భార్య, అత్తామామలను చంపాడు.. అనంతరం 9 నెలల పసికందును ఏం చేశాడంటే?

by Dishafeatures2 |
భార్య, అత్తామామలను చంపాడు.. అనంతరం 9 నెలల పసికందును ఏం చేశాడంటే?
X

దిశ, వెబ్ డెస్క్: లాక్ డౌన్ లో మొదలైన వాళ్ల ప్రేమ కొన్నేళ్ల తర్వాత పెళ్లికి దారి తీసింది. అనంతరం ఆ జంట పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఇప్పటివరకు బాగానే ఉన్నా.. ఆ తర్వాతే వారి మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. గొడవలు తారాస్థాయికి చేరుకోవడంతో కోపంతో రగిలిపోయిన భర్త.. భార్య, అత్తామామలను అతి కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం కొడుకును తీసుకొని పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. వివరాల్లోకి వెళ్తే..

అస్సాంలోని గోలాఘాట్ జిల్లాకి చెందిన నజీబుర్ రెహమాన్ బోరా (25), సంఘమిత్ర ఘోష్ (24) మధ్య కోవిడ్ లాక్ డౌన్ లో ప్రేమకథ మొదలైంది. అయితే సంఘమిత్ర పేరెంట్స్ వారి పెళ్లికి ఒప్పుకోకపోవడంతో వారిద్దరూ కోల్ కతాకు పారిపోయి పెళ్లి చేసుకున్నారు. ఇక పోలీసుల సాయంతో సంఘమిత్ర పేరెంట్స్ సంజీవ్ ఘోష్, జునూ ఘోష్ కూతురును తిరిగి ఇంటికి తీసుకొచ్చారు. అయితే అప్పటికే ఆమెకు వివాహం కావడంతో విడాకులు ఇవ్వాలని బలవంతం చేశారు. కానీ ఆమె వినకపోవడంతో ఆమెపై దొంగతనం కేసు పెట్టారు. ఈ కేసు విషయంలోనే ఆమె నెల రోజుల పాటు జైలులో ఉండి వచ్చింది. అనంతరం ఆమెను పేరెంట్స్ తిరిగి బెయిల్ ఇప్పించి ఇంటికి తీసుకెళ్లారు. అయితే 2022 జనవరిలో రెండోసారి నజీబుర్ రెహమాన్ తో ఇంటిలోనుంచి వెళ్లిపోయింది.

ఈ క్రమంలోనే భార్యాభర్తలిద్దరూ చెన్నై వెళ్లిపోయి అక్కడ 5 నెలల పాటు ఉన్నారు. ఈ క్రమంలోనే సంఘమిత్ర గర్భవతి అని తేలింది. దీంతో నజీబుర్ రెహమాన్ భార్యను తీసుకొని స్వస్థలమైన గోలాఘాట్ కు వచ్చి అక్కడే ఉండసాగారు. ఈ క్రమంలోనే గత నవంబర్ లో వాళ్లకు పండండి మగబిడ్డ జన్మించాడు. అయితే భర్త తనను వేధిస్తున్నాడంటూ గత మార్చిలో సంఘమిత్ర తన కొడుకును తీసుకొని తల్లిదండ్రుల ఇంటికి వెళ్లింది. ఈ క్రమంలోనే భర్తపై అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టగా.. భర్త ఈ కేసులో జైలులో ఉండి నెల రోజుల తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చాడు.

ఈ క్రమంలోనే తన కుమారుడిని చూపించాలంటూ భార్య, అత్తామామలను అడిగాడు. అయితే అందుకు వాళ్లు ఒప్పుకోకపోవడంతో సోమవారం అత్తారింటికి వెళ్లిన నజీబుర్ రెహమాన్ బోరా.. భార్య, అత్తామామలను దారుణంగా హత్య చేశాడు. అనంతరం తొమ్మిది నెలల కొడుకును తీసుకొని పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. కాగా ఈ కేసు విషయంలోనే బాధిత కుటుంబాన్ని అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ పరామర్శించారు.


Next Story