తీవ్ర విషాదం.. విద్యుదాఘాతంతో రైతు మృతి

by Bhanu |   (  Updated:2025-07-11 04:12:25  IST  )

మండల పరిధిలోని రాంపురం గ్రామంలో గురువారం రాత్రి విషాదకర ఘటన చోటుచేసుకుంది.

తీవ్ర విషాదం.. విద్యుదాఘాతంతో రైతు మృతి
X

దిశ, చారకొండ: మండల పరిధిలోని రాంపురం గ్రామంలో గురువారం రాత్రి విషాదకర ఘటన చోటుచేసుకుంది. పొలంలో బోరు మోటర్ స్టార్టర్ ఆన్ చేస్తుండగా రైతు విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం, రాంపురం గ్రామానికి చెందిన వంగూరు వెంకటనారి గౌడ్ (54) తన పత్తి పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లాడు.

ఈ క్రమంలో బోరు మోటర్ ఆన్ చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. అదే సమయంలో పక్క పొలంలో ఉన్న ఇతర రైతులు గమనించి వెంటనే ఆయనను చారకొండలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించారు.

వెంకటనారికి భార్య భారతమ్మ, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఘటనపై చిన్న కుమారుడు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు.

Next Story