అమర్‌నాథ్ యాత్రకు దరఖాస్తుల వెల్లువ

by Yella Dhawani Reddy |

హిందువులు అమర్‌నాథ్ యాత్రను ఎంతో పవిత్రంగా భావిస్తారు. జీవితంలో ఒక్కసారైనా హిమాలయాల్లోని అమర్‌నాథ్ గుహలో సహజంగా ఏర్పడిన మంచు లింగాన్ని దర్శించుకోవాలని కోరుకుంటారు.

అమర్‌నాథ్ యాత్రకు దరఖాస్తుల వెల్లువ
X

దిశ, వెబ్ డెస్క్: హిందువులు అమర్‌నాథ్ యాత్రను (Amarnath yatra) ఎంతో పవిత్రంగా భావిస్తారు. జీవితంలో ఒక్కసారైనా హిమాలయాల్లోని అమర్‌నాథ్ గుహలో సహజంగా ఏర్పడిన మంచు లింగాన్ని దర్శించుకోవాలని కోరుకుంటారు. ఇక ఈ ఏడాది జూలై 3న ప్రారంభమై రాఖీ పౌర్ణమి వరకు యాత్ర కొనసాగనుంది. ఇక ఇప్పటికే ఈ యాత్రకు వెళ్లాలనుకునే వారికోసం రిజిస్ట్రేషన్లు కూడా ప్రారంభమయ్యాయి. అయితే, జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడి ప్రభావం ఈ యాత్రపై పడుతుందని అంతా భావించారు. ఉగ్రభయంతో ఈసారి అమర్‌నాథ్ యాత్రలో పాల్గొనే భక్తుల సంఖ్య తగ్గుతుందనుకున్నారు. అయితే, ఈ అనుమానాలను పటాపంచలు చేస్తూ భారీ సంఖ్యలో యాత్రికులు నమోదు చేసుకొంటున్నారు.

జమ్మూకశ్మీర్‌ (Jammu & Kashmir) అధికారులు వెల్లడించిన గణాంకాల ప్రకారం.. ఇప్పటివరకు 3.31 లక్షలమంది అమర్‌నాథ్‌ యాత్ర కోసం పేర్లు నమోదు చేసుకున్నారు. గత సంవత్సరం ఈ శివలింగాన్ని సందర్శించడానికి దాదాపు 5 లక్షల మంది భక్తులు వచ్చారు. దరఖాస్తులు భారీగా వస్తుండటంతో ఈ సంవత్సరం కూడా దాదాపు 5 లక్షల మంది భక్తులు అమర్‌నాథ్ పవిత్ర గుహకు చేరుకోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక మంచుకొండల మీదుగా అమర్‌నాథ్‌ గుహకు చేరుకొని, సహజసిద్ధంగా ఏర్పడే మంచు లింగాన్ని సందర్శించాలంటే 45 కిలోమీటర్ల మేర ట్రెక్కింగు చేయాలి. దీనికి పహల్గాం ఓ బేస్‌ క్యాంపుగా ఉపయోగపడుతుంది. అక్కడికి చేరుకున్న యాత్రికులు కొద్దిసేపు సేదతీరి మళ్లీ ప్రయాణం ప్రారంభిస్తారు. అయితే, పహల్గాం ఉగ్రదాడి అనంతరం ఉగ్రవాద స్థావరాలపై కేంద్ర ప్రభుత్వం తీసుకొన్న చర్యలు, స్థానికంగా పెంచిన భారీ భద్రతతో అమర్‌నాథ్‌ యాత్రకు పెద్దసంఖ్యలో స్పందన వస్తున్నట్లు తెలుస్తోంది. ఇక గతేడాది 52 రోజులపాటు యాత్ర జరగ్గా.. ఈ ఏడాది 38 రోజుల్లోనే ముగియనుంది. పహల్గాం, బాల్‌తాల్‌ మార్గాల్లో యాత్రికులను అనుమతించనున్నారు.

Next Story