జీవనోపాధికి వెళ్లి సజీవ దహనమై.. హైదరాబాద్ అగ్ని ప్రమాదంలో కాలిబూడిదైన రెడ్డిగూడెం వాసులు

by Dishafeatures2 |
జీవనోపాధికి వెళ్లి సజీవ దహనమై.. హైదరాబాద్ అగ్ని ప్రమాదంలో కాలిబూడిదైన రెడ్డిగూడెం వాసులు
X

దిశ, తుంగతుర్తి: ఉన్న ఆస్తులు అమ్మి క్యాన్సర్ సోకిన తల్లికి చికిత్స నిమిత్తం ఖర్చు చేశారు. సొంత గ్రామంలో జీవనోపాధి కరువై కట్టుబట్టలతో భార్యాపిల్లలను తీసుకొని హైదరాబాద్ చేరాడు. అక్కడ ప్రైవేట్ వాహన డ్రైవర్ గా పనిచేస్తూ వచ్చిన దాంట్లో ఊరిలో ఉంటున్న వృద్ధ తల్లిదండ్రులకు కొంత డబ్బు పంపిస్తూ.. మిగతాది భార్యాపిల్లల పోషణకు ఖర్చుపెట్టేవాడు. చివరికి హైదరాబాద్ కుషాయిగూడలో సంభవించిన ఘోర అగ్ని ప్రమాదంలో ఆయన, ఆయన భార్య, కుమారుడు కాలిబూడిదయ్యారు. దీంతో మరో కొడుకు దిక్కులేనివాడయ్యాడు. ఇక ఒక్కగానొక్క కొడుకు అగ్ని ప్రమాదంలో ఆహుతయ్యాడని తెలిసి ఆ వృద్ధ తల్లిదండ్రుల రోదన ఆకాశానికంటింది. ఇక ఈ ఘటనతో రెడ్డిగూడెం గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. హైదరాబాద్ లోని కుషాయిగూడ ప్రాంత టింబర్ డిపోలో జరిగిన అగ్నిప్రమాదంలో ఆహుతైన ముగ్గురి స్వస్థలం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం మద్దిరాల మండలం రెడ్డిగూడెం గ్రామం. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

రెడ్డిగూడెం గ్రామస్తుడు రేట్నేని జన్నయ్యకు ఇద్దరు కూతుళ్లు. ఒక కుమారుడు. ఆనాడు కూతుళ్ళ వివాహం కోసం ఉన్న వ్యవసాయ భూమిలో కొంత అమ్మాడు. మిగిలిన ఒక్క ఎకరం సాగు చేసుకుంటున్న తరుణంలో జన్నయ్య భార్య భద్రమ్మకు క్యాన్సర్ వ్యాధి సోకింది. దీంతో కుమారుడు నరేశ్( మృతుడు 36) తల్లి భద్రమ్మకి చికిత్స నిమిత్తం ఉన్న ఎకరం భూమిని కూడా అమ్మాడు. అనంతరం జీవనోపాధి కోసం పదేండ్ల క్రితం హైదరాబాద్ కు వెళ్లి కుషాయిగూడలో ట్రావెల్స్ గూడ్స్ నడుపుకుంటూ జీవిస్తున్నాడు. అనంతరం కొత్తగూడెం గ్రామానికి చెందిన స్వప్న (మృతురాలు 32) వివాహం చేసుకొని అక్కడే ఉంటున్నాడు. ఈ మేరకు వారికి ఇద్దరు కుమారులు సంతానం కలిగారు. ఓవైపు కుటుంబాన్ని పోషించుకుంటూ మరోవైపు స్వగ్రామానికి వచ్చి పేదరికంలో మగ్గుతున్న తల్లిదండ్రుల వద్దకు వచ్చేవాడు. కాగా శనివారం అర్ధరాత్రి ఘాడ నిద్రలో ఉన్న సమయంలో పక్కనేఉన్న టింబర్ డిపోకు నిప్పు అంటుకొని భారీ ఎత్తున మంటలు ఎగిసి పడ్డాయి. రెండో అంతస్తులో నిద్రిస్తున్న నరేష్ (36) భార్య స్వప్న (33), కుమారుడు జశ్విత్ (5) మంటల్లోనే కాలిపోయారు.

ఇది ఇలా ఉంటే మరో పెద్ద కుమారుడు హాత్విక్ (7) పక్క ఇంట్లో ఉన్న వారి వద్ద రాత్రి పడుకోగా ప్రాణాపాయం నుండి తప్పించుకోగలిగాడు. ఉదయమే లేచి తల్లిదండ్రుల వద్దకు వచ్చిన హాత్విక్ పరిస్థితిని చూసి భీతిల్లాడు. తన తల్లిదండ్రులు మంటల్లో కాలిపోయి మృతి చెందారని తెలుసుకొని రోధిస్తున్న తీరు వర్ణనాతీతంగా మారింది. మృతుల శవాలను పరీక్ష నిమిత్తం హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉంటే కొడుకు నరేష్, కోడలు స్వప్న, మనవడు జశ్విత్ మృతి చెందిన వార్త తుంగతుర్తి నియోజకవర్గంలోని రెడ్డిగూడెం గ్రామంలో వృద్ధులైన జన్నయ్య, భద్రమ్మలకు తెలియడంతో కన్నీరుమున్నీరవుతున్నారు. అంతేకాదు ఈ వార్త నియోజకవర్గ వ్యాప్తంగా దావాణంలా వ్యాపించింది. ఆసరాగా ఉంటాడనుకున్న వారంతా అగ్ని ప్రమాదంలో మృతి చెందడంతో ఓవైపు బతికి బయటపడ్డ చిన్న కుమారుడు, మరోవైపు వృద్ధ తల్లిదండ్రులు అనాధలయ్యారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed