రాష్ట్రంలో అమానవీయ ఘటన: కన్నతల్లిని సజీవ దహనం చేసిన కొడుకు

by Kema Shiva Kumar |   (  Updated:2026-02-28 06:40:47  IST  )

మద్యానికి బానిసైన కొడుకు కన్నతల్లిని సజీవ దహనం ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.

రాష్ట్రంలో అమానవీయ ఘటన: కన్నతల్లిని సజీవ దహనం చేసిన కొడుకు
X

దిశ, వెబ్‌డెస్క్: జన్మనిచ్చిన కన్నతల్లిని పువ్వుల్లో పెట్టుకుని చూసుకోవాల్సింది పోయి మద్యం మత్తులో ఓ కిరాతకుడు కొడుకు విచక్షణ కోల్పోయాడు. ఇన్నాళ్లు కంటికి రెప్పలా సాకిందనే జాలి, దయ, కరుణ మాతృమూర్తినే అత్యంత అమానుషంగా సజీవ దహనం చేసిన ఘటన నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో ఇవాళ చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కోటగిరికి చెందిన భూమవ్వ అనే వృద్ధురాలి కుమారుడు గత కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. ప్రతిరోజూ మద్యం తాగి వచ్చి ఇంట్లో గొడవ పడేవాడు. శనివారం కూడా మద్యం మత్తులో ఉన్న అతడు తాగేందుకు డబ్బులివ్వాలని తల్లితో తీవ్రంగా వాగ్వాదానికి దిగాడు. కోపంతో ఊగిపోయిన ఆ కసాయి కొడుకు, తన తల్లిని చంపాలని నిర్ణయించుకున్నాడు.

పాత బట్టలు వేసి నిప్పంటించి..

అమాయకపు తల్లి అని కూడా చూడకుండా, ఇంట్లో ఉన్న పాత బట్టలను ఆమెపై వేసి నిప్పంటించాడు. మంటలు అంటుకుని భూమవ్వ కేకలు వేస్తున్నా కనికరించకుండా అలాగే చూస్తూ ఉండిపోయాడు. తీవ్రమైన మంటల ధాటికి ఆ వృద్ధురాలు అక్కడికక్కడే సజీవ దహనమై ప్రాణాలు విడిచింది. సమాచారం అందుకున్న కోటగిరి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కన్నతల్లిని నిప్పుపెట్టి చంపిన ఆ కసాయి కొడుకును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మద్యం మత్తులో ఈ దారుణానికి ఒడిగట్టాడా..? లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

Next Story