రాష్ట్రంలో డ్రగ్స్ కట్టడికి CP సజ్జనార్ సరికొత్త ప్రయోగం

by Gantepaka Srikanth |

రాష్ట్రంలో డ్రగ్స్ కట్టడికి CP సజ్జనార్ సరికొత్త ప్రయోగం

రాష్ట్రంలో డ్రగ్స్ కట్టడికి CP సజ్జనార్ సరికొత్త ప్రయోగం
X

దిశ, వెబ్‌డెస్క్: డ్రగ్స్ నియంత్రణ చర్యల్లో భాగంగా బంజారాహిల్స్‌లోని టీజీఐసీసీసీలో శుక్రవారం కేంద్ర, రాష్ట్ర ఏజెన్సీలతో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్(CP Sajjanar) అత్యున్నత స్థాయి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడారు. సమాజాన్ని పట్టిపీడిస్తున్న మత్తు మహమ్మారిని ఏరిపారేసేందుకు పకడ్బందీ చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే రౌడీషీటర్లపై ఎటువంటి నిఘా ఉంచుతామో.. డ్రగ్స్‌ నేరగాళ్లు, పెడ్లర్లపైనా అదే స్థాయి నిఘా పెడుతున్నట్లు చెప్పారు. నగరంలో మాదకద్రవ్యాల నెట్‌వర్క్‌కు చెక్ పెట్టేందుకు 'హైదరాబాద్‌ నార్కోటిక్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వింగ్‌' (హెచ్-న్యూ)ను మరింత బలోపేతం చేస్తున్నామని అన్నారు.

ప్రస్తుతం ఉన్న బృందాలకు అదనంగా మరో నాలుగైదు కొత్త బృందాలను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. మాదకద్రవ్యాల నిర్మూలన అనేది ఒక్కరోజుతో ముగిసే ప్రక్రియ కాదని.. అది నిరంతర పోరాటమన్నారు. ఈ క్రమంలో అన్ని విభాగాలు పరస్పర సహకారంతో పనిచేయాలని ఈ సమావేశంలో సూచించినట్లు తెలిపారు. ఇకపై ప్రతినెలా అన్ని ఏజెన్సీలతో సమన్వయ సమావేశాలు నిర్వహించి, కేసుల పురోగతిని సమీక్షిస్తామని అన్నారు. డ్రగ్స్ కట్టడికి అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తామని తెలిపారు. ఈ భేటీకి ఐబీ, డీఆర్‌ఐ, ఎన్‌సీబీ, ఎక్సైజ్‌, కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌, ఈగల్, ఎఫ్‌ఆర్‌ఆర్‌వో తదితర అధికారులు హాజరయ్యారు.

Next Story