కూకట్‌పల్లి సర్కిల్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేత

by  |
కూకట్‌పల్లి సర్కిల్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేత
X

దిశ, శేరిలింగంపల్లి: అక్రమ నిర్మాణాలపై కూకట్ పల్లి సర్కిల్ జీహెచ్ఎంసీ అధికారులు చర్యలకు కదిలారు. హైదర్‌ నగర్ డివిజన్ పరిధిలోని రామ్ నరేశ్ నగర్ లో బుధవారం ప్లాట్ నెంబర్ 311లోని అక్రమ నిర్మాణాన్ని కూల్చివేశారు. హైదర్ నగర్ గ్రామ పరిధిలోని అలీ తలాబ్ చెరువు ఎఫ్టీఎల్ స్థలంలో అనుమతులు లేకుండా అక్రమంగా భవన నిర్మాణాన్ని చేపడుతున్నట్లు అధికారులకు ఫిర్యాదులు అందాయి. ఇదే విషయంపై పత్రికల్లో కథనాలు సైతం ప్రచురితమయ్యాయి.

వీటిపై కాస్త ఆలస్యంగానైనా స్పందించిన కూకట్‌పల్లి టౌన్ ప్లానింగ్ అధికారులు సదరు అక్రమ నిర్మాణాన్ని కూల్చివేశారు. ఈ సందర్భంగా ఏసీపీ వేణు మాట్లాడుతూ.. అక్రమ నిర్మాణాలను ఉపేక్షించేది లేదని, అనుమతులున్న వరకే నిర్మాణాలను చేపట్టాలన్నారు. అంతకుమించి నిర్మిస్తే భవనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. కూల్చివేతలో ఏసీపీ వెంట టీపీఎస్ దీపిక, రెవెన్యూ సిబ్బంది, టౌన్ ప్లానింగ్ సిబ్బంది ఉన్నారు.

తూతూమంత్రంగా కూల్చివేతలు..

అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నామని చెప్పుకునేందుకు జీహెచ్ఎంసీ అధికారులు నానాతంటాలు పడుతున్నారు. హైదర్ నగర్ డివిజన్ లో తాజాగా అక్రమ కట్టడంపై ఉక్కుపాదం మోపామని చెబుతున్న అధికారులు కేవలం నామమాత్రంగా కూల్చేశారు. అక్కడక్కడ కూల్చివేసి పనైపోయినట్లు చేతులు దులుపుకున్నారు. వారి పని తీరుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. అక్రమ నిర్మాణం అని తెలిసి చైన్ మెన్ నుంచి డీసీ వరకూ చోద్యం చూస్తున్నారని, ఎవరైనా ఫిర్యాదు చేస్తే తప్పా ఇలాంటి అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. హైదర్ నగర్ డివిజన్ లో అనుమతులు లేకుండా విచ్చలవిడిగా వెలుస్తున్న మిగతా కట్టడాలపై సైతం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.


Next Story

Most Viewed