కన్నబిడ్డలనే కసాయిలా చంపిన తండ్రి.. నిద్రమాత్రలు ఇచ్చి, గొంతు కోసి ఘాతుకం

by Kema Shiva Kumar |

భార్యపై అనుమానంతో ఓ భర్త 11 ఏళ్ల కవల పిల్లలను నిద్రమాత్రలు ఇచ్చి గొంతు కోసి హతమార్చిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.

కన్నబిడ్డలనే కసాయిలా చంపిన తండ్రి.. నిద్రమాత్రలు ఇచ్చి, గొంతు కోసి ఘాతుకం
X

దిశ, వెబ్‌డెస్క్: కన్నబిడ్డలను కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కాలయముడయ్యాడు. అత్యంత పాశవికంగా తన ఇద్దరు కుమార్తెల ప్రాణాలు తీసిన ఘటన ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లోని కిద్వాయ్ నగర్ ప్రాంతంలో కలకలం సృష్టించింది. మానసిక ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులకు తోడు భార్యపై పెంచుకున్న విపరీతమైన అనుమానం ఒక ఫార్మా వ్యాపారిని హంతకుడిగా మార్చింది.

అనుమానం.. సీసీ టీవీలతో పహారా

పోలీసుల కథనం ప్రకారం.. శశి రంజన్ మిశ్రా (Shariranjan Mishra) (48) అనే వ్యక్తికి తన భార్య రేష్మపై తీవ్రమైన అనుమానం ఉండేది. ఇంటికి ఎవరెవరు వచ్చి వెళ్తున్నారో తెలుసుకునేందుకు ఇంటి గుమ్మం నుంచి బెడ్ రూమ్ వరకు సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశాడంటే అతడి ఉన్మాదం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. జీవితంలో ఎదురవుతున్న టెన్షన్లు, ఆర్థిక ఇబ్బందులు అతడిని మరింత మానసిక క్షోభకు గురిచేశాయి.

నిద్రలోనే పిల్లల నిశ్శబ్ద మరణం..

భార్యపై ఉన్న కోపంతో తన కవల పిల్లలను చంపాలని నిర్ణయించుకున్న శశి రంజన్.. శనివారం రాత్రి ఒక భయంకరమైన పథకాన్ని అమలు చేశాడు. 5వ తరగతి చదువుతున్న తన 11 ఏళ్ల కవల కుమార్తెలకు ఆహారంలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చాడు. భార్య రేష్మ (Reshma), ఆరేళ్ల కుమారుడు పక్క గదిలో నిద్రిస్తుండగా.. ఆదివారం తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో నిందితుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. గాఢ నిద్రలో ఉన్న పిల్లల గొంతు నులిమి, ఆపై కత్తితో గొంతు కోసి అతి కిరాతకంగా హతమార్చాడు.

హత్య చేసి పోలీసులకు ఫోన్..

బిడ్డలను చంపిన తర్వాత నిందితుడు పారిపోలేదు. నెత్తురోడుతున్న మృతదేహాల పక్కనే కూర్చుని ‘డయల్ 112’కు ఫోన్ చేశాడు. “నేను నా పిల్లలను చంపేశాను.. వెంటనే రండి” అంటూ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు వచ్చి కాలింగ్ బెల్ కొట్టే వరకు పక్క గదిలో ఉన్న భార్యకు ఈ విషయం తెలియకపోవడం గమనార్హం. తొలుత పిల్లలను చంపి తాను కూడా ఆత్మహత్య చేసుకోవాలని భావించానని, కానీ బిడ్డలను చంపాక కలిగిన భయంతో ఆ ప్రయత్నం చేయలేకపోయానని నిందితుడు విచారణలో పేర్కొన్నాడు. దక్షిణ కాన్పూర్ డీసీపీ దీపేంద్ర నాథ్ చౌదరి (DCP Deependra Nath Choudhary) ఆధ్వర్యంలో ఫోరెన్సిక్ బృందాలు సంఘటనా స్థలంలో ఆధారాలు సేకరించాయి. నిందితుడి భార్య ఫిర్యాదు మేరకు నౌబస్తా పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ (FIR) నమోదు కాగా, ప్రస్తుతం శశి రంజన్ పోలీసుల కస్టడీలో ఉన్నాడు.

Next Story