లేటెస్ట్ కరెంట్ అఫైర్స్: (మే 26, 2023)

by Disha Web Desk 17 |
లేటెస్ట్ కరెంట్ అఫైర్స్: (మే 26, 2023)
X

ముగ్గురు భారతీయులకు ప్రతిష్ఠాత్మక పురస్కారం:

విధి నిర్వహణలో ప్రాణ త్యాగం చేసిన ముగ్గురు భారతీయ శాంతి పరిరక్షకులకు ఐరాస పురస్కారం ప్రకటించింది. ఐరాస తరఫున పోరాడుతూ ప్రాణాలు కోల్పోయిన మొత్తం 103 మంది సైనికులకు డగ్ హమర్ స్కోల్డ్ పతకాలు లభించాయి. వీరిలో బీఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్స్, శిశుపాల్‌సింగ్, సన్వాలా రామ్ విష్ణోయి. వీరిద్దరూ కాంగోలో పనిచేశారు. వృత్తి నిపుణుల హోదాలో పనిచేసిన షాబెర్ తహెర్ అలీ.. ఈయన ఇరాక్ లో సేవలు అందించారు. ఐరాస తరఫున శాంతి పరిరక్షక దళాల్లో పనిచేసేందుకు భారత్ 6000 మందికి పైగా సైనిక, పోలీసు సిబ్బందిని వివిధ దేశాలకు పంపించింది.

2022-23లో 16 శాతం తగ్గిన ఎఫ్‌డీఐ:

స్థూల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) దశాబ్దంలోనే తొలిసారిగా 2022-23లో తగ్గాయి. 2021 -22తో పోలిస్తే 2022-23లో ఎఫ్‌డీఐ 16.3 శాతం తగ్గి 71 బలియన్ డాలర్లకు పరిమితమయ్యాయని ఆర్‌బీఐ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో మందగమనం ఇందుకు కారణం. 2021-22లో స్థూల ఎఫ్‌డీఐలు 26 శాతం క్షీణించి 34.298 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. 2022-23లో నికర ఎఫ్‌డీఐలు 27 శాతం తగ్గి 28 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి.

రిఫ్లెక్షన్స్ ఆన్ ఇండియాస్ పబ్లిక్ పాలసీస్.. పుస్తకావిష్కరణ:

దేశాభివృద్ధిలో బ్యూరోక్రసీ అత్యంత కీలకపాత్ర పోషిస్తోందని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ పేర్కొన్నారు. 1984వ బ్యాచ్‌కు చెందిన 10 మంది ఐఏఎస్ అధికారులు రాసిన రిఫ్లెక్షన్స్ ఆన్ ఇండియాస్ పబ్లిక్ పాలసీస్.. పుస్తకాన్ని ధన్‌ఖడ్ విడుదల చేశారు.

అత్యంత దయనీయ దేశం జింబాబ్వే:

ప్రపంచంలోనే అత్యంత దయనీయ దేశంగా జింబాబ్వే నిలిచింది. ప్రముఖ అంతర్జాతీయ ఆర్థిక వేత్త స్టీవ్ హాంకే ‘వార్షిక దయనీయ సూచీ’ ప్రకారం.. అక్కడి ఆర్థిక పరిస్థితులు దారుణంగా ఉన్నట్లు తెలుస్తోంది. యుద్ధాలతో అతలాకుతలం అవుతున్న దేశాలకంటే ఇక్కడి పరిస్థితులే దయనీయంగా ఉండటం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా పరిశీలించిన 157 దేశాల్లో రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణంతో జింబాబ్వే తొలి స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో వెనెజువెలా, సిరియా, లెబనాన్, సూడాన్, అర్జెంటీనా, యెమెన్, ఉక్రెయిన్, క్యూబా, తుర్కియే, శ్రీలంక, హైతీ, అంగోలా, టోంగా, ఘనా దేశాలు తొలి 15 స్థానాల్లో ఉన్నాయి.

ప్రపంచవ్యాప్తంగా విపత్తుల కారణంగా 20 లక్షల మరణాలు:

దేశంలో 1970 నుంచి 2021 మధ్య సంభవించిన 573 ప్రకృతి విపత్తులతో 1,38,377 మంది ప్రాణాలు కోల్పోయారని ప్రపంచ వాతావరణ సంస్థ వెల్లడించింది. అదే ప్రపంచవ్యాప్తంగా 12వేల విపత్తుల కారణంగా 20 లక్షల మంది మరణించినట్లు వెల్లడించింది. నాలుగేళ్లకోసారి జరిగే డబ్ల్యూఎంవో సదస్సు సందర్భంగా ఈ గణాంకాలను ప్రకటించింది. విపరీత వాతావరణ పరిస్థితుల వల్ల ఒక్క అమెరికాలోనే రూ. 14 లక్షల కోట్ల నష్టం వాటిల్లిందని డబ్ల్యూఎంవో సెక్రటరీ వెల్లడించారు.

ఇంటర్నేషనల్ జంపింగ్ మీట్‌లో శ్రీశంకర్‌కు స్వర్ణం:

భారత స్టార్ లాంగ్ జంపర్ మురళీ శ్రీశంకర్ ఇంటర్నేషనల్ జంపింగ్ మీట్‌లో స్వర్ణం సాధించాడు. కల్లిథియాలో జరిగిన లాంగ్ జంప్ ఈవెంట్‌లో 8.18 మీటర్ల దూరం దూకి టాప్ ప్లేస్ లో నిలిచాడు. ఆరో ప్రయత్నంలో శ్రీశంకర్ ఈ దూరాన్ని అందుకున్నాడు.


Next Story

Most Viewed