అంతర్జాతీయ ఫేక్ కాల్ సెంటర్ గుట్టు రట్టు.. అమెజాన్ ప్రైమ్ పేరిట ఆస్ట్రేలియన్ సిటిజన్స్ కు టోకర..

by Disha Web Desk 11 |
అంతర్జాతీయ ఫేక్ కాల్ సెంటర్ గుట్టు రట్టు.. అమెజాన్ ప్రైమ్ పేరిట ఆస్ట్రేలియన్ సిటిజన్స్ కు టోకర..
X

దిశ, పేట్ బషీరాబాద్: అమెజాన్ ప్రైమ్ పేరిట ఆస్ట్రేలియన్ సిటిజెన్స్ కు ఫోన్ చేసి చీటింగ్ చేసే ఫేక్ కాల్ సెంటర్ ముఠా సభ్యులను పేట్ బషీరాబాద్ పోలీసులు, ఎస్ఓటీ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. ఈ మేరకు జరిగిన మీడియా సమావేశంలో పేట్ బషీరాబాద్ డీసీపీ సందీప్ బుధవారం ఆయన కార్యాలయంలో వివరాలను వెల్లడించారు. జీడిమెట్ల డివిజన్ హై టెన్షన్ లైన్ రోడ్ లో ఓ భవనంలో కొందరు ఫేక్ కాల్ సెంటర్ నిర్వహిస్తున్నారు. విశ్వసనీయమైన సమాచారంతో మేడ్చల్ జోన్ స్పెషల్ ఆపరేషన్ టీం పోలీసులు ఒక్కసారిగా కాల్ సెంటర్ పై దాడి చేశారు. పోలీసుల దాడి చేస్తున్న సమయంలో సదరు కాల్ సెంటర్ లో ఉన్న 13 మంది కాల్ సెంటర్ సిబ్బంది పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నం చేశారు. అప్రమత్తమైన పోలీసులు వారందరినీ అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా అసలు కాల్ సెంటర్ నిర్వహణకు అనుమతులు లేవనే విషయంతో పాటుగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.


టార్గెట్ ఆస్ట్రేలియన్ సిటిజన్స్..

ఫేక్ కాల్ సెంటర్ నుంచి నిర్వాహకులు గో ఆటో డయల్ అప్లికేషన్ ద్వారా ముందుగానే సేకరించిన ఆస్ట్రేలియన్ సిటిజన్స్ డేటాకు వారిని అమెజాన్ ప్రైమ్ సబ్ క్రిప్షన్, ఇంటర్నెట్ స్పీడ్ సమస్యలు పరిష్కరిస్తామంటూ అక్కడివారికి ఫోన్ చేస్తుంటారు. మీ సమస్య తీరాలంటే నేను చెప్పినట్లు మీరు రీచార్జ్ చేస్తే మీకు తక్కువ రేట్ లో అమెజాన్ ప్రైమ్ పొందటమే కాకుండా, ఇంటర్నెట్ స్పీడ్ కూడా మరింత వేగంగా ఉండవచ్చని నమ్మించి వారిచే రీచార్జీ చేయిస్తూ వారి వద్ద నుంచి డబ్బులు కొట్టేసేందుకు ప్రయత్నం చేస్తుంటారు.అయితే ఆస్ట్రేలియాలో ఉన్న ఫేక్ ముఠాకు చెందిన మూడు అకౌంట్లను అక్కడి ప్రభుత్వం బ్లాక్ చేయడంతో వీరి పన్నాగం పారలేదు. గత నెల 16వ తేదీన యూకేలో పలు కాల్ సెంటర్లలో పనిచేసిన అనుభవం ఉన్న వరంగల్ కు చెందిన ప్రమోద్ రెడ్డి అనే వ్యక్తి ఈ ఫేక్ కాల్ సెంటర్ వెనుక ఉన్న ప్రధాన నిందితుడని డీసీపీ తెలిపారు.

వెస్ట్ బెంగాల్ కు చెందిన ఆకాష్, వెస్లీ అను నిందితుల వద్ద నుంచి దాదాపుగా 40 వేల మంది ఆస్ట్రేలియన్ సిటిజెన్స్ కు చెందిన డేటాను ఈ ఫేక్ కాల్ సెంటర్ సేకరించింది. రబేష్ కుమార్ ప్రసాద్, సర్బేష్ష్ కుమార్ గుప్తా, బైరిక్ ప్రమోద్ రెడ్డి, కుంచెల అజయ్ కుమార్, టెలి కలర్స్ ముఖేష్ రజాక్, కర్మ చేపల్, మహమ్మద్ ముస్తఫా, అన్మోల్, రాయి రిషికాంత్, గుంజి పవన్ కళ్యాణ్, మహమ్మద్ సమీర్, సాయి వరప్రసాద్, నాయకోటి బసవరాజు మొత్తం 13 మందిని అరెస్ట్ చేయగా సిటిజన్స్ డేటాను అమ్మిన ఆకాష్, వెస్లీ లతోపాటుగా మరో వ్యక్తి రామకృష్ణారెడ్డి పరారీలో ఉన్నట్లు ఆయన తెలిపారు.

నిందితుల వద్ద నుంచి 13డెస్క్ టాప్ మానిటర్లు, 14 సీపీయూలు, 13 హెడ్ ఫోన్ సెట్స్, ఒక హార్డ్ డిస్క్, ఒక పెన్ డ్రైవ్, ఒక మెమొరీ కార్డు, 8 కొత్త సిం కార్డ్స్, 18 మొబైల్ ఫోన్స్, రెండు డీజిల్ రెస్ట్ వాచ్, ఒక హిల్ ఫిగర్ రిస్ట్ వాచ్, ఒక ఫార్చునర్ కారుతో పాటుగా రూ. 5వేల 940 నిందితుల వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓటీ డీసీపీ రషీద్, అడిషనల్ డీసీపీ శోభన్, పెట్ బషీరాబాద్ ఏసీపీ రామలింగరాజు, ఇన్ స్పెక్టర్లు ప్రశాంత్, లక్ష్మీనారాయణ, జేమ్స్ తదితరులు ఉన్నారు.


Next Story

Most Viewed