అత్యాధునిక పద్ధతిలో పంటల సాగు

508

దిశ, కుత్బుల్లాపూర్: కూరగాయల సాగులో దిగుబడి రాకపోవడం రాష్ట్రంలో ప్రధాన సమస్య. దీనికి కారణం నాణ్యమైన దిగుబడినిచ్చే వంగడాలు లభించకపోవడం, ఆధునిక పరిజ్ఞానం లేకపోవడం, క్షేత్రస్థాయిలో సాగు జరుగకపోవడం, రక్షిత వాతావరణంలో నారు పెంచే సదుపాయాలు లేకపోవడం వంటివి కారణాలు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో నగరానికి చుట్టు పక్కల జిల్లాల రైతులకు అత్యాధునిక పద్ధతిలో నారు పెంచి అందజేస్తున్నారు. చీడలు పట్టకుండా, రోగాలు రాకుండా అధిక దిగుడినిచ్చే నారును పెంచి ఆశాఖ ఇస్తుంది. నాసిరకం విత్తనాల వల్ల కలిగే నష్టాలు రాకుండా చేయడంతోపాటు క్షేత్రస్థాయిలో ఉద్యానవన శాఖాధికారులు, సిబ్బంది రైతులకు సూచనలు, సలహాలు ఇస్తున్నారు.

హైటెక్​ నర్సరీ..

సాధారణ పద్ధతుల్లో నారు మడిలో చీడ పురుగులు, ఇతర వైరస్ ల సమస్య ఉంటుంది. మొక్కలు మొలకెత్తే సమయంలో అన్ని రకాల చీడలు ఆశించి నారులో నాణ్యత లోపిస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో ఆధునిక సాంకేతికతతో ఏర్పాటు చేసిన హైటెక్ నర్సరీలో పెంచిన మొక్కలను రైతులకు అందించడం జరుగుతుంది. ఇక్కడ పెంచిన మొక్కలకు నియంత్రిత వాతావరణం కల్పిస్తారు. ఇందుకు ఫ్యాన్ అండ్ ప్యాడ్ వ్యవస్థలో ప్రతి రోజు మొక్కకు కావాల్సిన ఉష్ణోగ్రతలు, తేమ సౌకర్యాలను కల్పిస్తారు. దిగుబడినిచ్చే విత్తనాలను ప్రభుత్వం నేరుగా కంపెనీల నుంచే సేకరించి మొక్కలను పెంచుతుంది.

ఫ్యాన్ అండ్ ప్యాడ్ వ్యవస్థ అంటే..?

హైటెక్ నర్సరీలో మొక్కలకు కావాల్సిన ఉష్ణోగ్రతలను ఫ్యాన్ అండ్ ప్యాడ్ సిస్టం ద్వారా అందిస్తారు. మొక్క మొలకెత్తే సమయంలో 70నుంచి 80శాతం గాలి, తేమ ఉండే విధంగా చేసి మొలక శాతాన్ని పెంచుతారు. ఈ విధానానికి ఆటోమేటిక్ యంత్రం ద్వారా విత్తనాలను నాటుతారు. సమాన లోతులో ఒకేరకమైన విత్తనాలను గంటకు 12నుంచి 15వేల విత్తనాలను నాటుతారు. మట్టితో అవసరం లేకుండా పూర్తిగా కోకోపిట్(కోకోపిట్), వర్మిక్ లైట్(రాయి నుంచి రూపొందించిన పోషకం)ను, ఇతర పోషకాలను యంత్రం సహాయంతో అతి తక్కువ ఖర్చుతో మొక్కను పెంచేందుకు పని చేస్తారు. ఇక్కడి మొక్కలకు బూమర్ ఇరిగేషన్(నీటిని చల్లే యంత్రం) ద్వారా 5లక్షల మొక్కలకు కేవలం గంటలోనే నీటిని చల్లుతారు. ఈ యంత్రం ఒక మొక్కకు కావాల్సిన స్థాయిలోనే నీటిని అందిస్తుంది. అదే విధంగా నర్సరీరికి ఒకవైపున వేడిని పారదోలేందుకు భారీ ఫ్యాన్లు, మరోవైపు చల్లదనాన్నిచ్చే ప్యాడ్ లు ఏర్పాటు చేసి కా వాల్సిన ఉష్ణోగ్రతలు అందిస్తారు. అత్యాధునిక సాంకేతికతో నాటిన మొక్కల కాండంలో ధృడత్వం పెరుగుతుంది. 25 నుంచి 30రోజుల్లో ఐదు ఆకులు వస్తాయి. రైతులు నాటుకు నే విధంగా 15నుంచి 20సెంటీ మీటర్ల ఎత్తు పెరుగుతాయి.

ధరల వివరాలు…

ప్రస్తుతం టమాట, వంకాయి, పచ్చిమిర్చి మొక్కలు మాత్రమే సబ్సిడీపై ఇస్తున్నారు. సబ్సిడీ ఇచ్చే రైతుల జిల్లాల వివరాలను ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. కేటాయించిన జిల్లాలకు చెందిన రైతులు టమాట, వంకాయ మొక్కలు పెంచుకునేందుకు ఎకరానికి రూ.15వేలు చెల్లిస్తే 8వేల టమాట మొక్కలు ఇస్తారు. పచ్చిమిరపకాయ మొక్కలకు రూ.1280లు చెల్లిస్తే 6,400 మొక్కలు ఇస్తారు. ఒక రైతుకు రెండున్నర ఎకరాలకు మాత్రమే సబ్సిడీపై ఇస్తారు. ప్రైవేట్ గా కొనాలంటే ఒక్క మొక్కకు ఒక్క రూపాయి చెల్లిస్తే పెంచి ఇస్తారు. ఒకవేళ రైతులకు ఇష్టమైన విత్తనాలను పెంచాలంటే సర్వీస్ చార్జితో మొక్కను పెంచిస్తారు. 20రోజుల్లో పెరిగే మొక్కకైతే రూ.60పైసలు, 30 రోజుల్లో పెరిగే వాటికి రూ.75పైసలు, 40రోజుల్లో పెరిగే మొక్కలకు ఒక్క రూపాయి చెల్లించాలి. ప్రైవేట్ గా తీసుకోవాలంటే సిద్ధంగా ఉంటే అప్పటికప్పడే ఇస్తారు. కానీ అధికంగా కావాలంటే నెల రోజుల ముందే సమాచారం నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకోవాలి.

రైతుల శ్రేయస్సు కోసమే…

ఇష్టానుసారంగా ప్లానింగ్ లేకుండా పంటలు వేయడం వల్ల రైతులు నష్టపోతున్నారనే ఉద్ధేశంతో ప్రభుత్వం ఈ ప్రక్రియను చేపట్టింది. రైతుల శ్రేయస్సు కోసమే మొక్కలను సబ్సిడీపై ఇస్తున్నాం. సబ్సిడీ లేని వారికి కూడా సర్వీస్ చార్జితో మొక్కలను పెంచి ఇస్తాం. వివరాలకు జీడిమెట్లోని సీఓఈలోగానీ, 7997724956 నెంబర్ లో గానీ సంప్రదించొచ్చు.

– రాజ్ కుమార్, సీఓఈ ఏడీహెచ్

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..