నగరంలో భారీ అగ్నిప్రమాదం.. వైన్‌షాప్‌లో ఎగిసిపడిన మంటలు

by Kema Shiva Kumar |   (  Updated:2026-03-07 02:55:20  IST  )

నగరంలో వరుస అగ్ని ప్రమాదాలు గుబులు పుట్టిస్తున్నాయి. తాజాగా, ఓ వైన్ షాపులో ఉన్నట్టుండి భారీగా మంటలు ఎగిసిపడ్డాయి.

నగరంలో భారీ అగ్నిప్రమాదం.. వైన్‌షాప్‌లో ఎగిసిపడిన మంటలు
X

దిశ, వెబ్‌డెస్క్: వైన్ షాపులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురైన ఘటన నగరంలో ఇవాళ తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు రాజ్‌భవన్‌ (Raj Bhavan) రోడ్డులో మూసి ఉన్న ఓ వైన్‌షాప్‌లో తెల్లవారుజామున లోపలి నుండి పొగలు రావడాన్ని స్థానికులు గమనించారు. వెంటనే వారు పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. మద్యం సీసాలు, ఫర్నిచర్ ఉండటంతో మంటలు క్షణాల్లో షాపు అంతటా వ్యాపించాయి. సమాచారం అందుకున్న వెంటనే రెండు ఫైరింజన్లు స్పాట్‌కు చేరుకున్నాయి. సుమారు గంటన్నర పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

అయితే, ప్రాథమిక విచారణలో భాగంగా షార్ట్‌సర్క్యూట్ (Short Circuit) వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అగ్నిమాపక అధికారులు భావిస్తున్నారు. వైన్‌షాప్‌లోని ఫ్రిజ్‌లు లేదా వైరింగ్‌లో ఏర్పడిన సాంకేతిక లోపం వల్ల మంటలు చెలరేగి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ ప్రమాదంలో భారీగా మద్యం నిల్వలు, షాపులోని సామగ్రి దగ్ధమయ్యాయి. రద్దీగా ఉండే రాజ్‌భవన్‌ రోడ్డులో తెల్లవారుజామునే మంటలను అదుపు చేయడంతో పెద్ద ప్రమాదం తప్పిందంటూ స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

Next Story