మున్సిపాలిటీలకు ముగింపు గడియారం.. జడ్చర్ల, అచ్చంపేటలో స్పెషల్ పాలన దిశగా!

by Ramesh Naini |   (  Updated:2026-04-27 02:52:57  IST  )

ఉమ్మడి పాలమూరు జిల్లాలో మరో రెండు మునిసిపాలిటీల పాలక మండళ్ల పదవీకాలం మే మొదటి వారంలో ముగియనుంది.

మున్సిపాలిటీలకు ముగింపు గడియారం.. జడ్చర్ల, అచ్చంపేటలో స్పెషల్ పాలన దిశగా!
X

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో : ఉమ్మడి పాలమూరు జిల్లాలో మరో రెండు మునిసిపాలిటీల పాలక మండళ్ల పదవీకాలం మే మొదటి వారంలో ముగియనుంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్న మున్సిపాలిటీ లతోపాటు కాకుండా పలు కారణాల వల్ల జడ్చర్ల, అచ్చంపేట మునిసిపాలిటీల ఎన్నికలు ఆలస్యంగా జరిగాయి. ఇటీవల ఉమ్మడి జిల్లాలో ఉన్న మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్, ఇతర మునిసిపాలిటీల ఎన్నికలు జరిగి పాలక మండళ్లు కొలువుతీరాయి. పరిపాలన కొనసాగుతోంది. రెండు మూడు నెలల పదవీకాలం ఉన్నప్పటికీ రద్దుచేసి అన్ని మున్సిపాలిటీలతో పాటు జడ్చర్ల, అచ్చంపేట మున్సిపాలిటీల ఎన్నికలు కూడా నిర్వహిస్తారు అని ప్రచారం జరిగింది. కానీ అధికారులు ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకోలేదు. వచ్చే నెల 6వ తేదీ లోపు ఈ రెండు మునిసిపాలిటీల పదవీ కాలం ముగియనుంది.

నిరాశగా ముగియనున్న పదవీకాలం..

జడ్చర్ల, అచ్చంపేట మున్సిపాలిటీల పాలకమండలి సభ్యుల పదవీకాలం నిరాశతో ముగియనుంది. ఐదు సంవత్సరాల క్రితం జరిగిన ఎన్నికల్లో ఈ రెండు మునిసిపాలిటీలలో బీఆర్ఎస్ అభ్యర్థులు మెజారిటీ కౌన్సిల్ స్థానాలను గెలుచుకొని చైర్మన్ పదవులను దక్కించుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో కౌన్సిలర్ల ఆశలన్నీ గల్లంతు అయ్యాయి. దీంతో జడ్చర్ల మున్సిపల్ చైర్మన్, మరి కొంతమంది కౌన్సిలర్లు అధికార పార్టీలో చేరిపోగా.. అచ్చంపేట మున్సిపల్ ఛైర్మన్ పై అవిశ్వాస తీర్మానం పెట్టి ఆ స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. పార్టీ మారినా.. చైర్మన్ మారినా ఆశించిన స్థాయిలో అభివృద్ధి పనులు జరగకపోవడంతో కౌన్సిల్ సభ్యులంతా దాదాపు నిరాశ నిస్పృహలో ఉన్నారు. ప్రస్తుతం పదవీకాలం ముగుస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి నిధులు రాకపోవడం.. పనులు చేపట్టకపోవడంతో.. వచ్చే ఎన్నికల్లో ఓట్ల కోసం ప్రజల ముందుకు ఎలా వెళ్లాలి అన్న సందేహాలను వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఈ ఐదేళ్లు తమకు నష్టం తప్ప ఎటువంటి లాభాలు లేకపోయాయి అని కౌన్సిలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పట్లో ఎన్నికలు లేనట్లే..

జడ్చర్ల, అచ్చంపేట మున్సిపాలిటీలకు ఇప్పట్లో ఎన్నికలు జరగకపోవచ్చు అని ప్రచారం సాగుతోంది. జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలు జరిగే సమయంలో వీటిని నిర్వహిస్తారా..? లేక ఆ ఎన్నికల తర్వాత నిర్వహిస్తారా..? అన్న అంశం ఇప్పట్లో తేలే పరిస్థితులు లేవు. ఎన్నికలు జరగడానికి కనీసం రెండు మూడు నెలల సమయం పట్టవచ్చు అని అధికార పార్టీ నేతలు అంటున్నారు. అప్పటివరకు రెండు మున్సిపాలిటీలు స్పెషల్ అధికారుల పాలనలో కొనసాగనున్నాయి.

Next Story