పండుగ పూట విషాదం..చెరువులో మునిగి ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థి మృతి

by velandi.Saikiran |   (  Updated:2026-03-27 17:41:39  IST  )

ఈతకు వెళ్లిన 10వ త‌ర‌గ‌తి పరీక్షలు రాస్తున్న బాలుడు చెరువులో మునిగి దుర్మరణం చెందాడు.

పండుగ పూట విషాదం..చెరువులో మునిగి ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థి మృతి
X

– చెరువులో మునిగి టెన్త్​ ఎగ్జామ్స్​ రాస్తున్న విద్యార్థి దుర్మరణం

– తొర్రూరులో స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లడంతో దుర్ఘటన

– హయత్​ నగర్​ పీఎస్​ పరిధిలో ఘటన

దిశ, వనస్థలిపురం : రంగారెడ్డి జిల్లా.. అబ్దుల్లాపూర్​ మెట్​ మండలం.. హయత్​ నగర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో పండుగ పూట విషాదం చోటు చేసుకుంది. స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన 10వ త‌ర‌గ‌తి పరీక్షలు రాస్తున్న బాలుడు చెరువులో మునిగి దుర్మరణం చెందాడు. హయత్​ నగర్​ సీఐ నాగరాజు గౌడ్​ వివరాల ప్రకారం.. తొర్రూరు గ్రామానికి చెందిన బచ్చిగళ్ల శంకరయ్య, అనితల కుమారుడు అభిలాష్‌ (16) ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు రాస్తున్నాడు. కాగా శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో తన స్నేహితులతో కలిసి బయటకు వెళ్లాడు. అనంతరం సుమారు 3.30 గంటల సమయంలో తొర్రూరులోని మంగళగుంట చెరువులో ఈతకు దిగగా, అభిలాష్‌ ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయినట్లు తెలిసింది.

ఈ విషయాన్ని గ్రామంలోని సువర్ణ అనే మహిళ అభిలాష్‌ తండ్రి శంకరయ్యకు ఫోన్​ చేసి తెలిపారు. ‘తన కుమారుడు బాల శివ కుమార్‌ ఫోన్ చేసి ఈ విషయం చెప్పినట్లు ఆమె శంకరయ్యకు వివరించారు. సమాచారం అందుకున్న శంకరయ్య వెంటనే చెరువు వద్దకు వెళ్లి వెతకగా.. అపస్మారక స్థితిలో ఉన్న అభిలాష్​ను బయటకు తీశారు. వెంటనే అంబులెన్స్‌లో దగ్గరలోని వనస్థలిపురం ఏరియా ఆస్పత్రికి తరలించగా, అక్కడి డ్యూటీ వైద్యుడు పరీక్షించి అప్పటికే బాలుడు చనిపోయినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

రేపు ఎగ్జామ్​..

మృతి చెందిన‌ అభిలాష్​కు రేపు కూడా పదోతరగతి ఎగ్జామ్​ ఉన్నట్లు కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.

Next Story