రూ. 10 వేలు ఇచ్చినమ్.. వివరాలే లేవు..!

by  |
రూ. 10 వేలు ఇచ్చినమ్.. వివరాలే లేవు..!
X

దిశ, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్ నగరంలో కురిసిన వర్షాలు, దాని వెన్నంటే వచ్చిన వరదలతో ఎన్ని కుటుంబాలు ఇబ్బంది పడ్డాయో, ఎన్ని కుటుంబాలకు సాయం అందిందో జీహెచ్ఎంసీ దగ్గర లెక్కలు లేవు. వరదల కారణంగా ముప్పై మంది మాత్రం చనిపోయారని, వారి కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించినట్లు స్పష్టం చేసింది. అయితే వరద బాధితుల గుర్తింపుగానీ, గుర్తించినవారికి ఏ ప్రాతిపదికన పది వేల రూపాయలు ఇవ్వాలో స్పష్టమైన మార్గదర్శకాలుగానీ తమ దగ్గర లేవని, లబ్ధిదారుల వివరాలు కూడా ఇవ్వలేమని జీహెచ్ఎంసీ చీఫ్ ఫైనాన్షియల్ అడ్వయిజర్ పేర్కొన్నారు. ‘సొసైటీ ఫర్ సేఫ్టీ ఆఫ్ ది పబ్లిక్ అండ్ గుడ్ గవర్నెన్స్’ అనే సంస్థ సమాచార హక్కు చట్టం కింద దాఖలు చేసిన దరఖాస్తుకు పైవిధంగా లిఖితపూర్వక సమాధానం వచ్చింది.

లబ్ధిదారుల వివరాలన్నీ సంబంధిత జోన్ల డిప్యూటీ కమిషనర్ల దగ్గర ఉంటాయని, అవి అందగానే పంపిస్తామని ఆ సమాధానంలో పేర్కొన్నారు. ఏయే వార్డులో ఎంత మంది వరద ముంపునకు గురయ్యారో, ఆ కుటుంబాలను ఎలా గుర్తించారో, వారికి సాయం ఏ ప్రాతిపదికన అందించారో, ఏ వార్డులో ఇంకా ఎంతమందికి అందాల్సి ఉందో, ఇలాంటి వివరాలేవీ తమ దగ్గర లేవని చీఫ్ ఫైనాన్షియల్​ అడ్వయిజర్ ఆ సమాధానంలో వివరించారు. సర్వే వివరాలు, నిపుణుల నివేదిక, అంచనా నష్టం వివరాలు తమ దగ్గర లేవని, బాధితులను గుర్తించడానికి అవలంబించే ప్రామాణికాలుగానీ తమ దగ్గర లేవని ఆ అధికారి పేర్కొన్నారు. మొదటి నుంచీ అందరూ ఊహిస్తున్నట్లుగానే వరదసాయం పంపిణీలో అవకతవకలపై ఇప్పటికీ సందేహాలు నివృత్తి కాలేదు. సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకున్నా వివరాలు వెలుగులోకి రాలేదు.

అవే సమాధానాలు..

సహజంగానే ప్రతీసారి తప్పించుకుంటున్నట్లుగానే ‘ఇది మా పరిధిలోకి రాదు.. ’, ‘ఇది సంబంధిత శాఖ పరిధిలోకి వస్తుంది’, ‘ఈ వివరాలను ఇవ్వాల్సిందిగా ఆ ఆఫీసుకు లేఖ రాశాం’, ‘అక్కడి నుంచే నేరుగా మీకు అందుతాయి’.. లాంటి సమాధానమే వచ్చింది. ఇప్పటికీ ప్రభుత్వం నుంచి ఎంత మొత్తంలో ఖర్చయింది, ఎన్ని కుటుంబాలకు సాయం అందింది, ఇంకా ఎన్ని కుటుంబాలకు అందాల్సి ఉంది లాంటి వివరాలేవీ జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం దగ్గర లేవు.

మార్గదర్శకాలు లేకుండానే పంపిణీ..

వరద బాధితులకు ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రజలకు, విపక్ష పార్టీలకు ఎలాంటి భిన్నాభిప్రాయం లేకపోయినా నగదు రూపంలో అందించడం, స్థానికంగా ఉన్న పార్టీ కార్యకర్తలు వేలు పెట్టడం, బాధితులను గుర్తించడం వంటివి విమర్శలకు తావిచ్చింది. ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేయకపోవడం, జీహెచ్ఎంసీ సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటించకపోవడం, పార్టీకి అనుకూలంగా ఉన్న కుటుంబాలకు మాత్రమే అందజేయడం లాంటి పొరపాట్లు ప్రభుత్వం మెడకు చుట్టుకున్నాయి.

ప్రజల నుంచి విమర్శలు..

రాజకీయ పార్టీల విమర్శలు ఎలా ఉన్నా స్థానికంగా ఉన్న ప్రజలు సైతం జీహెచ్ఎంసీ అధికారులపై నిప్పులు చెరిగారు. జోనల్ కార్యాలయాల ముందు కొన్ని రోజుల పాటు ధర్నాలు చేశారు. సాయం అందలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ‘మీ సేవ’ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ప్రకటించడం, జీహెచ్ఎంసీ ఎన్నికలు రావడంతో డిసెంబరు 7 నుంచి అందజేస్తామని పేర్కొనడం, అది కూడా రెండుమూడు రోజుల పాటు అమలై ఆ తర్వాత అటకెక్కించడంతో తీవ్ర విమర్శలకు దారి తీసింది.

పైగా, అప్పటికే ‘మీ సేవ’ ద్వారా దరఖాస్తు చేసుకున్నవారికి మాత్రమే ఇస్తామని, కొత్త దరఖాస్తుదారులకు ఇవ్వాలన్న ఆదేశాలు ప్రభుత్వం నుంచి తమకు అందలేదని జీహెచ్ఎంసీ అధికారులు గతంలో వ్యాఖ్యానించారు. ఇప్పటికీ వరదసాయం విషయంలో అటు ప్రభుత్వం నుంచిగానీ, ఇటు జీహెచ్ఎంసీ అధికారుల నుంచిగానీ పూర్తి వివరాలు బయటకు రాలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్, పురపాలక మంత్రి కేటీఆర్ చెప్పిన గణాంకాలే తప్ప అధికారుల దగ్గర సమగ్ర సమాచారం లేదు. ఉన్నా బయటకు వెల్లడించకూడదన్న ఆంక్షలు ఉన్నాయనే పేరుతో తొక్కిపెడుతున్నారు. చివరకు ఆర్టీఐ ద్వారా దరఖాస్తు చేసుకున్నా సమగ్ర వివరాలు తెలియరాలేదు.

Next Story