బెజవాడ గ్యాంగ్‌వార్‌.. ఉపేక్షించబోమన్న డీజీపీ

by  |
బెజవాడ గ్యాంగ్‌వార్‌.. ఉపేక్షించబోమన్న డీజీపీ
X

దిశ ఏపీ బ్యూరో: రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే ఉపేక్షించేది లేదని ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ హెచ్చరించారు. విజయవాడ పటమట గ్యాంగ్‌ వార్‌ ఘటన దురదృష్టకరమన్న ఆయన, దీనికి కారణమైన వారిపై కఠిన చర్యలుంటాయని తెలిపారు. పోలీస్ శాఖలో సంస్కరణలు తీసుకొచ్చామన్న ఆయన ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో ముందుకెళ్తున్నామన్నారు. అంతే కాకుండా పోలీస్‌ శాఖలో తొలిసారిగా వీక్లీఆఫ్ సౌకర్యం కల్పించామని అన్నారు. అలాగే స్పందన కార్యక్రమంలో వినతులను గడువులోగా పరిష్కరిస్తున్నామని, 95 శాతం సమస్యలను నిర్దేశిత గడువులోగా పరిష్కరించామని తెలిపారు. స్పందన పోర్టల్ ద్వారా ప్రజలకు, పోలీసులకు మధ్య దూరం తగ్గిందని, 4లక్షల మంది దిశ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకున్నారని ఆయన వెల్లడించారు. టెక్నాలజీని పోలీసు శాఖలో సమర్ధవంతంగా వినియోగిస్తున్నామని, కరోనా సమయంలో డయల్ 100, 112 ఎంతో ఉపయోగపడ్డాయని ఆయన చెప్పుకొచ్చారు.

మరోవైపు బెజవాడ గ్యాంగ్‌వార్‌ కేసులో 21 మంది గ్యాంగ్‌ సభ్యుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారందరిపైనా ఐపీసీ 302, 307, 188, 269 సెక్షన్లతో పాటు కోవిడ్‌–19 చట్ట ప్రకారం కేసులు నమోదు చేశారు. పరారీలో ఉన్న వారి 6 బృందాలుగా గాలింపు చేపట్టారు. వీరందరిపై రౌడీ షీట్‌ తెరిచే ఆలోచనలో ఉన్నారు. అంతే కాకుండా ఈ కేసుల ప్రధాన నిందితుడు పండు అండ్ గ్యాంగ్ డొంకరోడ్డులో సాగించిన కార్యకలాపాలపై కూడా కన్నేశారు. అతనిపై నమోదైన మూడు కేసుల వివరాలు తీసుకున్నారు.

Next Story