దోపిడీ కేసులో యువకుడు, ఓ బాలుడు అరెస్ట్.. క్యాబ్ డ్రైవర్ కు కత్తితో బెదిరింపు

by Bhanu |

క్యాబ్ డ్రైవర్‌ను కత్తితో బెదిరించి సెల్‌ఫోన్ దొంగిలించిన కేసులో యువకుడు, ఓ బాలుడు పోలీసుల చేతికి చిక్కారు.

దోపిడీ కేసులో యువకుడు, ఓ బాలుడు అరెస్ట్.. క్యాబ్ డ్రైవర్ కు కత్తితో బెదిరింపు
X

దిశ, కార్వాన్: క్యాబ్ డ్రైవర్‌ను కత్తితో బెదిరించి సెల్‌ఫోన్ దొంగిలించిన కేసులో యువకుడు, ఓ బాలుడు పోలీసుల చేతికి చిక్కారు. ఈ ఘటన ఆసిఫ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాలను ఏసీపీ విజయ శ్రీనివాస్ వెల్లడించారు. మల్లేపల్లి అఫ్జల్ సాగర్‌కు చెందిన సయ్యద్ రెహాన్ సాజిద్ (18), స్థానికంగా ఒక మెకానిక్ షాప్‌లో హెల్పర్‌గా పనిచేస్తున్నాడు.


అతడితో పాటు ఓ మైనర్ బాలుడు కలిసి గతంలో దొంగలించిన బైక్‌పై ప్రయాణిస్తూ జూన్ 9వ తేదీ తెల్లవారుజామున జేబాభాగ్ ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ ఓ క్యాబ్ డ్రైవర్‌ను అడిగి మొబైల్ తీసుకొని లోకేషన్ చూపించాలని కోరారు. అయితే, అనంతరం డ్రైవర్‌ను కత్తితో బెదిరించి ఫోన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. డ్రైవర్ నిరాకరించడంతో తలెత్తిన ఘర్షణలో కత్తి చేతికి తగలడంతో అతడికి గాయమైంది. దాంతో నిందితులు ఫోన్ దొంగలించి అక్కడి నుంచి పరారయ్యారు.


బాధితుడు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులును గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి దొంగిలించిన ఫోన్, కత్తిని స్వాధీనం చేసుకున్నారు. సయ్యద్ రెహాన్‌ను రిమాండ్‌కు తరలించగా, మైనర్ బాలుడిని జువెనైల్ కోర్టుకు హాజరుపరిచారు.

Next Story