మౌని అమావాస్య విశిష్టత.. ఆ రోజు ఏం చేయాలి ఏం చేయకూడదు!

by Yella Dhawani Reddy |

సాధారణంగా ప్రతి నెలలో పౌర్ణమి, అమావాస్యలు వస్తుంటాయి.

మౌని అమావాస్య విశిష్టత.. ఆ రోజు ఏం చేయాలి ఏం చేయకూడదు!
X

దిశ, వెబ్ సైట్: సాధారణంగా ప్రతి నెలలో పౌర్ణమి, అమావాస్యలు వస్తుంటాయి. అయితే హిందూ సంప్రదాయాల ప్రకారం కొన్ని పౌర్ణమిలు, అమావాస్యలు ప్రత్యేక విశిష్టతను కలిగి ఉంటాయి. అందులో పుష్య మాసంలో వచ్చే అమావాస్యకు ఎంతో విశిష్టత ఉంది. దీనినే మౌని అమావాస్య, సర్వేషాం అమావాస్య, చొల్లంగి అమావాస్య అని పిలుస్తుంటారు. ఈ ఏడాది జనవరి 29న ఈ మౌని అమావాస్య వచ్చింది. ఈ మౌని అమావాస్య సాధారణంగా కొత్త సంవత్సరపు మొదటి అమావాస్యగా, మహా శివరాత్రి ముందు ఆఖరి అమావాస్యగా వస్తుంది. ఇక మరో విశేషమైన విషయం ఏమిటంటే ఇది 144 ఏళ్ల తర్వాత జరిగే మహా కుంభమేళా సమయంలో వచ్చింది.

మౌని అమావాస్య విశిష్టత

ఈ అమావాస్య రోజున శ్రీ మహా విష్ణువు, లక్ష్మీ దేవిలను మౌన వ్రతం ఆచరిస్తూ పూజిస్తారు. అందుకే దీనిని మౌని అమావాస్య పిలుస్తారు. ఇక ఈరోజు నదీ స్నానం చేయటం, పూర్వీకులకు పిండదానం, తర్పణాలు వదలటం వంటివి పూర్వీకులకు మోక్షం లభిస్తుందని హిందువులు విశ్వస్తారు. అలాగే పితృ దోషం పోవాలంటే ఈ అమావాస్య రోజు పూర్వీకులను స్మరించుకుని సూర్య భగవానుడికి రాగి పాత్రలో ఎర్రటి పూలను నీటిలో కలిపి అర్ఘ్యం సమర్పించాలి. అనంతరం దుప్పటి, ఉసిరి కాయలు, నల్లని వస్త్రాలను దానం ఇస్తే పితృదోషాలు, గ్రహదోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.

ఇంతకీ ఈ రోజు ఏం చేయాలంటే?

నదీస్నానం, కుదరని వారు తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానం చేయాలి. శ్రీమహావిష్ణువుతోపాటు శ్రీలక్ష్మీదేవిని పూజించాలి. ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనవ్రతం, ఉపవాసం పాటించాలి. సాయంత్రం సమయంలో ఇంట్లో తులసి కోట ముందు ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి. అలాగే మౌని అమావాస్య రోజు 'ఓం ప్రీత్ దేవతయే నమః' అని జపం చేయాలి. ఇలా చేయడం ద్వారా మన పూర్వీకుల ఆశీస్సులు మనపై ఉంటాయి. మౌని అమావాస్య రోజు నువ్వులు కానీ, నువ్వులతో చేసిన వస్తువులను కానీ దానం చేయడం వల్ల శ్రీ మహావిష్ణువు అనుగ్రహం లభిస్తుంది. అలాగే, చీమలకు పంచదార వేస్తే గ్రహదోషాలు నశిస్తాయి.

ఇక ఈ పవిత్రమైన రోజున ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించడం వల్ల ఎన్నో శుభ ఫలితాలొస్తాయని చాలా మంది నమ్ముతారు. కుంభమేళా వెళ్లటం కుదరని వారు కాణిపాకం వినాయకుడి, శనీశ్వరుని దేవాలయం, శ్రీశైలం మల్లికార్జున స్వామి, ఏదైనా పరమేశ్వరుని ఆలయాలను దర్శించుకున్న శుభం జరుగుతుందని పండితులు చెబుతున్నారు.

Next Story