గద్వాలలో కలవరం

by  |
గద్వాలలో కలవరం
X

దిశ, మహబూబ్‌నగర్: ఉమ్మడి జిల్లాలో జోగుళాంబ గద్వాల మినహా నాలుగు జిల్లాలో కరోనా కేసుల ప్రభావం చాలావరకు తగ్గిందనే చెప్పాలి. ఇప్పటివరకు వనపర్తిలో ఎలాంటి కరోనా కేసు నమోదు కాకపోగా నారాయణపేటలో ఒక్క కేసు మినహా తర్వాత కేసులు రాలేదు. అదే సమయంలో నాగర్‌కర్నూల్ జిల్లాలో మర్కజ్ ఘటనకు సంబంధించి 2 కేసులు మినహా ఇతర కేసులు నమోదు కాకపోవడం అక్కడి అధికారులకు ఊరటనిచ్చింది. మహబూబ్‌నగర్‌లో సైతం మర్కజ్ ఘటన తర్వాత వచ్చిన కేసులు మినహా కొత్తవి రాలేదు. కానీ జోగుళాంబ గద్వాల జిల్లాలో కేసులు పెరుగుతుండటం కలవరపెడుతుంది.

ప్రస్తుతం మహబూబ్‌నగర్ జిల్లాలో 619మందిని, నారాయణపేట జిల్లాలో 2,216, నాగర్‌కర్నూల్లో 197, వనపర్తిలో 203మందిని హోం క్వారంటైన్‌లో ఉంచారు. గద్వాలలో మాత్రం 968 మందిని హోం క్వారంటైన్‌లో ఉంచగా వీరి సంఖ్య మరింతగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో ప్రభుత్వ క్వారంటైన్ కేంద్రాల్లో 200మంది, ఐసోలేషన్‌లో 19మంది ఉన్నట్లు సమాచారం. అలాగే మహబూబ్‌నగర్‌లో పాజిటివ్ వచ్చిన ఐదుగురు పూర్తిగా కోలుకొని డిశ్చార్జి కాగా మరో ఆరుగురు చికిత్స పొందుతున్నారు. అలాగే నాగర్‌కర్నూల్‌కు చెందిన ఇద్దరికి, గద్వాలకు చెందిన 38మంది చికిత్సను అందిస్తున్నారు. నారాయణపేటకు చెందిన బాలుడు మృతిచెందిన తర్వాత కేసులు నమోదు కాలేదు. అయితే నారాయణ‌పేటలో 2నెలల బాలుడికి కరోనా పాజిటివ్ ఉదంతం కలకలం రేపిన తర్వాత అధికారులు విస్తృతంగా చర్యలు చేపట్టారు. ఈ సందర్భంలోనే మద్దూరు, కోస్గి ప్రాంతాల నుండి 72మంది నమూనాలను సేకరించగా వీరిలో 60మందికి నెగటివ్ రావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

అయితే తాజాగా హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న డీసీఎం డ్రైవర్‌ యజమానికి పాజిటివ్ రావడం, సదరు డ్రైవర్ హైదరాబాద్‌ వెళ్ళి రావడంతో మరోమారు జిల్లాలో కరోనా కలకలం రేపింది. దీంతో ఊట్కూర్ మండలంలో అతనితో కాంటాక్ట్ అయిన సుమారు 20మంది నమూనాలు సేకరించి పరీక్షలకు పంపించారు. అటు వనపర్తి, నాగర్ కర్నూల్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో కొత్తగా కేసులు నమోదు కాకపోవడం కొంత ఊరాటనిస్తుంది. అయితే లాక్‌డౌన్ పూర్తయ్యేంత వరకు కఠినంగానే వ్యవహరించాలని అధికారులు క్షేత్రస్థాయి సిబ్బందిని అదేశిస్తున్నారు. కరోనా ప్రభావిత ప్రాంతాల నుండి వచ్చేవారిపై నిఘా ఉంచాలని చెబుతున్నారు.

Tags: Corona Virus, Lockdown, Mahabubnagar, Gadwal, Narayanpet, Nagercoil, DCM Driver, Hyderabad, Positive Cases, Quarantine


Next Story

Most Viewed