HYD: గచ్చిబౌలిలో విషాదం.. 4వ అంతస్తు నుండి పడి కార్మికుడు మృతి

by Gantepaka Srikanth |

హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

HYD: గచ్చిబౌలిలో విషాదం.. 4వ అంతస్తు నుండి పడి కార్మికుడు మృతి
X

దిశ, శేరిలింగంపల్లి: హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనంపై నుంచి కిందపడి ఒక కార్మికుడు మృతిచెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధి కొండాపూర్ రాఘవేంద్ర కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. కొండాపూర్‌లోని రాఘవేంద్ర కాలనీలో ఓ ఐదు అంతస్థుల భవన నిర్మాణం సాగుతోంది. ఇక్కడ పనిచేసేందుకు ఛత్తీస్‌గడ్ రాష్ట్రానికి చెందిన చంద్ర కుమార్(33), జమ్మన సోమాని విక్కీ (22)లు భవన నిర్మాణ కార్మికులుగా పనిచేస్తూ ఉన్నారు. పనిలో భాగంగా శుక్రవారం భవనం నాలుగో అంతస్తు వద్ద పనిచేస్తూ ఉండగా గోవా కట్టెలు విరిగిపోయాయి. ఈ క్రమంలో ఇద్దరు కార్మికులు కింద పడిపోయారు. ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అక్కడే ఉన్న సహచరులు కిందపడ్డ ఇద్దరు కార్మికులను చికిత్స నిమిత్తం స్థానిక హాస్పిటల్‌కు తరలించారు. అయితే తీవ్రంగా గాయపడిన చంద్ర కుమార్ చికిత్స పొందుతూ మృతి చెందారు. మరో కార్మికుడు సోమాని విక్కీ ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. భవన యజమాని నిర్లక్ష్యం కారణంగా చంద్ర కుమార్ మృతి చెందారని, తమ కుటుంబానికి న్యాయం చేయాలని, భవన యజమానిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మృతుడి సోదరుడు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Next Story