ఉద్యోగుల పదోన్నతులే ప్రధానం: సీఎస్

by  |
ఉద్యోగుల పదోన్నతులే ప్రధానం: సీఎస్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రస్తుతం ఉన్న పనుల్లో ఉద్యోగులకు పదోన్నతి కల్పించడం అత్యంత ముఖ్యమైనదని నొక్కిచెప్పిన ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ప్రాధాన్యతను ఇచ్చిన ఈనెల 24వ తేదీకల్లా కొలిక్కి తేవాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. జిల్లా స్థాయిలోని వివిధ శాఖల్లో, వివిధ క్యాటగిరీలలో పదోన్నతుల ప్రక్రియను జనవరి 31వ తేదీకల్లా పూర్తి చేయాల్సి ఉన్నందున 24వ తేదీ నాటికే సమావేశాలు, సమీక్షలను ముగించి జాబితాను రూపొందించాలని స్పష్టం చేశారు. సచివాలయం నుంచి మంగళవారం ఉదయం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడిన సీఎస్ పదోన్నతులతో పాటు కారుణ్య నియామకాల విషయంలో జాప్యం లేకుండా డెడ్‌లైన్‌లోగా పూర్తిచేయాలని స్పష్టం చేశారు.

పదోన్నతులు పూర్తిచేయడం ద్వారా వివిధ ఖాళీ పోస్టుల సంఖ్యపై స్పష్టత వస్తుందని, ఆ అంచనాకు అనుగుణంగా ప్రతీ సోమవారం జిల్లా కలెక్టర్లు ఆయా శాఖలు, విభాగాల ఉన్నతాధికారులతో సమీక్షలు నిర్వహించాలన్నారు. పదోన్నతులు, కారుణ్య నియామకాల విషయంలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ప్రతీ మంగళవారం సాయంత్రం కలెక్టర్లు ఈ అంశాల్లో ప్రోగ్రెస్ రిపోర్టులను సచివాలయానికి పంపడం, ప్రతీ బుధవారం ఉదయం సమీక్షా సమావేశాలు జరగడం ఈనెల 31వ తేదీ వరకు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఈ అంశంతో పాటు ధరణి పోర్టల్ పనితీరు, రెవెన్యూ సంబంధిత అంశాలు, రైతు వేదికలు, పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులు, ధాన్యం ఎండబెట్టుకోడానికి కళ్ళాలు, గ్రామ నర్సరీలు, ఉపాధి హామీ పనులు తదితర అంశాలపై కూడా సీఎస్ ఈ వీడియో కాన్ఫరెన్సులో కలెక్టర్లతో చర్చించారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఈ సీజన్‌లో మూడు నెలల ముందుగానే 14.10 కోట్ల పనిదినాలు దాటినందుకు అధికారులను అభినందించారు. రానున్న మూడు నెలల కోసం ప్రణాళికలు రూపొందించుకోవాలని ఆదేశించారు.

విద్యారంగంలో పోస్టుల భర్తీపై మంత్రి సమీక్ష
ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని విద్యా శాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి ఆ శాఖ అధికారులకు స్పష్టం చేశారు. ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, విద్యా శాఖ ఉన్నతాధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించి విద్యా శాఖకు సంబంధించిన అంశాలపై విస్తృతంగా చర్చించారు. క్యాటగిరీలవారీగా బోధన, బోధనేతర సిబ్బంది ప్రమోషన్లను పూర్తిచేయడానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. సిబ్బంది బదిలీలు, మధ్యాహ్న భోజనం, టెట్ పరీక్ష, విద్యా సంస్థల ప్రారంభం తదితర అంశాలపై చర్చించారు. ముఖ్యమంత్రితో చర్చించిన తరువాత తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

Next Story

Most Viewed