Vyjayanthi Movies: ఆన్‌లైన్ బెట్టింగ్‌ వార్తలపై ‘కల్కి’ నిర్మాణ సంస్థ వివరణ.. నెట్టింట వైరల్‌గా మారిన ట్వీట్

by Mallepaka Hamsa |

ఇటీవల నిలేశ్ చోప్రా(Nilesh Chopra) అనే వ్యక్తి ఆన్‌లైన్ బెట్టింగ్‌కు పాల్పడుతూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు.

Vyjayanthi Movies: ఆన్‌లైన్ బెట్టింగ్‌ వార్తలపై ‘కల్కి’ నిర్మాణ సంస్థ వివరణ.. నెట్టింట వైరల్‌గా మారిన ట్వీట్
X

దిశ, సినిమా: ఇటీవల నిలేశ్ చోప్రా(Nilesh Chopra) అనే వ్యక్తి ఆన్‌లైన్ బెట్టింగ్‌కు పాల్పడుతూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. దీంతో అతనిపై కేసు నమోదు చేసి ఎస్. ఆర్. నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే అతను వైజయంతీ మూవీస్(Vyjayanthi Movies) నిర్మాణ సంస్థలో పని చేసిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్‌గా మారాయి. దీంతో అంత పెద్ద నిర్మాణ సంస్థకు చెందిన వ్యక్తి ఇలాంటి పనులు చేయడమేంటని నెటిజన్లు పలు విమర్శలు చేస్తున్నారు.

ఈ క్రమంలో.. తాజాగా, మూవీ మేకర్స్ ట్విట్టర్ ద్వారా స్పందించి క్లారిటీ ఇచ్చారు. ‘‘ఆన్‌లైన్ బెట్టింగ్ ఆడుతున్నందుకు నీలేష్ చోప్రా అనే వ్యక్తిని ఎస్‌ఆర్ నగర్ పోలీసులు అరెస్టు చేసినట్లు మా దృష్టికి వచ్చింది. ఆ వ్యక్తి వైజయంతి మూవీస్ ఆఫీస్‌లో మాతో ఎప్పుడూ పని చేయలేదు. అతనితో ఏ ఇతర రూపంలో ఉన్న అనుబంధం గురించి మాకు తెలియదు. మేము పైన పేర్కొన్న వాస్తవాలను హైదరాబాద్‌లోని ఎస్‌ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌లోని సంబంధిత అధికారులకు అధికారికంగా తెలియజేశాము. దయచేసి ఏదైనా సమాచారాన్ని ప్రచురించే ముందు వాస్తవాలను ధృవీకరించవలసిందిగా మీడియాను మేము హృదయపూర్వకంగా అభ్యర్థిస్తున్నాము’’ అని రాసుకొచ్చారు.

ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై ఇటీవల వచ్చిన ‘కల్కి’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన విషయం తెలిసిందే. ప్రభాస్(Prabhas), నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన ఈ మూవీలో దీపికా పదుకొణె(Deepika Padukone), అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan), కమల్ హాసన్, దుల్కర్ సల్మాన్ వంటి స్టార్స్ కీలక పాత్రల్లో నటించారు. అయితే ఈ మూవీతో పాటు వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై ఎన్నో చిత్రాలు భారీ బడ్జెట్‌తో వచ్చి ఘన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ బ్యానర్‌పై ‘కల్కి-2’ కూడా రాబోతుంది. ఇక దీనిపై ప్రభాస్ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Next Story