వారణాసిలో కలకలం: గంగానదిలో ఇఫ్తార్ విందు.. 14 మంది అరెస్ట్

by Ramesh Naini |

వారణాసిలోని గంగా నదిలో పడవపై ఇఫ్తార్ విందు నిర్వహించి, మాంసాహారం తింటూ నదిని అపవిత్రం చేశారనే ఆరోపణలతో 14 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర దుమారం రేగింది.

వారణాసిలో కలకలం: గంగానదిలో ఇఫ్తార్ విందు.. 14 మంది అరెస్ట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: కాశీలోని పవిత్ర గంగా నది మధ్యలో ఒక పడవపై ఇఫ్తార్ విందు నిర్వహించడం వివాదానికి దారితీసింది. పడవపై చికెన్ బిర్యానీ తింటూ, మిగిలిపోయిన ఎముకలను నదిలోకి విసిరినట్లు ఆరోపణలతో ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో స్థానికులు, హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ ఘటనపై స్పందించిన వారణాసి పోలీసులు 14 మందిని అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. సోమవారం సాయంత్రం కొంతమంది యువకులు అస్సీ ఘాట్ నుండి నమో ఘాట్ వరకు ప్రయాణించేలా ఒక పెద్ద పడవను బుక్ చేసుకున్నారు. పడవ ప్రయాణంలో ఉండగానే వారు నమాజ్ నిర్వహించి, అనంతరం ఇఫ్తార్ విందు చేసుకున్నారు. అయితే, ఈ విందులో పండ్లు, డ్రై ఫ్రూట్స్‌తో పాటు చికెన్ బిర్యానీని కూడా వడ్డించారు. పడవలో ఉన్నవారు మాంసాహారం తింటూ, ఆ వ్యర్థాలను పవిత్రంగా భావించే గంగా నదిలో పారవేశారని ఆరోపణలు వచ్చాయి.

పోలీసుల వేగవంతమైన చర్యలు..

ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో బీజేపీ యువమోర్చా (BJYM) నగర అధ్యక్షుడు రజత్ జైస్వాల్ కోత్వాలీ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కోట్లాది మంది ఆరాధ్య దైవంగా భావించే గంగా నదిలో మాంసాహారం భుజించడం, వ్యర్థాలను నదిలో వేయడం ద్వారా తమ మతపరమైన మనోభావాలను దెబ్బతీశారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన ఏసీపీ (కోత్వాలీ) విజయ్ ప్రతాప్ సింగ్ మాట్లాడుతూ.. ఫిర్యాదు అందిన వెంటనే కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించాం. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా, నది పవిత్రతను కాపాడేందుకు నిందితులను గుర్తించి ఎనిమిది గంటల్లోనే 14 మందిని అదుపులోకి తీసుకున్నాం అని తెలిపారు. కాగా, ఆధ్యాత్మిక రాజధానిగా పిలువబడే వారణాసిలో గంగా నది పరిసరాల్లో, నదిపై మాంసాహారం, మద్యం సేవించడంపై కఠినమైన నిషేధం ఉంది. నిందితులతో పాటు, నిబంధనలకు విరుద్ధంగా అనుమతించిన పడవ నిర్వాహకునిపై కూడా పోలీసులు చర్యలు చేపట్టారు. అతని లైసెన్స్‌ను రద్దు చేయాలని అధికారులు భావిస్తున్నారు.

Next Story