జేసీబీ వెంచర్ మాయ.. స్కానర్ స్కామ్ లో ఇద్దరు అరెస్ట్..!

by Bhanu |   (  Updated:2025-06-26 15:56:55  IST  )

జేసీబీ అవసరముందంటూ ఆన్‌లైన్‌లో డబ్బులు వసూలు చేసి మోసానికి పాల్పడిన ఇద్దరు నిందితులను తంగళ్లపల్లి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. గురువారం ఈ విషయాన్ని సిరిసిల్ల రూరల్ సీఐ మొగిలి వివరించారు.

జేసీబీ వెంచర్ మాయ.. స్కానర్ స్కామ్ లో ఇద్దరు అరెస్ట్..!
X

దిశ, తంగళ్లపల్లి : జేసీబీ అవసరముందంటూ ఆన్‌లైన్‌లో డబ్బులు వసూలు చేసి మోసానికి పాల్పడిన ఇద్దరు నిందితులను తంగళ్లపల్లి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. గురువారం ఈ విషయాన్ని సిరిసిల్ల రూరల్ సీఐ మొగిలి వివరించారు. వివరాల్లోకి వెళ్తే, రంగారెడ్డి జిల్లా బాలాపూర్‌కు చెందిన గోల్కొండ చందు కుమార్, చింతపట్టి పవన్ కుమార్ అనే వ్యక్తులు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలు గ్రామాలకు చెందిన జేసీబీ ఓనర్లను టార్గెట్ చేశారు.


వేములవాడ మండలంలోని అగ్రహారంలో కొత్త వెంచర్ వేస్తున్నామని చెట్లు చదును చేయించేందుకు జేసీబీ కావాలంటూ ఫోన్ చేసి నమ్మించారని పోలీసులు తెలిపారు. ముందస్తు ఎంట్రీ ఫీజుగా రూ.9,000 పంపాలని కోరగా, బాధితులు ఆన్‌లైన్ స్కానర్ ద్వారా డబ్బులు పంపించారు. అయితే అనంతరం ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు తంగళ్లపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు నిందితుల ఆచూకీ గుర్తించి వారిని అరెస్ట్ చేశారు.


అదే విధంగా ముస్తాబాద్ మండలం ఆవునూరు గ్రామంలో ఇద్దరినీ, ఎల్లారెడ్డిపేట మండలంలోని అగ్రహారం గ్రామానికి చెందిన ఒక వ్యక్తిని ఇదే రీతిలో మోసం చేసి వారి వద్ద నుండి డబ్బులు తీసుకున్నారని గుర్తించారు. నిందితుల వద్ద నుండి రూ.30 వేల నగదు, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. గురువారం నిందితులను సిరిసిల్ల కోర్టుకు హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సై రామ్మోహన్, వినీత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Next Story