త్రివేణి సంగమం.. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసా?

by Yella Dhawani Reddy |

యూపీలోని ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళా క్రతువు జరుగుతోంది.

త్రివేణి సంగమం.. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్: యూపీలోని ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళా క్రతువు జరుగుతోంది. ప్రతిరోజూ లక్షల సంఖ్యలో భక్తులు గంగా, యమునా, సరస్వతి నదుల త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. సాధారణంగా రెండు నదులు కలిసే ప్రాంతాన్ని సంగమం అంటారు. అదే మూడు నదులు కలిస్తే త్రివేణి సంగమం అంటారు. సంగమ స్నానాన్ని, ముఖ్యంగా త్రివేణి సంగమ స్నానాన్ని హిందువులు పవిత్రంగా భావిస్తుంటారు.అయితే, ప్రయాగ్ రాజ్‌లో మాత్రం సరస్వతి నది కనిపించదు. అంతర్వాహినిగా ప్రవహిస్తుంటుందని పండితులు చెబుతుంటారు. ఇక ఈ త్రివేణి సంగమంలో స్నానమాచరిస్తే పాపాలు తొలగి, పునర్జన్మ నుంచి ముక్తి పొందడమే మోక్షంగా హిందువులు భావిస్తారు. ప్రయాగ్‌రాజ్‌లోనే కాకుండా.. తెలుగు రాష్ట్రాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో త్రివేణి సంగమాలు ఉన్నాయి. అయితే, ఇక్కడ మూడు నదులు లేదా ఆయా ఉప నదులు కలుస్తూ సంగమ ప్రదేశంగా మారుతున్నాయి. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తిలో త్రివేణి సంగమం ఉంది. ఇక్కడ గోదావరి, మంజీర, హరిద్ర నదులు కలుస్తాయి. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా త్రయంబకేశ్వర్ వద్ద పుట్టిన గోదావరి నది.. కందకుర్తి వద్ద తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. ఇక్కడ గోదావరి నదిలో హరిద్ర, మంజీర ఉప నదులు కలుస్తాయి. ఇది తెలంగాణలోని ప్రముఖ త్రివేణి సంగమాల్లో ఒకటిగా రాష్ట్ర దేవాదాయ శాఖ పేర్కొంది. ఇక్కడ గోదావరి గట్టుపైన ఓ పురాతన శివాలయం కూడా ఉంది.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్‌పూర్ మండలంలో ఉన్న కాళేశ్వర శైవక్షేత్రం వద్ద కూడా త్రివేణి సంగమం ఉంది. ఇక్కడ గోదావరి, ప్రాణహిత నదులతో పురాణాల్లో పేర్కొన్న సరస్వతి నది కలుస్తుందని భక్తుల నమ్ముతారు. ఇక ప్రయాగ్‌రాజ్‌లోని సరస్వతి నదిని, కాళేశ్వర క్షేత్రంలోని సరస్వతి నదిని ఒకటిగానే భక్తులు భావిస్తుంటారు. కాళేశ్వర క్షేత్రంలో సరస్వతి ఆలయం ఉండటం వల్ల కూడా సరస్వతి నది ఉన్నట్టుగా నమ్ముతారు. దక్షిణ కాశీగా పిలిచే ఇక్కడున్న కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో శివుడికి(ముక్తీశ్వరుడికి), యమధర్మరాజుకి(కాళేశ్వరుడికి) భక్తులు పూజలు చేస్తారు.

ఏపీలోని శ్రీకాకుళం జిల్లా వంగర మండలంలోని సంగం గ్రామంలో నాగావళి, వేగావతి, సువర్ణ ముఖి నదుల త్రివేణి సంగమం ఉంది. భక్తులు అలహాబాద్‌లోని త్రివేణి సంగమానికి సమానంగా దీన్ని భావిస్తారు. సంగమేశ్వరుడి పంచ లింగక్షేత్రాలలో ఇది ఒకటి. మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడకు వేలాదిమంది భక్తులు వస్తారు. అలాగే ఈ ప్రదేశంలో ఎక్కువగా పితృకర్మలు చేస్తారు. ఇక్కడ పితృ కర్మలు చేసిన వారికి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని భక్తుల నమ్మకం.

ఏపీలోని కర్నూలు జిల్లాలో గల సంగమేశ్వరాన్ని హిందువులు ముఖ్య ఆధ్యాత్మిక కేంద్రంగా భావిస్తారు. ఇక్కడ కృష్ణా నదిలో తుంగభద్ర, భవనాసి నదులు కలుస్తాయి. వరాహ పర్వతాల్లో పుట్టిన తుంగ, భద్ర అనే రెండు నదులు కర్ణాటకలోని చిక్‌మంగళూరు జిల్లాలో ఒకదానికొకటి కలిసి తుంగభద్రగా ఏర్పడతాయి. ఆ తర్వాత కర్ణాటకలో ప్రవహిస్తూ.. కర్నూలు జిల్లా కొసిగి ప్రాంతం వద్ద తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించి, సంగమేశ్వరం వద్ద కృష్ణానదిలో కలుస్తుంది. ఈ ప్రాంతానికి మరో ప్రత్యేకత కూడా ఉంది. ఈ ప్రాంత సప్తనదీ సంగమస్థానంగా కూడా ప్రసిద్ధి. తుంగ, భద్ర, కృష్ణ, వేణి, మలపహరిణీ, భీమాహారతి, భవనాసి నదులు ఇక్కడ కలుస్తాయని కూడా చెబుతుంటారు.

Next Story