నివాసాల మధ్య ప్లాస్టిక్ గోదాం… అర్థరాత్రి భీకర అగ్నిప్రమాదం

by Ajay Maddhiboyina |   (  Updated:2026-07-15 04:40:39  IST  )

హైదరాబాద్ నగరంలోని మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నందనవనం, శ్రీ రమణ కాలనీలో బుధవారం అర్థరాత్రి సంభవించిన భారీ అగ్నిప్రమాదం స్థానికులను భయాందోళనకు గురిచేసింది.

నివాసాల మధ్య ప్లాస్టిక్ గోదాం… అర్థరాత్రి భీకర అగ్నిప్రమాదం
X

దిశ, హస్తినాపురం: హైదరాబాద్ నగరంలోని మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నందనవనం, శ్రీ రమణ కాలనీలో బుధవారం అర్థరాత్రి సంభవించిన భారీ అగ్నిప్రమాదం స్థానికులను భయాందోళనకు గురిచేసింది. మెట్రో బార్ ఎదురుగా ఉన్న ప్లాస్టిక్, పాత సామాన్ల గోదాంలో ఒక్కసారిగా చెలరేగిన మంటలు క్షణాల్లోనే తీవ్రరూపం దాల్చి, పక్కనే ఉన్న నివాస గృహానికి వ్యాపించాయి. ఈ ప్రమాదంలో లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమిక సమాచారం. మంటలు వేగంగా వ్యాపించడంతో గోదాం పూర్తిగా దగ్ధమైంది. గోదాం పక్కనే నివసిస్తున్న శ్రీనివాస్ (40) ఇంటిని కూడా అగ్ని చుట్టుముట్టింది. ఇంట్లో ఉన్న ఫర్నిచర్, ఎల్ఈడీ టీవీ, గృహోపకరణాలు, రెండు ద్విచక్ర వాహనాలు పూర్తిగా కాలిపోయాయి. మూడంతస్తుల భవనం పాక్షికంగా దెబ్బతింది. 30 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమిక సమాచారం. ఓగ్గు కథలు చెప్పడం, అమ్మవారి పూజలు నిర్వహించడం ద్వారా జీవనం సాగిస్తున్న శ్రీనివాస్ కుటుంబం ఒక్కసారిగా నిరాశ్రయమైంది. ఈ భవనంలో మొత్తం ఏడు కుటుంబాలు నివసిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. అర్థరాత్రి మంటలు చెలరేగడంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటకు పరుగులు తీయాల్సి వచ్చిందని వారు వాపోయారు.

ఇంటి సామగ్రి అంతా అగ్నికి ఆహుతికావడంతో బాధిత కుటుంబాలు రోడ్డున పడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు ఏడు ఫైర్ ఇంజిన్లతో సంఘటనా స్థలానికి చేరుకుని గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్లాస్టిక్, పాత సామాన్లు పెద్దఎత్తున నిల్వ ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించాయి. దట్టమైన పొగలు ఎగసిపడటంతో పరిసర ప్రాంతమంతా భయానక వాతావరణం నెలకొంది. అగ్నిమాపక సిబ్బంది వేగంగా స్పందించడంతో మంటలు సమీపంలోని ఇతర ఇళ్లకు వ్యాపించకుండా అడ్డుకోగలిగారు. లేదంటే మరింత పెద్ద విషాదం సంభవించే ప్రమాదం ఉండేదని అధికారులు తెలిపారు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం ఊరటనిచ్చింది. అగ్నిప్రమాదానికి గల కారణాలపై మీర్పేట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణమా? లేక ఇతర కారణాలున్నాయా? అనే కోణాల్లో అగ్నిమాపక శాఖ అధికారులు కూడా విచారణ చేస్తున్నారు. ఈ ఘటనతో నివాస ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ప్లాస్టిక్, పాత సామాన్ల గోదాంల భద్రతపై మరోసారి ప్రశ్నలు తలెత్తాయి. ఇలాంటి గోదాంలకు అగ్నిమాపక శాఖ అనుమతులు ఉన్నాయా? భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారా? అనే అంశాలపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. శ్రీ రమణ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ, ఇదే బస్తీలో ఇంకా పదుల సంఖ్యలో పాత సామాన్ల గోదాంలు కొనసాగుతున్నాయని, వాటిని వెంటనే తొలగించాలని ప్రభుత్వాన్ని కోరారు. బాధిత కుటుంబాలకు తక్షణ ఆర్థిక సాయం అందించి, పునరావాసం కల్పించాలని ప్రజాసంఘాలు విజ్ఞప్తి చేశాయి. ఈ ఘటన నగర శివారు ప్రాంతాల్లో నివాసాల మధ్య అనుమతులు, భద్రతా ప్రమాణాలను పట్టించుకోకుండా నడుస్తున్న గోదాంలపై అధికార యంత్రాంగం దృష్టి సారించాల్సిన అవసరాన్ని మరోసారి స్పష్టం చేసింది.

Next Story