పాత నాణేల పేరుతో భారీ మోసం… మహిళ ఖాతా ఖాళీ !

by Batti.Sumithra |

వీపనగండ్ల మండలంలోని గోవర్ధనగిరి గ్రామానికి చెందిన ఓ మహిళ సైబర్ మోసానికి బలైంది.

పాత నాణేల పేరుతో భారీ మోసం… మహిళ ఖాతా ఖాళీ !
X

దిశ, వీపనగండ్ల : పాత నాణేలకు భారీ మొత్తంలో డబ్బులు ఇస్తామని మాయమాటలు చెప్పి సైబర్ నేరగాళ్లు అమాయక ప్రజలను మోసం చేస్తున్న ఘటన మండలంలో వెలుగులోకి వచ్చింది. వీపనగండ్ల మండలంలోని గోవర్ధనగిరి గ్రామానికి చెందిన ఓ మహిళ ఈ మోసానికి బలైంది. గ్రామానికి చెందిన జిడ్డు లక్ష్మి అనే మహిళ మొబైల్ ఫోన్‌లో రీల్స్ చూస్తున్న సమయంలో రూ.10, రూ.20 విలువ గల పాత నాణేలు ఇరవై ఉంటే రూ.6 లక్షలు ఇస్తామని ఓ ప్రకటన కనిపించింది. ఈ ప్రకటనకు ఆకర్షితురాలైన ఆమె అందులో ఉన్న ఫోన్ నంబర్‌కు సంప్రదించింది. దీనిని ఆసరాగా చేసుకున్న సైబర్ నేరగాళ్లు ఆమెను నమ్మబలికి, పాత నాణేలకు లక్షలు పొందాలంటే ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్‌బుక్ వివరాలు పంపాలని సూచించారు. బాధితురాలు వారి మాటలు నమ్మి అవసరమైన వివరాలు పంపించింది.

తర్వాత డబ్బులు పొందేందుకు ప్రాసెసింగ్ ఛార్జీల పేరుతో కొంత మొత్తాన్ని చెల్లించాలని నేరగాళ్లు చెప్పడంతో, ఆమె బ్యాంక్ ఖాతాకు సంబంధించిన మొబైల్‌కు వచ్చిన ఓటీపీని కూడా వారికి తెలిపింది. ఈ క్రమంలో ఆమె ఖాతా నుంచి రూ.8,500తో పాటు యూపీఐ ద్వారా రెండు సార్లు రూ.8,550 చొప్పున, మరోసారి రూ.9,550 మొత్తాలు డెబిట్ అయ్యాయి. మొత్తం డబ్బులు కోల్పోయిన తర్వాత కూడా నేరగాళ్లు స్పందించకపోవడంతో మోసపోయినట్లు గ్రహించిన బాధితురాలు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

జాగ్రత్తలు అవసరం

ఇటీవల పాత నాణేలు, నోట్ల పేరుతో భారీ లాభాలు వస్తాయని చెప్పి సైబర్ మోసాలు పెరుగుతున్నాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. తెలియని వ్యక్తులకు ఆధార్, బ్యాంక్ వివరాలు, ఓటీపీలు ఇవ్వకూడదని, ఇలాంటి ప్రకటనలను నమ్మవద్దని సూచిస్తున్నారు. ఈ ఘటనతో గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన లోపాన్ని ఉపయోగించుకుంటూ సైబర్ నేరగాళ్లు మరింతగా చెలరేగుతున్నట్లు స్పష్టమవుతోంది.

Next Story