- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రోడ్డు ప్రమాదమా ? హత్యా ? మాజీ సర్పంచ్ మృతి పై అనుమానాలు
దిశ, గద్వాల క్రైమ్ : జోగులాంబ గద్వాల జిల్లా, కేటీ దొడ్డి మండలం, నందిన్నె గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ చిన్న భీమరాయుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

దిశ, గద్వాల క్రైమ్ : జోగులాంబ గద్వాల జిల్లా, కేటీ దొడ్డి మండలం, నందిన్నె గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ చిన్న భీమరాయుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన సాధారణ రోడ్డు ప్రమాదం కాదని, ఇది ముమ్మాటికి హత్యేనని మృతుడి కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పోలీసులు ఈ కోణంలో దర్యాప్తును వేగవంతం చేశారు.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చిన్న భీమరాయుడు తన యూనికార్న్ బైక్ పై గద్వాల నుంచి తన స్వగ్రామం నందిన్నెకు వెళ్తుండగా జాంపల్లి వద్ద ఈ దారుణ సంఘటన జరిగింది. ఒక బొలెరో వాహనం ఏపీ 39 WH 3068 వెనుక నుంచి వచ్చి చిన్న భీమరాయుడు వాహనాన్ని బలంగా ఢీ కొట్టింది. ప్రమాదం జరిగిన తర్వాత బొలెరో వాహనం ఆయన్ను సుమారు 250 మీటర్ల దూరం వరకు ఈడ్చుకెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటనలో చిన్న భీమరాయుడు తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదం అనంతరం బొలెరో వాహనం నడిపిన వ్యక్తి వెంటనే ఆ ప్రాంతం నుంచి పరారయ్యాడని సాక్షులు పేర్కొన్నారు.
ప్రమాదంపై అనుమానాలు ఉన్నాయి : కుటుంబ సభ్యులు
ఘటనా స్థలానికి చేరుకున్న చిన్న భీమరాయుడు అన్న పెద్ద భీమరాయుడు ఘటనపై తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశారు. "ఇది కేవలం రోడ్డు ప్రమాదం కాదని, మా తమ్ముడిని ఎవరో ఉద్దేశపూర్వకంగానే హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు," అని ఆయన అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజకీయ నాయకుల పరామర్శ చిన్న భీమరాయుడు మృతి విషయం తెలుసుకున్న గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, బీఆర్‌ఎస్ (BRS) నాయకుడు బాసుహాన్మంతు వెంటనే మృతుడి స్వగ్రామానికి చేరుకున్నారు. వారు మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపించి, నిందితులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించేలా చూస్తామని కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు.
కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసుల దర్యాప్తు
మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. బొలెరో వాహనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కర్నూల్ జిల్లా, గోనెగండ్ల గ్రామానికి చెందినదిగా గుర్తించారు. ఈ ఘటన హత్యా లేక రోడ్డు ప్రమాదమా అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఘటన వెనుక ఏమైనా వ్యక్తిగత కక్షలు లేదా రాజకీయ కారణాలు ఉన్నాయా అనే అంశాలపై దృష్టి సారించి, పరారీలో ఉన్న బొలెరో డ్రైవర్ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.






