కేటీఆర్‌ను మరోసారి విచారించేది ఎప్పుడు?

by Gantepaka Srikanth |

ఫార్ములా ఈ కార్ రేసు అంశంలో కేసు నమోదై ఏడు నెలలు గడుస్తున్నా.. విచారణలో మాత్రం పురోగతి కనిపించడం లేదు.

కేటీఆర్‌ను మరోసారి విచారించేది ఎప్పుడు?
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఫార్ములా ఈ కార్ రేసు అంశంలో కేసు నమోదై ఏడు నెలలు గడుస్తున్నా.. విచారణలో మాత్రం పురోగతి కనిపించడం లేదు. ఫార్ములా ఈ కార్ రేస్‌లో అవినీతి జరిగిందని గత డిసెంబర్ 19న ఏసీబీ కేసు నమోదు చేసింది. అయితేఇప్పటి వరకు కేవలం ప్రాథమిక విచారణ మాత్రమే పూర్తయినట్లు తెలుస్తున్నది. ఇప్పటికే ఒకసారి ఏ1గా ఉన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఏ2గా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద కుమార్, ఏ3గా ఉన్న హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డిలను విడివిడిగా విచారించారు. మరోసారి విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని అప్పుడే చెప్పారు. అయితే మూడు నెలలు గడుస్తున్నా.. ఎలాంటి విచారణ జరగలేదు. ముగ్గురినీ ఒకేసారి విచారిస్తారని ప్రచారం జరిగినా.. ఈ అంశంపై అసలు స్పష్టతే లేకుండాపోయింది. ఫిబ్రవరి 17న చివరిసారిగా లండన్‌లో ఉన్న రేస్ నిర్వహణ సంస్థ ఫార్ములా ఈ కార్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఈవో) ప్రతినిధులను వర్చువల్‌గా విచారణ చేపట్టారు. ఇది పూర్తయి నాలుగు గడుస్తున్నా విచారణ ముందుగు సాగలేదు.

కేటీఆర్ విచారణపై మల్లగుల్లాలు

కేసులో ప్రధాన నిందితుడిగా పేర్కొన్న కేటీఆర్‌ను మరోసారి ఎప్పుడు విచారిస్తారనే దానిపై ఏసీబీ అధికారులు స్పష్టత ఇవ్వడం లేదు. మరోసారి విచారణకు రావాలని మే 26న ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు. మే 28న హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే ముందస్తుగా ప్లాన్ చేసుకున్న షెడ్యూల్ ప్రకారం అమెరికాకు వెళ్తున్నానని, తిరిగి వచ్చిన తర్వాత విచారణకు హజరవుతానని కేటీఆర్ ఏసీబీ అధికారులకు లేఖ రాశారు. అయితే కేటీఆర్ అమెరికా పర్యటన పూర్తి చేసుకుని వచ్చినా విచారణకు రాలేదు. కొత్త తేదీపై ఏసీబీ అధికారులు నోటీసులు కూడా అందజేయలేదు.

Next Story