవడం, విద్యార్థుల సమస్యలను పట్టించుకోకపోవడం వంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అకడమిక్ ఒత్తిడి, మానసిక ఆందోళనలు

విద్యార్థులపై పెరుగుతున్న అకడమిక్ ఒత్తిడి, మానసిక ఆందోళనలు కూడా ఈ ఘటనలకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నప్పటికీ, హాస్టల్ యాజమాన్యాల నిర్లక్ష్యం కూడా కీలక పాత్ర పోషిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. తల్లిదండ్రులు తమ పిల్లలను భద్రత కోసం హాస్టళ్లలో ఉంచుతున్నప్పటికీ, అక్కడే ఇలాంటి ఘటనలు జరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. బాధిత కుటుంబాలు ఈ ఘటనలపై సమగ్ర విచారణ జరిపించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.ప్రభుత్వం, విద్యాశాఖ వెంటనే స్పందించి కోదాడలోని అన్ని కాలేజీలు, హాస్టళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. భద్రతా ప్రమాణాలను కట్టుదిట్టం చేయడం, విద్యార్థులకు కౌన్సెలింగ్ సదుపాయాలు కల్పించడం, 24 గంటల పర్యవేక్షణ ఏర్పాటు చేయడం అత్యవసరంగా మారింది.

విద్యార్థినుల ప్రాణాలు పోతుంటే బాధ్యత ఎవరిది?

విద్యార్థినుల మరణాలు, అనుమానాస్పద ఘటనలు వరుసగా చోటుచేసుకుంటున్న నేపథ్యంలో బాధ్యత ఎవరిదన్నది కీలకంగా మారింది. నిబంధనల ప్రకారం కాలేజీ యాజమాన్యాలు, హాస్టల్ నిర్వహణలు విద్యార్థుల భద్రతకు పూర్తిగా బాధ్యత వహించాలి. కానీ వాస్తవ పరిస్థితులు చూస్తే పర్యవేక్షణ లోపాలు, నిర్లక్ష్యం, ఫిర్యాదులపై స్పందన లేకపోవడం వంటి అంశాలు బయటపడుతున్నాయి.హాస్టల్‌లో 24 గంటల భద్రత, వార్డెన్ల పర్యవేక్షణ, సీసీ కెమెరాల నిర్వహణ, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించే వ్యవస్థలు ఉండాలి. అయితే ఇవి అమలులో ఎంతవరకు ఉన్నాయన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.ఇక విద్యాశాఖ, ప్రభుత్వం కూడా ఈ ఘటనలపై బాధ్యత నుంచి తప్పించుకోలేవు. కాలేజీలపై క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాల్సిన అధికారులు విఫలమయ్యారా? భద్రతా ప్రమాణాలను కచ్చితంగా అమలు చేయించడంలో లోపాలున్నాయా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.నిపుణుల అభిప్రాయం ప్రకారం, విద్యార్థులపై పెరుగుతున్న ఒత్తిడి, మానసిక ఆందోళనలను తగ్గించే కౌన్సెలింగ్ వ్యవస్థలు కూడా చాలావరకు లేవు. సమస్యలు ఎదురైనప్పుడు చెప్పుకునే వేదిక లేకపోవడం పరిస్థితిని మరింత విషమంగా మారుస్తోంది.

అత్యవసర చర్యలు… విద్యార్థుల భద్రతకే ప్రాధాన్యం

కోదాడలో చోటుచేసుకుంటున్న వరుస ఘటనల నేపథ్యంలో హాస్టళ్లలో భద్రతపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలి. విద్యార్థినుల ప్రాణాలను కాపాడేందుకు అమలు చేయాల్సిన కీలక చర్యలు హాస్టళ్లలో కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థలు హాస్టల్ ప్రాంగణంలో సీసీ కెమెరాలు, సెక్యూరిటీ సిబ్బంది, ఎంట్రీ-ఎగ్జిట్ నియంత్రణ వంటి చర్యలు తప్పనిసరిగా ఉండాలి. ఎవరైనా అనుమానాస్పదంగా తిరిగితే వెంటనే గుర్తించే విధంగా పర్యవేక్షణ ఉండాలి. 24 గంటల పర్యవేక్షణ, వార్డెన్లు కేవలం పేరుకే కాకుండా నిజంగా బాధ్యత వహించేలా ఉండాలి. రాత్రి సమయాల్లో కూడా పర్యవేక్షణ ఉండటం అత్యంత కీలకం. విద్యార్థుల కదలికలపై నిఘా అవసరం.ప్రతి కాలేజీలో కౌన్సెలింగ్ సెంటర్లు విద్యార్థులపై పెరుగుతున్న మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు ప్రొఫెషనల్ కౌన్సెలింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలి. విద్యార్థులు తమ సమస్యలను భయపడకుండా చెప్పుకునే వాతావరణం కల్పించాలి.విద్యార్థుల ఫిర్యాదులపై వెంటనే స్పందించే వ్యవస్థ హెల్ప్‌లైన్ నంబర్లు, కంప్లైంట్ బాక్సులు, ఆన్‌లైన్ ఫిర్యాదు వ్యవస్థలు ఉండాలి. ఫిర్యాదు చేసిన వెంటనే చర్యలు తీసుకునే విధంగా మెకానిజం ఉండాలి.

ప్రత్యేక విచారణకు డిమాండ్

ఇటీవల చోటుచేసుకున్న ఘటనలపై ప్రభుత్వం సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఘటనలకు దారి తీసిన కారణాలను వెలికితీసి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.అదేవిధంగా కాలేజీలు, హాస్టళ్లలో భద్రత, సౌకర్యాలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి లోపాలను వెంటనే సరిదిద్దాలని సూచిస్తున్నారు. విద్యార్థుల సంక్షేమం దృష్ట్యా పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Next Story