మనుషుల అక్రమ రవాణ కేసుతో లింక్ అంటూ .. 1.34 కోట్లు కొట్టేసిన సైబర్ చీటర్స్

by Bhanu |

ఓ రిటైర్డ్ సైంటిస్టుకు వీడియో కాల్ లో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి విచారణ అంటూ బురిడి కొట్టించి 1.34 కోట్లను సైబర్ నేరగాళ్లు కొట్టేశారు. ఈ మోసానికి సంబంధించి సైంటిస్టు రాచకొండ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మనుషుల అక్రమ రవాణ కేసుతో లింక్ అంటూ .. 1.34 కోట్లు కొట్టేసిన సైబర్ చీటర్స్
X

దిశ, సిటీక్రైం : ఓ రిటైర్డ్ సైంటిస్టుకు వీడియో కాల్ లో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి విచారణ అంటూ బురిడి కొట్టించి 1.34 కోట్లను సైబర్ నేరగాళ్లు కొట్టేశారు. ఈ మోసానికి సంబంధించి సైంటిస్టు రాచకొండ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ ఉప్పల్ సరస్వతి నగర్ కు చెందిన (73) సంవత్సరాల రిటైర్డ్ సైంటిస్టుకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వాట్సాప్ కాల్ వచ్చింది. తాము టెలి కమ్యూనికేషన్ డిపార్ట్ మెంట్ నుంచి మాట్లాడుతున్నామని ఢిల్లి ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక ముఠా దొరికింది. ఈ ముఠా కాంబోడియా, మయన్మార్, ఫిలిపిన్స్ దేశాలకు మనుషులను అక్రమంగా తరలిస్తున్నారని, వారితో సైబర్ నేరాలు చేయిస్తున్నారని బయటపడింది.

ఈ ముఠాతో మీకు సంబంధం ఉందని బయటపడింది. మీ ఆధార్ కార్డు, మీ ఫోన్ నెంబరు ముఠా సభ్యులను విచారించినప్పుడు వెలుగులోకి వచ్చిందన్నారు. దీంతో మీ మీద సీబీఐ పోలీసులు కేసు నమోదు చేశారని వివరించాడు. మీకు వీడియో కాల్ వస్తుంది మీతో సీబీఐ పోలీసులు మాట్లాడుతారని చెప్పాడు. ఆ తర్వాత వెంటనే వీడియో కాల్ వచ్చింది అందులో సీబీఐ అధికారి అంటూ ఓ వ్యక్తి కూర్చీ మీద కూర్చోని ఉండగా చుట్టు పోలీసు దుస్తుల్లో ఉన్న వ్యక్తులు నిలబడి ఉన్నారు.

అతను మాట్లాడుతూ మీ మీద బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారని చెప్పాడు. సుప్రీం కోర్టు, ఢిల్లీ పోలీసులు, సీబీఐ పోలీసులు లోగోలు ఉన్న పత్రాలను చూపించాడు. ఇప్పుడు మీ అరెస్టు కు సంబంధించి వారెంట్ జారీ అవుతుందని కలవరం రేపాడు. మీరు ఈ కేసు నుంచి బయటపడాలంటే సుప్రీం కోర్టు విచారణను ఎదుర్కోవాలని చెప్పాడు. దీని కోసం ఢిల్లీ సుప్రీం కోర్టు న్యాయమూర్తి ముందు స్టేట్ మెంట్ ఇవ్వాలని చెప్పాడు. ఈ విచారణ వీడియో కాల్ లో ఉంటుందన్నారు. ఈ విచారణ జరుగుతున్నప్పుడు మీరు తెల్లటి దుస్తుల్లో ఉండాలని చెప్పాడు.

అంతేకాకుండా సుప్రీం కోర్టు చీఫ్ జస్టీస్ కావడంతో అతను వచ్చినప్పుడు మీరు నిల్చొవాలని, అతను కూర్చునప్పుడే మీరు కూర్చోవాలని కూడా చెప్పాడు. ఈ ఆదేశాలను అన్నింటిని కూడా రిటైర్డ్ సైంటిస్టు దంపతులు పాటించారు. ఆ తర్వాత మీ బ్యాంక్ ఖాతాల్లోని నగదును సుప్రీం కోర్టు రిజిస్టార్ పేరుతో ఉన్న బ్యాంక్ ఖాతాకు పంపించాలని ఆదేశించాడు. లేదంటే అరెస్టు తప్పదని బెదిరించాడు. వీటన్నింటిని అసెస్ మెంట్ చేసి మీకు తిరిగి మొత్తం నగదు, పత్రాలను పంపిస్తామని చెప్పాడు. దీంతో రిటైర్డ్ సైంటిస్టు మొత్తం 1.34 కోట్ల రూపాయాలను వారికి బదిలీ చేశాడు. ఆ తర్వాత వారి నుంచి ఏలాంటి స్పందన లేకపోవడంతో రాచకొండ సైబర్ క్రైం పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశారు.

Next Story