- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేజీ బంగారం రూ.20 లక్షలే.. ఈ ఆఫర్ కౌజు పిట్టలు కొన్నవారికే..

దిశ, వెబ్‌డెస్క్ : చేసేది కౌజు పిట్టల వ్యాపారం. ఊరూరు తిరుగుతూ కౌజు పిట్టలను విక్రయిస్తూ సంచార జీవితం గడుపుతారు. ఇది అందనికి కనిపించే వారి సాధారణ జీవన విధానం. కానీ అసలు వాళ్లు చేసే స్కాం గురించి తెలిస్తే కళ్లు బైర్లు కమ్మడం ఖాయం. అంతేకాదు అమ్మో.. వీళ్లు ఇంత మోసగాళ్లా అనక మానరు. నమ్మించి లక్షల రూపాయలు కొల్లగొట్టడంలో వీళ్లని మించిన కేటుగాళ్లు లేరంటే అతిశయోక్తే. కౌజు పిట్టలను కొనుగోలు చేసే వాళ్లను లంకె బిందెలు దొరికాయని నమ్మించడం.. ఆపై రూ.లక్షలు జేబులో వేసుకోవడం వృత్తిగా పెట్టుకున్నారు ఈ నయా మోసగాళ్లు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో వీరి చేతుల్లో మోసపోయిన వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా వెలుగు చూసిన ఘటనతో వీరి మోసం బయటపడింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం..
కౌజు పిట్టలే పెట్టుబడి..
కూకట్ పల్లికి చెందిన బిల్డింగ్ వర్క్ చేసే ఓ కాంట్రాక్టర్‌కు సంచార జీవనం సాగించే కౌజు పిట్టలు విక్రయించే వాళ్లు పరిచయం అయ్యారు. తరచూ పిట్టలను ఇస్తూ పరిచయం పెంచుకున్నారు. ఇదే సమయంలో ఆ కాంట్రాక్టర్ ఇంటి పక్కన ఉండే ప్రైవేట్ జాబ్ చేసుకుంటున్న ఓ యువకుడితోనూ మాటమాట కలిపారు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయిన కౌజు పిట్టల వ్యాపారులు ఇటీవల సదరు కాంట్రాక్టర్‌కు ఫోన్ చేసి తమకు లంకె బిందెలు దొరికాయని తెలిపారు. తమ బంధువుకు ప్రొక్లెయినర్ ఉందని, అతడు మట్టి తోడుతుండగా లంకెబిందెలు దొరికాయని చెప్పారు. ఆ బిందెల నిండా బంగారం ఉందని, వాటిని ప్రభుత్వానికి అప్పగించకుండా సీక్రెట్‌గా అమ్మాలనుకుంటున్నామని, కేజీ రూ.20 లక్షలకు ఇస్తామంటూ చెప్పారు. బంగారాన్ని పూర్తిగా పరీక్షించుకున్నాకనే తీసుకోవాలని ఉచిత సలహా ఇచ్చారు. ఈ డీల్‌కు కాంట్రాక్టర్ ఇంటి పక్కన్నే ఉండే ప్రైవేట్ ఉద్యోగం చేసుకునే యువకుడు ఓకే అన్నాడు. బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యాడు.
ఇంట్లో బంగారం కుదవ పెట్టి.. అప్పులు చేసి..
మాది అనంతపురం జిల్లా హిందూపురం అని, బంగారం తీసుకోవాలంటే అక్కడికి రావాలని కౌజు పిట్టల వ్యాపారులు కోరారు. సదరు యువకుడు అక్కడికి వెళ్లగా అతడికి 85 మిల్లీగ్రాముల బంగారాన్ని ఇచ్చారు. అది అసలిదో, నకిలీదో పరీక్షించుకోవాలని సూచించారు. దానిని గోల్డ్ స్మిత్ చెక్ చేసి నిజమైన బంగారం అని తేల్చిచెప్పాడు. ఇంకేముంది.. ఆ యువకుడు హిందూపురం నుంచి కూకట్ పల్లికి వచ్చి తన ఇంట్లో ఉన్న 60 గ్రాముల బంగారాన్ని కుదవపెట్టి రూ.3.50 లక్షలు అప్పు తీసుకున్నాడు. వాటితోపాటు మరో రూ.50 వేలు తెలిసిన వాళ్ల దగ్గర అప్పు చేసి మొత్తం రూ.4 లక్షలు తీసుకెళ్లి ఆ మోసగాళ్ల చేతిలో పెట్టి బంగారాన్ని తెచ్చుకున్నాడు. ఇంటికి వచ్చి పరీక్షించిన అతడికి షాక్ తగిలింది. ఆ మొత్తం బంగారం నకిలీదని తేలింది. కౌజు పిట్టల వ్యాపారులకు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ రావడంతో తాను మోసపోయానని గ్రహించాడు. వెంటనే వెళ్లి కూకట్ పల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే.. క్రైం ఇక్కడ జరగలేదు.. మేము ఫిర్యాదు తీసుకోలేం అంటూ పోలీసులు తప్పించుకున్నారని బాధితుడు వాపోయాడు.
సూర్యాపేట జిల్లాలో మరో ఇద్దరు..
పులిచింతల ప్రాజెక్ట్ పరిసరాల్లో పిట్టలను వేటాడుతూ వాటిని సమీప గ్రామాల్లో విక్రయిస్తూ ఇదే విధానంగా దోపిడీ చేశారు ఈ కేటుగాళ్లు. మేళ్లచెరువు మండల కేంద్రంలో పిట్టలను విక్రయిస్తూ స్థానికులతో పరిచయం పెంచుకున్న ఈ మోసగాళ్లు ఓ ఇద్దరు వ్యక్తుల నుంచి రూ.3లక్షలు కొట్టేశారు. కూకట్ పల్లి యువకుడికి చెప్పిన స్టోరే వీళ్లకు చెప్పి అందినకాడికి నొక్కేశారు. అయితే మోసగాళ్లు మేళ్లచెరువులోనే మకాం వేసి ఛీటింగ్ చేయడంతో స్థానిక పోలీసులు బాధితుల ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
తీగలాగిన పోలీసులకు చుక్కలు కనిపించే..
కేసు నమోదు చేసిన సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కేటుగాళ్ల కోసం ఆరా తీయగా.. అసలు వాళ్లది హిందూపురం ప్రాంతమే కాదని తెలిసింది. ఏపీలోనూ ఇలాంటి మోసాలే చేసినట్టు తేలింది. ఒక్కొక్కరి వద్ద రూ.20 నుంచి 30 లక్షల వరకు నొక్కేసినట్టు సమాచారం. వీళ్లంతా పెద్ద గ్యాంగ్‌గా ఏర్పడి ఈ దందా పడిపిస్తున్నట్టు తెలిసింది. ఇద్దరు, ముగ్గురు ఓ బ్యాచ్‌గా ఏర్పడి వివిధ గ్రామాలు, ప్రాంతాల్లో మకాం వేస్తారని తెలిసింది. అలా కౌజు పిట్టలను విక్రయిస్తూ స్థానికులతో పరిచయాలు పెంచుకోని ఆ తర్వాత పక్కా ప్లాన్‌తో ఈ దందా నడిపిస్తున్నట్టు తేలింది. ఈ మోసగాళ్లు బెంగళూరు సమీపంలోని ఓ గ్రామ నివాసితులుగా తెలుస్తోంది. ప్రతి వేసవిలో ఈ కేటుగాళ్లు ఈ రకమైన మోసాలకు పాల్పడుతున్నారని సమాచారం.
సెటిల్ మెంట్‌కు రండి.. మోసగాళ్ల ఆఫర్?
తాము చేసిన మోసం బయటపడటంతో ఈ కేటుగాళ్లు కాళ్ల బేరానికి వచ్చినట్టు తెలుస్తోంది. లక్షల రూపాయలు కాజేసి నకిలీ బంగారం అంటగట్టిన ఉదంతంపై దిశ పత్రికలో రావడం, మేళ్లచెరువు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయిందని తెలియడంతో ఆ మోసగాళ్లు కొంతమంది బాధితులను సంప్రదించినట్టు తెలిసింది. బంధువుల నిజమైన బంగారం అని చెప్పడంతోనే మీకు విక్రయించామని, తెలియకుండా తప్పు చేశామని, మమ్ముల్ని క్షమించమని కోరినట్టు తెలిసింది. మీరు ఇచ్చిన డబ్బులు ఎంతో కొంత సెటిల్ మెంట్ చేస్తామని ప్రాధేయపడుతున్నట్లు సమాచారం. మరోవైపు మేళ్లచెరువు పోలీసులు వారిని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఈ కేసుపై కర్ణాటక పోలీసుల సాయం కోసం సూర్యాపేట ఎస్పీ లెటర్ రాసినట్టు తెలుస్తోంది. అయితే వీరి చేతిలో ఎంతోమంది మోసపోయారని, వాళ్లని అరెస్ట్ చేస్తే ఎంత మంది బాధితులు బయటకు వస్తారని స్థానికులు చెబుతున్నారు. బాధితులు మాత్రం మేళ్లచెరువు పోలీసుల హెల్పింగ్ కోసం ఎదురు చూస్తున్నారు.






