ఏపీ టూ బెంగళూరు.. వయా హైదరాబాద్.. హషీష్ ఆయిల్ ముఠా గుట్టు రట్టు

by Bhanu |

హైదరాబాద్ నుంచి ఇతర రాష్ట్రాలకు హషీష్ ఆయిల్‌ ను సరఫరా చేస్తున్న ఇద్దర్నీ రాచకొండ ఎస్ఓటీ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు.

ఏపీ టూ బెంగళూరు.. వయా హైదరాబాద్.. హషీష్ ఆయిల్ ముఠా గుట్టు రట్టు
X

దిశ, సిటీక్రైం : హైదరాబాద్ నుంచి ఇతర రాష్ట్రాలకు హషీష్ ఆయిల్‌ ను సరఫరా చేస్తున్న ఇద్దర్నీ రాచకొండ ఎస్ఓటీ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఎల్బీనగర్ రాచకొండ పోలీసు కమిషనర్ క్యాంపు కార్యాలయంలో సీపీ సుధీర్ బాబు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆంధ్ర ప్రదేశ్ అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన క్రిష్ణా గంజాయి నుంచి హషీష్ ఆయిల్‌ ను తీసి అమ్ముతున్నాడు.

స్నేహితులైన కేశవరావు, ఒడిశాకు చెందిన జయరాం కేముదులతో కలిసి ఈ హాషీష్ ఆయిల్‌ దందాను చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో బెంగళూరు నుంచి వీరికి 20 కేజీల హషీష్ ఆయిల్‌ కావాలంటూ ఆర్డర్ వచ్చింది. ఈ 20 కేజీల హషీష్ ఆయిల్‌ ను డెలివరీ చేసేందుకు కేశవరావు, జయరాం కేముదు లు బుధవారం పెద్దఅంబర్ పేట్ ఓఆర్ఆర్ వద్ద ఉన్న సంపూర్ణ హోటల్ వద్దకు వచ్చారు. ఈ సమాచారం అందుకున్న ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకుని సోదాలు జరుపగా 1.20 కోట్లు విలువ చేసే 20 కేజీల హషీష్ ఆయిల్‌ పట్టుబడింది.

విచారణలో బెంగళూరు నుంచి వచ్చే పార్టీకి డెలివరీ కోసం తీసువచ్చామని తెలిపారు. ఈ ఇద్దర్నీ అరెస్టు చేశారు. ప్రధాన సూత్రధారి క్రిష్ణ కోసం గాలిస్తున్నారు. బెంగళూరులో ఎవరీకి డెలివరీ చేస్తున్నారనే వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. ఒక కేజీ హషీష్ ఆయిల్‌ ను తయారు చేసేందుకు దాదాపు 35 కేజీల గంజాయిని మరగబెట్టి ఈ మత్తు ఆయిల్‌ ను తీస్తారని పోలీసుల విచారణలో తెలిసింది. కేజీ హషీష్ ఆయిల్‌ ను 6 నుంచి 8 లక్షల వరకు విక్రయిస్తున్నట్లు బయటపడింది.

Next Story