గ్యాంగ్‌స్టర్‌గా మారిన బాక్సర్

by  |
గ్యాంగ్‌స్టర్‌గా మారిన బాక్సర్
X

దిశ, స్పోర్ట్స్: ‘సార్.. నేను చాలా పెద్ద పేరు సంపాదించాలి. ఏదో ఒకరోజు దేశమంతా నా గురించే మాట్లాడుకోవాలి’.. ఇదీ దీపక్ పహల్ (25) తన కోచ్ అనిల్ మాలిక్‌తో తొమ్మిదేళ్ల క్రితం చెప్పిన మాట. బాక్సింగ్‌లో మంచి ప్రతిభ కనబరిచే దీపక్ పహల్ తప్పకుండా ఏదో ఒక రోజు ఫేమస్ అయిపోతాడని భావించాడు. ఒక గొప్ప బాక్సింగ్ క్రీడాకారుడు అవుతాడనుకుంటే.. ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్‌గా మారిపోయాడు. ఢిల్లీ పోలీసులు ఇప్పుడు దీపక్ పహల్ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. అతడు పలు మర్డర్ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని.. స్వయంగా కొంత మందిని కూడగట్టి సెటిల్‌మెంట్లు చేస్తున్నాడని పోలీసులు చెబుతున్నారు. ఇటీవల తన సహచరుడు ఒకరిని పోలీసుల కస్టడీ నుంచి తప్పించడానికి ఏకంగా కాల్పులకు తెగబడ్డాడు. అయితే అతడు విడిపించాలనుకున్న వ్యక్తి ఆ ఎన్‌కౌంటర్‌లో చనిపోవడంతో అక్కడి నుంచి పారిపోయి అజ్ఞాతవాసంలోకి వెళ్లిపోయాడు.

అద్భుతమైన బాక్సర్

హర్యానాలోని సోనేపట్ సమీపంలోని గానౌర్ గ్రామంలో 1996లో దీపక్ పహల్ జన్మించాడు. చిన్నతనం నుంచే బాక్సింగ్ పట్ల మక్కువ పెంచుకున్న పహల్.. ఎప్పటికైనా మంచి బాక్సర్ కావాలని కలలు కనేవాడు. హర్యానాలో బాక్సింగ్, రెజ్లింగ్ క్రీడాకారులు ఎక్కువగా ఉంటారు. వారి బాటలోనే నడవాలని డిసైడ్ అయిన దీపక్.. తనకు సహజసిద్ధంగా ఉన్న టాలెంట్‌కు మరింత మెరుగులు దిద్దుకున్నాడు. ఇండియన్ అమెచ్యూర్ బాక్సింగ్ ఫెడరేషన్ (ఐఏబీఎఫ్)లో నవంబర్ 2008లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. దీపక్ 12 ఏండ్ల వయసు ఉన్నప్పుడు బీజింగ్‌లో జరిగిన ఒలంపిక్స్‌లో విజేందర్ సింగ్స్ కాంస్య పతకం గెలుచుకున్నాడు.

ఆ సమయంలో ఎంతో మంది హర్యానా కుర్రోళ్లు బాక్సర్లుగా మారిపోవాలని బాక్సింగ్ క్లబ్స్‌లో చేరిపోయారు. బాక్సింగ్ చరిత్రలో క్యూబా ఆధిపత్యం నడుస్తుంటుంది. అలాగే ఇండియాలో హర్యానా బాక్సర్లకు ఫేమస్. అందుకే దాన్ని లిటిల్ క్యూబా అంటారు. అలా ఆ లిటిల్ క్యూబాలో దీపక్ పహల్ కూడా ఎన్నో కలలు కన్నాడు. అయితే కుటుంబం మాత్రం దీపక్ చదువుల్లో రాణించాలని భావించారు. స్కూలింగ్ సమయంలోనే బీడీలు తాగడం మొదలు పెట్టిన దీపక్.. అనేక చెడు వ్యసనాలకు అలవాటయ్యాడు.

కానీ, ఒక్కసారి బాక్సింగ్ రింగ్‌లోకి అడుగుపెడితే అతడిని ఎదుర్కోవడానికి ప్రత్యర్థులకు గుండెల్లో దడపుట్టేది. కోచ్ అనిల్ మాలిక్ సహాయంతో మంచి బాక్సర్‌గా ఎదిగిన దీపక్.. 2011లో జాతీయ బాక్సింగ్ చాంపియన్ అయ్యాడు. జూనియర్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్‌లో ఇండియా తరపున రెండు సార్లు దీపక్ ప్రాతినిథ్యం వహించాడు. 57 కేజీల విభాగంలో ఒలంపిక్ పతకం కొట్టాలని దీపక్ తన సన్నిహితుల వద్ద చెబుతుంటే వాడు. కానీ చివరకు ఒక గ్యాంగ్‌స్టర్ అవడం కోచ్‌తో పాటు సహచరులను ఆశ్చర్యపరుస్తున్నది.

గ్యాంగ్‌స్టర్..

ఢిల్లీ పోలీసుల అదుపులో కుల్దీప్ మన్ అలియాస్ ఫజ్జా అనే ఒక నేరస్తుడు ఉన్నాడు. మార్చి 29న ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అతడిని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తీసుకెళ్తుండగా దీపక్ పహల్ కస్టడీ నుంచి తప్పించడానికి ప్రయత్నించాడు. ఆసమయంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఫజ్జా చనిపోగా.. దీపక్ అక్కడి నుంచి పారిపోయాడు. బాక్సర్‌గా ఉన్న సమయంలోనే బెదిరింపులు, సెటిల్మెంట్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు రావడంతో అతడి బాక్సింగ్ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అయ్యింది.

ఢిల్లీకి చెందిన గ్యాంగ్‌స్టర్ గోగితో దీపక్ జత కలిశాడు. ఆ గ్యాంగ్ సభ్యుడిగా ఉంటూ నాలుగు హత్య కేసుల్లో ఇరుక్కున్నాడు. మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ (ఎంసీఓసీఏ) కింద హత్య, దోపిడి వంటి కేసులు నమోదయ్యాయి. అతడిపై మహారాష్ట్ర ప్రభుత్వం రూ. 2 లక్షల రివార్డు కూడా ప్రకటించింది. పలుమార్లు పోలీసులకు దొరికినా బెయిల్‌పై బయటకు వచ్చేవాడు. ప్రస్తుతం ఒక కేసులో శిక్ష అనుభవిస్తూ పెరోల్‌పై బయట ఉన్నాడు. పెరోల్ గడువు దాటిపోయినా అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఒక మంచి బాక్సర్ అవుతాడని అతడి కుటుంబం, స్నేహితులు, గ్రామస్తులు భావించినా.. చివరకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా మారడాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు.


Next Story

Most Viewed