- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఘోర ప్రమాదం: నానమ్మ ప్రాణాలు తీసిన మనవడి అజాగ్రత్త!
కంటిపాపలా పెంచిన మనవడి అజాగ్రత్తే ఆ వృద్ధురాలి ప్రాణాల మీదికి తెచ్చింది.

దిశ, వెబ్‌డెస్క్: కంటిపాపలా పెంచిన మనవడి అజాగ్రత్తే ఆ వృద్ధురాలి ప్రాణాల మీదికి తెచ్చింది. ఇంటి ఆవరణలో కారు పార్క్ చేసే క్రమంలో జరిగిన చిన్న పొరపాటు ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని మసైనీ ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. మసైనీలోని కద్రి గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే ఒక కుటుంబంలో ఈ విషాదం నెలకొంది. తన మహీంద్రా థార్ (Thar) వాహనాన్ని ఇంటి గ్యారేజీలో పార్క్ చేయడానికి ఒక యువకుడు ప్రయత్నించాడు. ఆ సమయంలో అతని నానమ్మ ఇంటి ప్రధాన గేటు వేయడానికి వెనుక వైపు నిలబడి ఉంది. వాహనాన్ని వెనక్కి తీస్తున్న క్రమంలో, ఒక్కసారిగా రివర్స్ గేర్ పడటంతో థార్ వేగంగా వెనక్కి దూసుకువచ్చింది. వెనుక వైపు వృద్ధురాలు ఉన్న విషయాన్ని గమనించని మనవడు వాహనాన్ని అలాగే పోనివ్వడంతో, ఆమె గోడకు, వాహనానికి మధ్య బలంగా నలిగిపోయింది. ప్రాణభయంతో ఆమె గట్టిగా కేకలు వేసినప్పటికీ, డ్రైవింగ్ సీట్లో ఉన్న మనవడు వెంటనే వినకపోవడంతో ఘోరం జరిగిపోయింది. తీవ్ర గాయాలైన వృద్ధురాలు అక్కడికక్కడే ప్రాణాలు వదిలినట్లు సమాచారం.
సీసీటీవీలో రికార్డైన దృశ్యాలు..
ఈ భయంకరమైన ప్రమాద దృశ్యాలన్నీ అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వాహనం నడిపేటప్పుడు ఏమరపాటుగా ఉంటే ఎంతటి ప్రాణనష్టం జరుగుతుందో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనమని పోలీసులు హెచ్చరిస్తున్నారు. కద్రి గేట్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.






