సరిహద్దుల్లో ఉద్రిక్తతల ఎఫెక్ట్.. చార్‌ధామ్‌ యాత్రకు తగ్గిన భక్తులు

by Yella Dhawani Reddy |

చార్‌ధామ్ యాత్రను హిందూ మతంలో అత్యంత పవిత్రమైన యాత్రలలో ఒకటిగా భావిస్తారు

సరిహద్దుల్లో ఉద్రిక్తతల ఎఫెక్ట్.. చార్‌ధామ్‌ యాత్రకు తగ్గిన భక్తులు
X

దిశ, వెబ్ డెస్క్: చార్‌ధామ్ యాత్రను (Chardham yatra) హిందూ మతంలో అత్యంత పవిత్రమైన యాత్రలలో ఒకటిగా భావిస్తారు. ప్రతి హిందువు తన జీవితంలో ఒక్కసారైనా ఈ యాత్రను చేయాలని కోరుకుంటాడు. ఈ ఏడాది ఏప్రిల్ 30 నుంచి చార్‌ధామ్ యాత్ర ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే, గతేడాదితో పోల్చితే ఈ ఏడాది చార్‌ధామ్ యాత్రకు భక్తుల (Devotees) రద్దీ గణనీయంగా తగ్గినట్లు తెలుస్తోంది.

2024లో కేదార్‌నాథ్‌ (Kedarnath), బ‌ద్రీనాథ్‌ (Badrinath), య‌మునోత్రి (Yamunotri), గంగోత్రి (Gangotri) ధామాల‌ను తొలి రెండు వారాల్లో 9,61,302 మంది భక్తులు ద‌ర్శించుకోగా.. ఈ ఏడాది 6,62,446 మంది భక్తులు మాత్రమే దర్శించుకున్నట్లు ఉత్తరాఖండ్‌లోని (Uttarakhand) డెహ్రాడూన్ చెందిన ఎస్‌డీసీ ఫౌండేష‌న్ అనే ప‌ర్యావ‌ర‌ణ సంస్థ వెల్లడించింది. అంటే ఈ ఏడాది దాదాపు 31 శాతం మంది భక్తులు త‌క్కువ‌గా యాత్ర‌లో పాల్గొన్నార‌ని ఆ సంస్థ తెలిపింది.

భక్తుల రద్దీ తగ్గడానికి.. ఏప్రిల్ 22న కాశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి, అనంతరం భారత్, పాక్ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలే కారణంగా భావిస్తున్నట్లు సంస్థ పేర్కొంది. అయితే ప్రస్తుతం పరిస్థితులు ప్రశాంత వాతావరణ స్థితికి చేరుకోవటంతో రాబోయే రోజుల్లో యాత్రకు వచ్చే వారి సంఖ్య పెరుగుతుందనే అంచనా వేసింది.

ఇక, చార్‌ధామ్‌ యాత్రకు మే 15వ తేదీ నాటికి దాదాపు 28 లక్షల మంది రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. ఇందులో నేపాల్‌ నుంచి 5,728 మంది యాత్రికులు, అమెరికా నుంచి 5,864, యూకే నుంచి 1,559, మారిషస్ నుంచి 837, ఇండోనేషియా నుంచి 327, కెనడా నుంచి 888, ఆస్ట్రేలియా నుంచి 1,259 పేర్లను నమోదు చేసుకున్నట్లు సమాచారం.

Next Story