ఇవి కేసీఆర్ ఆలోచనలు.. ఒక్కొక్కటి వివరంగా..

by  |
ఇవి కేసీఆర్ ఆలోచనలు.. ఒక్కొక్కటి వివరంగా..
X

దిశ, న్యూస్ బ్యూరో: కొత్త రెవెన్యూ చట్టం వచ్చేస్తోందంటూ ప్రచారం జోరుగా సాగుతోంది. కానీ అది ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రవేశ పెట్టే ఛాన్స్ కనిపించడం లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే డ్రాఫ్టు రూపకల్పన జరిగి ఉండాలి. దానిపై సమగ్రసమాలోచన చేసి ఉంటే సాధ్యమయ్యేది. ఐతే సీఎం కే చంద్రశేఖర్ రావు ఆలోచనల సమాహారంగా చట్టం రూపకల్పన జరిగితే రాష్ట్రానికి, ప్రజలకు అత్యంత ప్రయోజనకారిగా ఉంటుంది. కానీ ఆయన లక్ష్యాలను అందుకునే స్థాయిలో చట్టం రూపకల్పనకు అధికారులే బ్రేకులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఉదాహారణకు టైటిల్ గ్యారంటీ చట్టంపై సీఎం కేసీఆర్ పలుమార్లు సభలు, సమావేశాల్లో ఉటంకించారు. అధికారులతోనే ప్రస్తావించారు. రెవెన్యూ రికార్డుల్లో పట్టాదారుడిగా నమోదైతే, సదరు భూమికి సర్వహక్కులకు ప్రభుత్వమే గ్యారంటీ ఇవ్వాలి. అలాంటి వ్యవస్థను రూపొందించడంలో కొందరు ఐఏఎస్ లు ససేమిరా అంటున్నట్లు తెలిసింది. దాన్ని అమలు చేయడం ద్వారా ప్రభుత్వానికి ఇబ్బందులు వస్తాయంటూ దాటవేత ధోరణిని అవలంభిస్తున్నట్లు సమాచారం.

ఐతే తాజాగా రెవెన్యూ చట్టం తయారీ పని నాలుగైదు పవర్ సెక్టార్లు చేస్తున్నట్లు సమాచారం. ఎవరికి వారు వారి ఐడియాస్ తో తయారు చేసి సీఎం కేసీఆర్ కు సమర్పించాలని ప్రయత్నిస్తున్నారు. సొంత ఆలోచనలతో రూపొందించామని చెప్పి సీఎం మెప్పు పొందే పనిలో ఉన్నారని రెవెన్యూ చట్టాల నిపుణుడొకరు ‘దిశ’కు వివరించారు. కొందరు ఐఏఎస్ అధికారులేమో కేవలం మ్యుటేషన్ పైనే దృష్టి పెడుతున్నారు. కానీ సీఎం కేసీఆర్ ఆలోచనలకు ప్రతిరూపంగా తయారు చేయడం లేదన్నారు. ప్రగతి భవన్ లో ఓ బృందం చట్టం తయారు చేసే పనిలో ఉన్నారు. ఆ తర్వాత కొందరు ఐఏఎస్ లు కూడా వారి వ్యూహరచనకు పదును పెడుతున్నారు. ఇంకొందరు సీఎం ప్రశంసలే లక్ష్యంగా ఆగమేఘాల మీద తామూ తయారు చేశామని నిరూపించేందుకు తహతహలాడుతున్నారు. ప్రైవేటు సంస్థలు కూడా అదే పనిలో ఉన్నాయి. ఐతే దీనిలో ఎవరి డ్రాఫ్టుకు సీఎం ఆమోదముద్ర వేస్తారో వేచి చూడాలి. ఐతే ఇప్పటికే డ్రాఫ్టును సీఎం స్వయంగా రూపొందించారంటూ టీఆర్ఎస్ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి.

సీఎం ప్రాథమ్యాలు

తెలంగాణలో రెవెన్యూ వ్యవస్థను పటిష్టంగా రూపొందించాలని సీఎం కేసీఆర్ ఆలోచన చేశారు. ఈ క్రమంలో మానుకోట, కరీంనగర్ సభల్లో ఆయన తన లక్ష్యాలను వెల్లడించారు. ఆ తర్వాత కూడా నిపుణులు, అధికారుల చర్చల్లోనూ స్పష్టం చేశారు. పహాణీలు మ్యాన్యువల్ గా చేయాలి. ఆ తర్వాతే కంప్యూటర్ లో నిక్షిప్తం చేయాలి. ఏదైనా గ్రామసభలో తీర్మానం చేయాలి. ఆ తర్వాతే అమలు చేయాలి. అలా అనేకాంశాలను ప్రస్తావించారు. వాటిలో ప్రధానంగా నాలుగు లక్ష్యాలను ఉంచారు. అవి..
– మొదటిది: భూముల సమగ్ర సర్వే. అందుకే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన మొదటి రెండు సంవత్సరాల్లో రూ.1000 కోట్లు వంతున బడ్జెట్ కేటాయించారు. కాకపోతే అమల్లోకి తీసుకురాలేదు. దాంట్లో భాగంగా రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన ప్రక్రియను చేపట్టారు.
– రెండోది.. గ్రామాల్లో వేలాదిగా సాదాబైనామాలు ఉన్నాయి. వాటన్నంటినీ క్రమబద్ధీకరించాలి. ఈ ప్రక్రియలో దాదాపు విజయం సాధించారు. చాలా గ్రామాల్లో ఈ ప్రక్రియ పూర్తయ్యింది. ఐతే కొన్ని వివాదాలు లేకపోలేదు.
– మూడోది: టైటిల్ గ్యారంటీ చట్టం. దేశంలో ఏ సీఎం ధైర్యంగా ప్రకటించలేదు. కానీ కేసీఆర్ ఆ వరుసలో ముందున్నారు. రెవెన్యూ రికార్డుల్లో పేరు ఉంటే దానికి గ్యారంటీ ప్రభుత్వమే. రైతుకు ఎలాంటి నష్టం ఉండదు. దీన్ని అమలు చేయడానికి చాలా సమయం పడుతుంది. అధికారుల కసరత్తు కూడా చాలా అవసరం. దీన్ని అమలు చేయడానికి కొందరు ఐఏఎస్ అధికారులు ససేమిరా అంటున్నారని తెలిసింది. బ్యూరోక్రాట్లు దాని వల్ల ఇబ్బందులు తలెత్తుతాయంటూ సీఎం కేసీఆర్ కు తరచూ చెబుతున్నట్లు తెలిసింది. అందుకే కొత్త చట్టంలోనూ దీని ప్రస్తావన ఉండకపోవచ్చునంటున్నారు.
– నాల్గోది: జిల్లాల వారీగా రెవెన్యూ ట్రిబ్యునల్ ఏర్పాట్లు. బీహార్ రాష్ట్రంలో సత్ఫలితాలు ఇస్తోన్న వ్యవస్థను తెలంగాణలోనూ అమలు చేయాలి.

తొలగించిన వాటిలో మంచితనం

నిజాం కాలం, బ్రిటిష్ కాలం నుంచి అనేక చట్టాలను అమలు చేశారు. వాటిలో చాలా వాటిని రద్దు చేశారు. ఐతే వాటిలోని మంచితనాన్ని సంగ్రహించడం ద్వారా కొత్త చట్టాన్ని సమగ్రంగా రూపొందించొచ్చునని రెవెన్యూ చట్టాల నిపుణులు అంటున్నారు. ఉదాహారణకు నిజాం హైదరాబాద్ సంస్థానంలోనే రిజిస్ట్రేషన్ తర్వాత మ్యుటేషన్ కు దరఖాస్తు చేసే ప్రక్రియ లేనేలేదు. ఆటోమెటిక్ గా రికార్డుల అప్ డేట్ జరిగేది. అమ్మకాలు, కొనుగోళ్లు సాగినప్పుడు పట్వారీ నోటీసు బోర్డుపై విషయాన్ని పెట్టేవారు. అభ్యంతరాలు ఉంటే స్వీకరించి డిస్ప్యూట్ రిజిస్టర్ లో నమోదు చేసేవారు. లేదంటే వెంటనే రికార్డుల్లో నమోదు చేసేవారు. మార్పుల రికార్డుల్లో రాయడం ద్వారా వచ్చే ఏడాది రాసే రికార్డుల్లో పేర్లు ఎక్కేవి. మరోకటి.. వ్యవసాయ భూములను ఎవరైనా అమ్మకాలంటే తహశీల్దార్ అనుమతి తప్పనిసరి. ఈ చట్టాన్ని 1963లో తొలగించారు. మరఠ్వాడా ల్యాండ్ గవర్నెన్స్ ను మద్రాసు గవర్నెన్స్ గా కన్వర్ట్ చేశారు. ఆ తర్వాత చాలా చట్టాలను తొలగించారు. వాటిని కొత్తగా ఆలోచించి అమలు చేయడం ద్వారా అనేక ప్రయోజనాలు ఉంటాయని చెబుతున్నారు. ఐతే ఇప్పటికింకా డ్రాఫ్టు రూపకల్పన జరుగలేదు. టైటిల్ గ్యారంటీ చట్టం ఆలోచనను విరమించుకున్నట్లుగా కనిపిస్తోంది. రెవెన్యూ కోడ్ నను అమలు చేసే అంశాన్ని పరిశీలిస్తోంది. ఐతే 1999లోనే రెవెన్యూ కోడ్ కు అసెంబ్లీ ఆమోద ముద్ర వేసింది. కానీ కేంద్రం ఓకే చెప్పలేదు. దాన్ని చేర్పులు మార్పులు చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఐతే ఈ రెవెన్యూ కోడ్ కు రాష్ట్ర అసెంబ్లీ ఆమోదముద్ర వేసినా మళ్లీ కేంద్రానికి పంపాలి. ఐతే ఇప్పటి వరకు రూపకల్పనే జరుగలేదు. భూ పరిపాలన కంప్యూటర్లతో జరగదు. టైటిల్ గ్యారంటీ చట్టాన్ని అమలు చేస్తోన్న ఆస్ట్రేలియా, అమెరికా, కెనడాలోనూ మనుషులే పని చేస్తారు. ఇక్కడా చట్టం, వ్యవస్థలోని లోపాలను సరిదిద్దితే సరిపోతుంది. అధికారులను ఏ పేరుతో పిలుచుకున్నా, ఏ అధికారి ఏ బాధ్యతలు నిర్వహించినా ప్రజలకు ఎలాంటి అభ్యంతరాలు ఉండవు. సత్వర సేవలను కోరుకునే రైతాంగం వారి హక్కులకు భద్రత మాత్రమే కోరుకుంటారని ఓ యూనివర్సిటీ ప్రొఫెసర్ అభిప్రాయపడ్డారు.

Advertisement
Next Story

Most Viewed