ఏసీబీ వలలో అవినీతి అధికారి.. పెండింగ్ బిల్లుల కోసం డబ్బులు డిమాండ్

by Chintha Aamani |   (  Updated:2025-05-10 06:39:06  IST  )

ఏసీబీ వలకు అవినీతి అధికారి చిక్కాడు. ఏకంగా రూ.

ఏసీబీ వలలో అవినీతి అధికారి.. పెండింగ్ బిల్లుల కోసం డబ్బులు డిమాండ్
X

దిశ ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల : ఏసీబీ వలకు ఓ అవినీతి తిమింగలం చిక్కింది. ఏకంగా రూ. 60,000/- లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా నీటి పారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఈఈ) గా విధులు నిర్వహిస్తున్న అమరేందర్ రెడ్డి జిల్లాలోని ముస్తాబాద్ మండలం ఆవునూరు-అగ్రహారం మద్యలో నిర్మించిన చెక్ డ్యాం బిల్లుల విడుదల కోసం హన్మకొండకు చెందిన సూరం రవీందర్ అనే కాంట్రాక్టర్ వద్ద లక్ష రూపాయల లంచం డిమాండ్ చేయగా, 75 వేలకు కుదిరింది. కరీంనగర్ లోని విద్యారణ్యపురి కాలనీలో నివాసం ఉంటున్న తన ఇంట్లో శుక్రవారం రాత్రి 8 గంటలకు రవీందర్ వద్ద రూ.60 వేల రూపాయల లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులకు అమరేందర్ రెడ్డి పట్టుబడ్డాడు.

అయితే సదరు గుత్తేదారు 8 కోట్ల నిధులతో మంజూరైన చెక్ డ్యాంను రెండేళ్ల క్రితం పూర్తి చేసి ఏడాది క్రితం చెక్ డ్యామ్ నిర్మాణం బిల్లులు అమరేందర్ రెడ్డికి అందించాడు. బిల్లుల మంజూరు నిమిత్తం అమరేందర్ రెడ్డి సదరు గుత్తేదారు వద్ద గతంలోనే రూ. 4.50 లక్షలు తీసుకున్నాడు. మరో రూ.50 లక్షల బిల్లులు గుత్తేదారుడికి రావాల్సి ఉండగా, వారం రోజుల క్రితం రూ. లక్ష లంచం ఇవ్వాలని ఆ అధికారి డిమాండ్ చేశాడు. గుత్తేదారు అంత ఇచ్చుకోలేనని చెప్పగా.. రూ. 75 వేలు ఇవ్వాలన్నాడు. శుక్రవారం రూ.60 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డాడు.

ఫలించని పన్నాగం

అయితే అనిశా అధికారులు వస్తారని గ్రహించిన సదరు అధికారి వారికి చిక్కకుండా మంచి పన్నాగమే పన్నాడు. ఇంటి బయట ఆరేసిన తన కొడుకు టీ షర్ట్ లో డబ్బులు ఉంచి, ఇంటి వెనక బహిరంగ ప్రదేశంలో ఉంచాలని సదరు కాంట్రాక్టర్ కు సూచించాడు. అయినా అధికారి పన్నిన పన్నాగం ఫలించలేదు. ముందే పసిగట్టిన ఎసిబి అధికారులు చాకచక్యంగా వ్యవహరించి అమరేందర్ రెడ్డిని పట్టుకున్నారు. సీసీటీవీలో రికార్డు అయిన పుటేజి ఆధారంగా అమరేందర్ రెడ్డిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. శనివారం కరీంనగర్ లోని ఏసీబీ కోర్టులో అమరేందర్ రెడ్డిని హాజరుపరచనున్నట్లు జెసిబి డీఎస్పీ రమణమూర్తి తెలిపారు. కాగా అమరేందర్ రెడ్డి ఇలా చాలా మంది కాంట్రాక్టర్ల వద్ద అధిక మొత్తంలో లంచాలు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

Next Story