కాంకేర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్.. ఏరియా కమాండర్ ‘రూపి’ అలియాస్ భాగ్య మృతి

by Kema Shiva Kumar |   (  Updated:2026-04-13 13:53:55  IST  )

ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లాలో భద్రతా దళాలు జరిపిన ఎన్‌కౌంటర్‌లో నక్సల్ ఏరియా కమాండర్ ‘రూపి’ అలియాస్ రంగబోయిన భాగ్య మృతిచెందారు.

కాంకేర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్.. ఏరియా కమాండర్ ‘రూపి’ అలియాస్ భాగ్య మృతి
X

దిశ, వెబ్‌డెస్క్:ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని నక్సల్ ప్రభావిత ప్రాంతమైన కాంకేర్ జిల్లాలో భద్రతా దళాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో మోస్ట్ వాంటెడ్ నక్సల్ ఏరియా కమాండర్ రూపి అలియాస్ రంగబోయిన భాగ్య మృతి చెందారు. ప్రభుత్వం ఆమెపై గతంలో రూ. 25 లక్షల రివార్డు ప్రకటించింది. చోటే బెటియా పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న పక్కా సమాచారంతో భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ క్రమంలో మావోయిస్టులు తారసపడటంతో ఇరువర్గాల మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో పార్థాపూర్ ఏరియా కమాండర్ రూపి అక్కడికక్కడే మరణించారు. ఆమెతో ఉన్న మరో 10 మంది మావోయిస్టులు తృటిలో తప్పించుకున్నారు.

ఆయుధాలు, విప్లవ సాహిత్యం స్వాధీనం..

కాల్పుల అనంతరం ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు, రూపి మృతదేహంతో పాటు ఆమె వద్ద ఉన్న ఒక ఆటోమెటిక్ తుపాకీని స్వాధీనం చేసుకున్నట్లు కాన్కేర్ ఎస్పీ నిఖిల్ రాఖేచా వెల్లడించారు. ఈ ఎన్‌కౌంటర్ తర్వాత ఆ ప్రాంతంలో గాలింపు చర్యలను (Combing) మరింత ముమ్మరం చేశారు. మాచ్‌పల్లి అడవుల్లో మరో 10 మంది వరకు మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం అందడంతో, వారిని పట్టుకునేందుకు అదనపు బలగాలు రంగంలోకి దిగాయి.

ఇప్పటికైనా లొంగిపోండి: ఐజీ సుందర్‌రాజ్ పిలుపు

తాజా ఎన్‌కౌంటర్‌పై బస్తర్ రేంజ్ ఐజీ సుందర్‌రాజ్ పట్టిలింగం మాట్లాడుతూ.. మావోయిస్టులు హింసను వీడి జనజీవన స్రవంతిలోకి రావాలని ప్రభుత్వం నిరంతరం విజ్ఞప్తి చేస్తూనే ఉందన్నారు. దీంతో గత కొద్ది కాలంగా చాలా మంది మావోయిస్టులు లొంగిపోయి పునరావాసం పొందుతున్నారని తెలిపారు. కానీ రూపి వంటి వారు ఆ అవకాశాన్ని కాలదన్ని హింసా మార్గాన్ని ఎంచుకుని ప్రాణాలు కోల్పోతున్నారని పేర్కొన్నారు. ఇంకా అడవుల్లో ఉన్న మావోయిస్టులకు సమయం చాలా తక్కువగా ఉందని, ఇప్పటికైనా ఆయుధాలు వీడి గౌరవప్రదమైన జీవితాన్ని గడపాలని ఆయన హెచ్చరించారు. ప్రస్తుతం ఆ అటవీ ప్రాంతంలో భద్రతా దళాల గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.

రూపి తెలంగాణ వాసి..

రూపి అలియాస్ రంగబోయిన భాగ్య స్వస్థలం తెలంగాణలోని సిద్ధిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామం. సుమారు 46 ఏళ్ల వయసున్న ఆమె 2004లో మావోయిస్టు పార్టీలో చేరారు. తొలుత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో, ఆ తర్వాత అబూజ్‌మడ్ ప్రాంతంలో పనిచేశారు. ఇటీవల డీజీపీ సమక్షంలో జరిగిన తాజా లొంగుబాట్ల సందర్భంగా.. తెలంగాణకు చెందిన ఇప్పటికీ ఇతర రాష్ట్రాల్లో క్రియాశీలంగా ఉన్న మావోయిస్టుల జాబితాను విడుదల చేయగా, అందులోని ఐదుగురిలో రూపి పేరు కూడా ఉంది.

రూపి ఒంటరి పోరాటం..

నక్సల్ నేత రూపిని జనజీవన స్రవంతిలోకి రావాలని, హింసను వీడి లొంగిపోవాలని కాంకేర్ ఎస్పీ నిఖిల్ రాఖేచా పలుమార్లు విజ్ఞప్తి చేశారు. అయితే, ఆ విజ్ఞప్తిని బేఖాతరు చేస్తూ ఆమె తన కార్యకలాపాలను ఒంటరిగానే కొనసాగించారని అక్కడి పోలీసులు చెబుతున్నారు. ఎంతో కాలంగా మాచ్‌పల్లి అటవీ ప్రాంతంలో భయాందోళనలు కలిగిస్తున్న కీలక కమాండర్ హతం కావడంతో, మావోయిస్టుల నెట్‌వర్క్‌కు గట్టి దెబ్బ తగిలిందని అధికారులు పేర్కొంటున్నారు.

లొంగిపో బిడ్డా.. తల్లి ఎల్లవ్వ

కాగా, ఇటీవలే రూపి తల్లి ఎల్లవ్వ మీడియా వేదికగా తన బిడ్డకు లొంగిపోవాలని సందేశం పంపింది. ‘పానం శాతగాకుంటైంది. బాధతో ఎముకల గూడైనయ్. ఎప్పుడు సావొస్తదో తెల్వది. 24 యేండ్ల సంది నీకోసం కండ్లు కాయలు కాసేలా చూస్తున్నా. 9 సంవత్సరాల కిందట మీ నాయిన నర్సయ్య చనిపోయినా నువ్వు రాలే. ఇప్పుడు నేను సచ్చిపోతే నువ్వు వస్తవో రావో తెల్వదు. నేను బతికుండగా నువ్వు ఎన్‌కౌంటరై సచ్చిపోయి వస్తవో, లొంగిపోయి పానాలతో తిరిగి వస్తవో తెల్వలేదు బిడ్డా. నువ్వు యాడున్నా పోలీసులకు లొంగిపోయి రా బిడ్డా. కడ సూపుకన్నా నోచుకుంటా’ అంటూ కన్నీరు పెట్టింది.

ఇంకా మిగిలింది నలుగురే..

రూపి మరణంతో తెలంగాణకు చెంది ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తున్న మావోయిస్టుల సంఖ్య నాలుగుకు తగ్గింది. వీరెవరూ తెలంగాణలో యాక్టివ్ గా లేదు. నలుగురిలో ఇద్దరు గణపతి అలియాస్ ముప్పాళ్ల లక్ష్మణ్ రావు, ఆయన భార్య జోడె రత్నాబాయి ఉన్నారు. పసునూరి నరహరి అలియాస్ సంతోష్ జార్ఖండ్‌లో ఉన్నత స్థానంలో పనిచేస్తుండగా, వార్త శేఖర్ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యునిగా ఉంటూ కమ్యూనికేషన్స్ వింగ్ బాధ్యతలు చూస్తున్నారు. అయితే, ఆయన డీకేలో లేడని, బహుశా బయట పట్టణాల్లో ఎక్కడో ఉండివుంటాడని లొంగిపోయిన నక్సలైట్లు పోలీసులకు చెప్పినట్లు సమాచారం.

Next Story