స్నేహం ముసుగులో మర్డర్ కు ప్లాన్.. దావత్ అని పిలిచి యువకుడి హత్య

by Bhanu |

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని లింగన్నపేట గ్రామంలో శుక్రవారం చోటు చేసుకున్న దారుణ హత్య కేసును పోలీసులు ఛేదించారు.

స్నేహం ముసుగులో మర్డర్ కు ప్లాన్.. దావత్ అని పిలిచి యువకుడి హత్య
X

దిశ, గంభీరావుపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని లింగన్నపేట గ్రామంలో శుక్రవారం చోటు చేసుకున్న దారుణ హత్య కేసును పోలీసులు ఛేదించారు. గ్రామానికి చెందిన మెండే సతీష్ (30) ని హత్య చేసిన ఇద్దరు నిందితులను అరెస్టు చేసి సోమవారం రిమాండ్‌కు తరలించారు. సీఐ శ్రీనివాస్ గౌడ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. మృతుడు సతీష్, నర్మల పవన్ కుమార్, భీమయ్యగారి రాజశేఖర్ ముగ్గురూ సుతారి పనులు చేసేవారు.


సతీష్ తన అవసరాల కోసం రాజశేఖర్ వద్ద అప్పు తీసుకోవడం, అలాగే ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ విషయంలో ముగ్గురి మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. శుక్రవారం సాయంత్రం ‘దావత్’ పేరుతో సతీష్‌ను పిలిచిన పవన్ కుమార్, అతని ఫ్యామిలీపై అసభ్యంగా మాట్లాడాడని రాజశేఖర్‌కు ఫోన్ చేసి చెప్పాడు. దీంతో ఇద్దరూ ముందే ప్లాన్ చేసినట్టు సతీష్‌ను హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. అనంతరం పవన్ కుమార్ బీరు సీసాతో సతీష్ తల, మెడపై విచక్షణా రహితంగా బలమైన దెబ్బలు కొట్టడంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.


పోలీసులు ఘటనా స్థలంలో దర్యాప్తు చేపట్టి, బీరు సీసా ముక్కలు, బైక్, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించినట్లు సీఐ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. కేసు ఛేదనలో కీలకంగా వ్యవహరించిన గంభీరావుపేట ఎస్సై ప్రేమనందం, ఎల్లారెడ్డిపేట ఎస్సై రమాకాంత్, మరియు పోలీస్ సిబ్బందిని సీఐ అభినందించారు.

Next Story