కరీంనగర్ పెద్దాసుపత్రిలో చీకటి కోణం..!!

by  |
కరీంనగర్ పెద్దాసుపత్రిలో చీకటి కోణం..!!
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : ఉత్తర తెలంగాణా జిల్లాలకు పెద్ద దిక్కుగా ఉన్న కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో మాయాజాలం నడుస్తోందా? కోవిడ్ చికిత్సా కేంద్రం మాటున ఏం జరుగుతోంది? ఘోరాలు, దారుణాలు చోటు చేసుకుంటున్నా వైద్య విధాన పరిషత్ ఉన్నతాధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదో అంతు చిక్కకుండా తయారైంది.

కోవిడ్ వార్డు దుస్థితి..

కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వార్డులో అసలేం జరుగుతోందో అంతు చిక్కకుండా తయారైంది. ఈ వార్డులో ఉన్న పేషెంట్లకు కనీసం తాగడానికి నీళ్లు కూడా అందుబాటులో ఉంచడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. దీంతో కరోనా పేషెంట్లు నీళ్ల కోసం బయటకు వస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. కరోనా బాధితుల చికిత్స కోసం వాడుతున్న రెమెడిసివిర్ ఇంజక్షన్లు కూడా పేషెంట్లకు ఇచ్చినట్టుగా రాసుకుని బయటకు తరలిస్తున్నారన్న అనుమానాలు కూడా బయటకు వస్తున్నాయి. కరోనా అంటేనే భయపడుతున్న ఈ పరిస్థితుల్లో కరోనా బాధితులు ఉన్న వార్డుల్లోకి ఎవరూ రారన్న ధీమాతో ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తున్నారు. ఓ వైపున జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్ సర్కారు వైద్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తుంటే ఆయన సొంత జిల్లాలోనే ఇలాంటి పరిస్థితి ఎదురుకావడం విచిత్రం.

టాయ్‌లెట్స్ దారుణం..

రోగులు వాడేందుకు ఈ ఆసుపత్రిలో కేవలం మూడే టాయిలెట్స్ ఉండడంతో నరకయాతన అనుభవిస్తున్నారు. వెస్ట్రన్ టైప్ టాయ్‌లెట్స్ లేకపోవడంతో వృద్దులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాలన్ని తెలిసినా బయటకు చెప్తే తమను ఇబ్బందులు పెడతారని రోగులు భయపడుతున్నారు. కరోనా బాధితులకు అందిస్తున్న ఆహారం విషయంలో కూడా ఇష్టం వచ్చినట్టుగా సరఫరా చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. డ్రై ప్రూట్స్‌తో పాటు పౌష్టికాహారం కోవిడ్ బాధితులకే కాకుండా, హెల్త్ వర్కర్స్‌కు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించినా కాంట్రాక్టర్, ప్రభుత్వ వైద్యశాల అధికారులు తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. కరీంనగర్ సివిల్ ఆసుపత్రి బాగోతాలపై బాధితులు బయటకు చెప్పడానికి గజగజ వణికిపోతున్నారు.

గత సంవత్సరం ఫస్ట్ వేవ్ సమయంలో కరోనా పేషెంట్ విషయంలో నిర్లక్ష్యంగా వ్వవహరించారని ఓ బాధితుని అటెండెంట్ వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీంతో ఆగ్రహించిన సివిల్ ఆసుపత్రి వైద్యులు అతనిపై సీరియస్ అయి చనిపోయిన కరోనా పేషెంట్ శవాన్ని ఇవ్వమని బెదిరించారు. దీంతో సదరు కరోనా బాధితుని బంధువు తాను సివిల్ ఆసుపత్రి వైద్యులపై తప్పుడు ప్రచారం చేశానని, క్షమించాలని కోరుతూ మళ్లీ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేయాల్సి వచ్చింది. ఆ తరువాత మృతదేహాన్ని బాధితుడు తీసుకు వెళ్లి తనకు ఎదురైన అనుభవం చెప్పకోవడంతో బీజైవైఎం రాష్ట్ర కార్యదర్శి పెండ్యాల సాయికృష్ణారెడ్డి మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. ఇప్పుడు కూడా ఆసుపత్రి వైద్యులు తమను అలాగే బెదిరింపులకు గురి చేస్తారన్న ఆందోళనతో చాలా మంది కరోనా బాధితులు, వారీ బంధువులు ఆసుపత్రిలో జరుగుతున్న దారుణాలను బయటకు చెప్పడం లేదు.

బినామీ ఉద్యోగులే ఎక్కువ..

సాక్షాత్తు జిల్లా కేంద్రంలోని సివిల్ ఆసుపత్రిలో పెద్ద ఎత్తున బినామీ ఉద్యోగులు పనిచేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అసలు ఉద్యోగి విధులకు రాకుండా వారికి ప్రత్యామ్నాయంగా మరోకరిని డ్యూటీలకు పంపిస్తున్నట్టుగా సమాచారం. దీంతో ఎలాంటి బాధ్యత లేని బినామీ ఉద్యోగులు ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తున్నారు. ఆస్పత్రిలో పనిచేస్తున్న మహిళల పట్ల కూడా దురుసుగా ప్రవర్తిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. గత గురువారం కూడా అంప్రెటిషిప్ చేస్తున్న ఓ స్టూడెంట్‌పై అఘాయిత్యానికి పాల్పడినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో కూడా ఆసుపత్రి అధికారులు చర్యలు తీసుకోకపోవడం, క్రిమినల్ కేసు బుక్ చేయకపోవడం గమనార్హం.

కఠిన చర్యలు తీసుకోవాలి..
పెండ్యాల సాయికృష్ణారెడ్డి, బీజైవైఎం రాష్ట్ర కార్యదర్శి

కరీంనగర్ సివిల్ ఆసుపత్రిలో జరుగుతున్న దారుణాలపై సమగ్ర విచారణ జరిపించాలి. రెమిడెసివేర్ ఇంజక్షన్లు దారి మల్లుతున్న విషయంపై ప్రత్యేక దృష్టి సారించాలి. బినామీ ఉద్యోగుల వ్యవహారంపై నిగ్గు తేల్చడంతో పాటు ఇటీవల ఓ నర్సింగ్ స్టూడెంట్‌పై జరిగిన అఘాయిత్యం ఘటనపై కూడా పోలీసులు సుమోటో కేసు నమోదు చేయాలి. రోగుల పట్ల మానవతా ధృక్ఫథంతో సేవలందించడంలో నిర్లక్ష్యం వహిస్తున్న వైద్యులను తొలగించాలి. అలాగే కరోనా బాధితులకు, పేషెంట్లకు చికిత్స అందిస్తున్న హెల్త్ వర్కర్స్‌కు ఇచ్చే పౌష్టికాహారం విషయంలోనూ లోతుగా విచారణ జరిపించి బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకోవడంతో పాటు ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసిన వారి నుండి రికవరీ చేయాలి.

Next Story