బోల్తాపడిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. నలుగురు ప్రయాణికులు దుర్మరణం

by Kema Shiva Kumar |   (  Updated:2026-03-13 06:25:15  IST  )

రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నిజామాబాద్ జిల్లాలో ప్రైవేటు బస్సు అదుపుతప్పి బోల్తా పడింది.

బోల్తాపడిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. నలుగురు ప్రయాణికులు దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్/నిజామాబాద్ ప్రతినిధి: జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి మహారాష్ట్రలోని అకోలాకు 22 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, ఇందల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని గన్నారం సమీపంలో 44వ జాతీయ రహదారిపై అదుపుతప్పి బోల్తా పడింది. తెల్లవారుజామున సుమారు 2:30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి పల్టీలు కొట్టడంతో తీవ్రంగా ధ్వంసమైంది. ప్రమాద సమయంలో గాఢనిద్రలో ఉన్న ప్రయాణికులు ఏం జరుగుతుందో తెలియక ప్రాణభయంతో కేకలు వేశారు. ఈ దుర్ఘటనలో ముగ్గురు ప్రయాణికులు ఘటనా స్థలంలోనే మృతి చెందగా, మరొకరు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు విడిచారు. ప్రమాద సమయంలో బస్సులో మహిళలు, వృద్ధులు, చిన్నారులు ఉన్నట్లుగా సమాచారం. ప్రమాద వార్త తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బోల్తా పడిన బస్సులో ఇరుక్కుపోయిన ప్రయాణికులను పోలీసులు స్థానికుల సాయంతో బయటకు తీశారు. ఈ ప్రమాదంలో సుమారు పదిమందికి గాయాలు కాగా.. వారిని చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (GGH)కి తరలించారు.

మృతుల్లో ఇద్దరిని మంజుష, రిషిలుగా గుర్తించగా.. వీరు తల్లికొడుకులు అని తెలిసింది. మరొక మృతుడిని బెంగళూరుకు చెందిన అబ్బాస్‌గా గుర్తించగా, నాలుగో వ్యక్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుపుతున్నారు.

Next Story